గ్రూప్‌-2 పోస్టింగులు ఇంకెప్పుడు?

23 May, 2018 01:33 IST|Sakshi

నోటిఫికేషన్‌ వచ్చి రెండున్నరేళ్లు.. 

పరీక్షలు జరిగి ఏడాదిన్నర 

న్యాయ వివాదాల పరిష్కారంలో తీవ్ర జాప్యం 

ఆందోళనలో అభ్యర్థులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రూప్‌-2 ఉద్యోగాల భర్తీ వ్యవహారం గందరగోళంలో పడిపోయింది. నోటిఫికేషన్‌ వచ్చి రెండున్నరేళ్లు.. పరీక్షలు జరిగి ఏడాదిన్నర కావొస్తున్నా.. భర్తీ ప్రక్రియ ముందుకు పడలేదు. న్యాయ వివాదాల కారణంగా అభ్యర్థులకు ఎదురుచూపులు తప్పడం లేదు. గ్రూప్‌-2 పరీక్షకు సంబంధించి కోర్టు పరిధిలో కేసు ఉండటంతో ఫలితాలు వెల్లడించడం లేదని టీఎస్‌పీఎస్సీ స్పష్టం చేస్తోంది. దీనిపై ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టి, భర్తీ సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించాలని అభ్యర్థులు విజ్ఞప్తి చేస్తున్నారు. 

కేసులతో చిక్కులు.. 
గ్రూప్‌-2 కేటగిరీలో 439 ఉద్యోగాల భర్తీ కోసం 2015 డిసెంబర్‌లో టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్‌ జారీ చేసింది. అనంతరం మరో 593 పోస్టులను కలిపి మొత్తంగా 1,032 పోస్టులతో సవరణ నోటిఫికేషన్‌ జారీ చేసింది. దానికి రాష్ట్రవ్యాప్తంగా 7.89 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా.. 2016 నవంబర్‌ 11, 13 తేదీల్లో నిర్వహించిన రాత పరీక్షలకు 5.17 లక్షల మంది హాజరయ్యారు. అయితే పరీక్షల సమయంలో ఇన్విజిలేటర్లు పొరపాటుగా కొందరు అభ్యర్థులకు ఇతరుల ఓఎంఆర్‌ పత్రాలు ఇవ్వడం, తర్వాత మార్చడం, దాంతో అభ్యర్థులు అప్పటికే వ్యక్తిగత వివరాలు నింపిన చోట వైట్‌నర్‌ పెట్టి.. ఇతర ఆప్షన్లను ఎంపిక చేసుకోవడం జరిగాయి. అయితే పరీక్ష నిబంధనల ప్రకారం అలా వైట్‌నర్‌ వినియోగించిన ఓఎంఆర్‌ పత్రాలను మూల్యాంకనం చేయబోమని టీఎస్‌పీఎస్సీ తొలుత స్పష్టం చేసింది.

అయితే ఇలా వేలాది మంది అభ్యర్థులు పొరపాటు చేశారని గుర్తించింది. దీనిపై ఉస్మానియా, జేఎన్టీయూ ప్రొఫెసర్లతో టెక్నికల్‌ కమిటీని వేసి.. వైట్‌నర్‌ వినియోగం విషయంలో అభ్యర్థుల హడావుడే కారణమని, కావాలని చేయలేదని నిర్ధారించుకుంది. ఈ నేపథ్యంలో వారందరి ఓఎంఆర్‌ పత్రాలను పరిగణనలోకి తీసుకున్న టీఎస్‌పీఎస్సీ... మూల్యాంకనం పూర్తిచేసింది. 1,032 పోస్టులకు 1:3 నిష్పత్తిలో 3,147 మందిని సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు కూడా పిలిచింది. కానీ ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ మరికొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీనిపై కోర్టు ఏర్పాటు చేసిన న్యాయవాదుల కమిటీ కూడా వైట్‌నర్‌ వినియోగంలో అభ్యర్థులది కేవలం హడావుడి పొరపాటు మాత్రమేనని తేల్చింది. దీనిపై కోర్టు నిర్ణయం వెలువడాల్సి ఉంది. మరోవైపు గ్రూప్‌-2లో 17 ప్రశ్నలను తొలగించి ఫైనల్‌ ‘కీ’ఇవ్వడాన్ని సవాలు చేస్తూ కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు కూడా తేలాల్సి ఉంది.

మరిన్ని వార్తలు