‘స్పీడ్‌’గా దోచేస్తోంది!

23 Jan, 2019 02:17 IST|Sakshi

రూ.17 స్పీడ్‌పోస్టుకు రూ.35 వసూలు.. ఏటా కోట్లు వసూలు చేస్తున్న ఆర్టీఏ

వసూలు చేసిన మొత్తానికి ఆడిటింగ్‌ ఎక్కడ?.. నేరుగా ఇచ్చే కార్డులకూ స్పీడ్‌ పోస్ట్‌ చార్జీలు

ఆర్టీఏలో పోస్టల్‌ చార్జీల పేరిట భారీ దోపిడీ సాగుతోంది. ఏజెంట్ల చేతివాటం, అధికారుల ఏమరుపాటు కారణంగా వినియోగదారుల జేబులకు చిల్లు పడుతోంది. ఏటా స్పీడ్‌ పోస్టుల పేరిట వసూలు చేసిన కోట్ల రూపాయలకు ఆడిటింగ్‌ కూడా జరగకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. దీంతో ఈ డబ్బంతా ఎవరి జేబుల్లోకి వెళ్తోందన్నది సమాధానం లేని ప్రశ్నగా మిగిలింది. 2008 నుంచి ఇలాగే పోస్టల్‌ చార్జీలు వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే కరవయ్యాడు.

ఏంటీ సమస్య?
ఆర్టీఏ కార్యాలయాల్లో రోజూ వాహనాల రిజి స్ట్రేషన్లు, పర్మినెంట్‌ లైసెన్స్‌లు, ట్రాన్స్‌ఫర్‌ ఆఫ్‌ ఓనర్‌షిప్, ఆర్‌సీ డూప్లికేట్‌ ఇలా రకరకాల కార్డులు జారీ చేస్తుంటారు. జారీ చేసే స్మార్ట్‌ కార్డుల సంఖ్య రోజుకు దాదాపు 350కి పైగానే ఉం టుంది. నిబంధనల ప్రకారం వీటన్నింటినీ స్పీడ్‌ పోస్టుద్వారా పంపాలి. కానీ వీటిలో 80% అంటే దాదాపు 300 కార్డులు దళారుల చేతికే వెళ్తు న్నాయి. ఇందుకు వాహనదారుల వద్ద రూ.100 నుంచి 150 వరకు వసూలు చేస్తు న్నారు. అంటే అధికారుల సాయంతో ఏజెంట్లు నేరుగా చేతికే కార్డులు ఇస్తూ చేతివాటం ప్రదర్శిస్తున్నారు.

స్పీడ్‌ పోస్టు గురించి నిబంధనలు ఇవీ..
భారతీయ తపాలా సంస్థ పెట్టిన నిబంధనలు తెలంగాణ రవాణా శాఖలో అమలు కావ ట్లేదు. 40 గ్రాముల వరకు 350 కిలోమీటర్ల దూరం వరకు రూ.17 చార్జీ చేస్తారు. కానీ తెలంగాణ రవాణా శాఖ జారీ చేసే లైసెన్సుల దూరం మహా అయితే 15 కి.మీ. మించదు. జిల్లాల్లో ఈ పరిధి కాస్త అధికంగా ఉండొచ్చు. కార్డు బరువు 9 గ్రాములే ఉండటం గమనార్హం. ఇందులో కవర్‌ ఖర్చు ఒక్క రూపాయి అనుకున్నా కార్డు బట్వాడాకు అయ్యే ఖర్చు రూ.18 మాత్రమే. మరి రూ.35 ఎందుకు వసూలు చేస్తున్నారో ఎవరికీ తెలియదు. ప్రజల నుంచి అక్రమంగా కోట్ల రూపాయలు వసూలు చేస్తున్న రవాణా శాఖలో ఈ విషయంపై ఇంతవరకూ అంత ర్గత ఆడిటింగ్‌ జరగకపోవడం గమనార్హం. ఇంత జరుగుతున్నా ఇంటర్నరల్‌ ఆడిటింగ్‌ ఎందుకు జరగట్లేదు.. అదనంగా వసూలవు తున్న మొత్తం ఎవరి ఖాతాల్లోకి వెళ్తోంది.. దళారులు నేరుగా కార్డులు ఎలా ఇవ్వ గలుగుతున్నారనే వాటికి సమాధానం లేదు. 74 ఆఫీసుల్లో రోజుకు దాదాపు 50 కార్డులు మాత్రమే స్పీడ్‌ పోస్టు ద్వారా బట్వాడా అవుతున్నాయి.

సీఎం, గవర్నర్‌కు ఫిర్యాదు చేస్తాం 
వాహనదారుల నుంచి ఆర్టీఏ అధి కారులు కోట్లాది రూపాయలు అక్ర మంగా వసూలు చేస్తున్నారు. తపాలా శాఖ నిబంధనలను కాదని, అదనంగా వసూలు చేస్తున్న రూ.17కు ఎందుకు లెక్క చెప్పరు? ఇలా వసూలవుతున్న కోట్ల రూపాయలను ఏం చేస్తున్నారు? ఈ విషయాన్ని త్వరలోనే ముఖ్యమంత్రి, గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్తాం. దీనిపై తప్పకుండా ఏసీబీ విచారణ జరిపించాలి.
– దయానంద్, తెలంగాణ ఆటో, మోటార్స్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌

దళారులను ఆశ్రయించొద్దు..
వాహనదారులు దళారులను ఆశ్రయించొద్దు. నిబంధనల ప్రకారం కార్డులన్నీ స్పీడ్‌ పోస్టులోనే తీసుకోవాలి. అలాంటివారిపై ఫిర్యాదులు చేస్తే చర్యలు తీసుకుంటాం.    
– రమేశ్, జేటీసీ, ఆర్టీఏ

చేతికిచ్చే వాటిలోనూ చేతివాటమేనా?
మిగిలిన స్మార్ట్‌ కార్డులను తప్పనిసరిగా స్పీడ్‌పోస్టులోనే పంపాలని నిబంధనలు ఉన్నాయి. కాబట్టి వాటికి పోస్టల్‌ చార్జీల కింద రూ.35 వసూలు చేస్తున్నారని అనుకుందాం. కానీ ఏదైనా వాహనానికి ఎన్‌ఓసీ, ఇంటర్నేషనల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌లు తీసుకున్నప్పుడు చేతికే ఇవ్వాలి. కానీ అధికారులు వీటికి ఇస్తున్న రశీదుల్లోనూ రూ.35 స్పీడ్‌ పోస్టు చార్జీలు కలిపి వడ్డిస్తుండటంపై విస్మయం వ్యక్తం చేస్తున్నారు. 


74 కార్యాలయాల్లో పోస్టు ద్వారా పంపుతున్న మొత్తం కార్డులు    3,700
స్పీడ్‌ పోస్టుకు వాస్తవంగా వసూలు చేయాల్సింది    రూ.18
ప్రస్తుతం అదనంగా వసూలు చేస్తోంది    రూ.17
3,700 కార్డులకు ఒకరోజు పడుతున్న అదనపు భారం    రూ.62,900
22 పనిదినాలకు పడే భారం    రూ.13,83,800
- భాషబోయిన అనిల్‌కుమార్‌

మరిన్ని వార్తలు