‘కంటి వెలుగు’ ఆపరేషన్లు ఇంకెప్పుడు? 

13 Jan, 2019 01:19 IST|Sakshi

8 లక్షల మంది ఆపరేషన్ల కోసం ఎదురుచూపులు 

మరో నెలలో పూర్తికానున్న ‘కంటివెలుగు’... అయినా నిర్లక్ష్యం 

సాక్షి, హైదరాబాద్‌: ‘కంటి వెలుగు’ఆపరేషన్లపై నీలినీడలు అలుముకున్నాయి. వచ్చే నెలలో కంటివెలుగు కార్యక్రమం పూర్తి అయ్యే పరిస్థితి ఉన్నా ఇప్పటికీ ఆపరేషన్లపై సర్కారు నిర్ణయం తీసుకోలేదు. కంటి శిబిరాలు నిర్వహించాక అవసరమైన వారందరికీ ఆపరేషన్లు చేస్తామని ఇదివరకు సర్కారు స్పష్టం చేసింది. అక్కడక్కడా ఆపరేషన్లు వికటించడం, వరంగల్‌లో ఏకంగా 18 మందికి ఒకే ఆసుపత్రిలో ఆపరేషన్లు వికటించి పరిస్థితి సీరియస్‌ కావడంతో వైద్య, ఆరోగ్యశాఖ వర్గాలు కంగుతిన్నాయి. అప్పుడు ఎన్నికల సీజన్‌ కావడంతో ఆపరేషన్లను నిలిపివేశారు.

ఎన్నికలై కొత్త ప్రభుత్వం ఏర్పడి నెలరోజులైనా వైద్య, ఆరోగ్య శాఖ వాటిపై ఇప్పటివరకు నిర్ణయం తీసుకోలేదు. దీంతో ఆపరేషన్‌ కోసం లక్షలాది మంది ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం కంటివెలుగు కార్యక్రమాన్ని గతేడాది ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రారంభించింది. ఇప్పటివరకు 1.28 కోట్ల మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. అందులో 43.44 లక్షల(33.92%) మందికి ఏదో రకమైన కంటి లోపాలున్నట్లు గుర్తించారు. వారిలో 20 లక్షల మందికి రీడింగ్‌ గ్లాసులు అందజేశారు. మరో 15.40 లక్షల మందికి చత్వారం ఉన్నట్లు నిర్ధారించి 5.21 లక్షల మందికి కళ్లద్దాలు ఇచ్చారు. 8.06 లక్షలమంది లబ్ధిదారులకు ఆపరేషన్లు అవసరమని వైద్యులు నిర్ధారించినా అవి నిలిచిపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. కంటి వెలుగుపై వైద్య, ఆరోగ్యశాఖ యంత్రాంగం కేంద్రీకరణ తగ్గించింది. వైద్యాధికారులంతా ఇప్పుడు ఈఎన్‌టీ, దంత పరీక్షలపైనే దృష్టి సారించారు.  

ఏ నిర్ణయమూ తీసుకోని దుస్థితిలో యంత్రాంగం 
కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ‘ఆయుష్మాన్‌భవ’లో క్యాటరాక్ట్‌ ఆపరేషన్‌కు రూ.6 వేలు ఇస్తున్న నేపథ్యంలో తమకు కనీసం రూ.5 వేలైనా చెల్లించాలని ప్రైవేటు కంటి ఆసుపత్రుల యాజమాన్యాలు కోరుతున్నాయి. ఆపరేషన్‌కు రెండు వేల రూపాయలే ఇస్తుండటంతో తమకు గిట్టుబాటు కావడంలేదని అంటున్నాయి. గ్రామాల్లో ఈఎన్‌టీ, దంత పరీక్షలకు వెళితే కంటివెలుగు బాధితులు నిలదీసే పరిస్థితి రానుంది.

మరిన్ని వార్తలు