కార్పొరేషన్లకు డైరెక్టర్లేరీ?

17 Jun, 2018 01:41 IST|Sakshi

     చైర్మన్లకు పూర్తికావస్తున్న పదవీకాలం

     పోటీ పడుతున్న ఆశావహులు

     మంత్రులు, ఎంపీల వద్దకు చక్కర్లు కొడుతున్న నాయకులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కార్పొరేషన్లు, నామినేటెడ్‌ పదవులకు పదవీకాలం పూర్తికావస్తోంది. రాష్ట్రంలోని 50 కార్పొరేషన్లకు చైర్మన్లను మాత్రమే నియమించారు. ప్లానింగ్‌ కమిషన్‌ బోర్డు, మిషన్‌ భగీరథకు ముఖ్యమంత్రి చైర్మన్‌గా ఉండటం వల్ల, వీటికి వైస్‌ చైర్మన్లను నియమించారు. వీటిలో కమిషన్లకు మినహా కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమించలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటై, టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు పూర్తయింది. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకాశాన్ని బట్టి, అవసరాన్ని బట్టి కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించారు. టీఆర్‌ఎస్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే నియామకమైన కార్పొరేషన్లతో పాటు ఉన్నత విద్యామండలి, ప్రెస్‌ అకాడమీకి రెండోసారి కూడా సీఎం నియమించారు. అయితే పలు కార్పొరేషన్లకు రెండేళ్ల కాలపరిమితితోనే చైర్మన్ల నియామకం చేశారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏర్పాటైన ఏడాది, రెండేళ్ల తర్వాత నియామకమైన వాటిలో కొన్నింటికి ఇప్పటికే పదవీకాలం పూర్తయింది. మరికొన్ని ఒకటి, రెండు నెలల్లోనే పూర్తికాబోతున్నాయి, కార్పొరేషన్లకు దశలవారీగా చైర్మన్లను నామినేట్‌ చేయడంతో, అదే పద్ధతిలో చైర్మన్ల పదవులకు పదవీకాలం పూర్తి అవుతున్నది.  

పోటీపడుతున్న ఆశావహులు... 
కార్పొరేషన్లకు పదవీకాలం పూర్తవుతున్న నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలంటూ పార్టీ నేతలు పోటీపడుతున్నారు. కార్పొరేషన్ల చైర్మన్లు దాదాపుగా 50 వరకు నియామకమైతే, వాటిలో ఎక్కువగా టీఆర్‌ఎస్‌లో సుదీర్ఘంగా పనిచేసినవారికే అవకాశం దక్కింది. ఉద్యమకాలంలోనూ, పార్టీలోనూ క్రియాశీలంగా, విశ్వాసంగా పనిచేసిన నాయకులకే సీఎం కేసీఆర్‌ అవకాశం కల్పించారు. తెలంగాణ రాష్ట్రావిర్భావానికి కొద్దిగా ముందుగానో, ఆవిర్భావం సందర్భంగానో చాలామంది ఇతర పార్టీల నేతలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇలా కొత్తగా చేరినవారికి కార్పొరేషన్ల పదవుల్లో చాలా తక్కువ అవకాశాలు వచ్చాయి. పార్టీలో కొత్తగా చేరిన నాయకులతో పాటు, నామినేటెడ్‌ పదవులకోసం చాలా మంది టీఆర్‌ఎస్‌ నాయకులు అవకాశాలకోసం ఎదురుచూస్తున్నారు. కార్పొరేషన్‌ చైర్మన్లకు పదవీకాలం పూర్తికావస్తుండటంతో ఇలాంటి ఆశావహుల్లో ఆశలు పెరుగుతున్నాయి. ఏదైనా కార్పొరేషన్‌కు అవకాశం కావాలంటూ ఈ నాయకులు ప్రయత్నాలను తీవ్రతరం చేశారు.

నామినేటెడ్‌ పదవుల్లో అవకాశం కల్పించాలంటూ మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, ఎంపీలు కవిత, సంతోష్‌రావు, ప్రభుత్వంలోని సీనియర్‌ మంత్రుల దగ్గరకు క్యూలు కడుతున్నారు. ఉద్యమకాలంలో పార్టీకోసం ఎంతోకాలం పనిచేశామని, పార్టీ పిలుపులను క్షేత్రస్థాయిలో అమలుచేయడానికి ఎన్నో వ్యయ ప్రయాసలకు గురయ్యామంటూ టీఆర్‌ఎస్‌ పాతనేతలు వివరిస్తున్నారు. తాము పడిన కష్టనష్టాలను, వ్యయ ప్రయాసలను గుర్తుచేసి, నామినేటెడ్‌ పదవిని ఇవ్వాలంటూ వీరు అభ్యర్థిస్తున్నారు. అధికారం రాకముందు, అధికారం వచ్చిన తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులుకూడా తమ అర్హతలను బట్టి, అవకాశాలకొరకు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నుంచి టీఆర్‌ఎస్‌లో చేరే సమయంలో తమ పరిస్థితి, టీఆర్‌ఎస్‌లో చేరిన తర్వాత తాము చేసిన కృషిని వీరు గుర్తుచేస్తున్నారు. పార్టీలో కష్టపడుతున్నామని, భవిష్యత్తులోనూ పార్టీకోసం అదేవిధంగా, విధేయంగా పనిచేస్తామంటూ పార్టీ ముఖ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు.  

డైరెక్టర్లేరీ...? 
రాష్ట్రంలో దాదాపుగా 50 కార్పొరేషన్లుకు చైర్మన్లను మాత్రమే భర్తీ చేశారు. వీటిలో డైరెక్టర్ల నియామకాన్ని చేయలేదు. ఒక్కొక్క కార్పొరేషన్‌కు అవసరాన్ని బట్టి కనిష్టంగా ఏడుగురికి తగ్గకుండా నియమించుకునే వీలుంది, అవసరాన్ని బట్టి కొన్నింటికి 20 మందిని కూడా డైరెక్టర్లను నియమించుకునే అవకాశముంది. కార్పొరేషన్‌ డైరెక్టర్లుగా అవకాశం కావాలంటూ నియోజకవర్గ స్థాయి నేతలు ఆశించారు. ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీచేసే అవకాశం రాని, పోటీచేయడానికి ఆసక్తిలేని నాయకులు ఏదో ఒక అవకాశం రాకపోతుందా అని ఈ నాలుగేళ్లు ఎదురుచూశారు. కార్పొరేషన్లకు డైరెక్టర్లను నియమిస్తే ఇప్పటికే అన్నింటిలో కలిపి దాదాపుగా 1000 మంది నాయకులకు నామినేటెడ్‌ పోస్టు ల్లో అవకాశాలు దక్కేవని అంటున్నారు. డైరెక్టర్లను నియమించకుండానే, చైర్మన్లకు పదవీకాలం పూర్తికావడంపై క్షేత్రస్థాయి నాయకులు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు