రబీ అంతేనా..?

29 Oct, 2014 03:40 IST|Sakshi
రబీ అంతేనా..?

సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి మహారాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలపాటు (జూన్ 30 నుంచి అక్టోబరు 29) బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తివేస్తుంది. దీంతో నీటి రాకకు అంతరాయం తొలగి గోదారమ్మ గలగలలు పరవశింపజేస్తాయని మన రైతులు ఆశించారు. ఆ ఆశలు అడియాసలే అయ్యాయి. వానలు లేక, వరదలు రాక శ్రీరాంసాగర్ కళా విహీనమైంది.

ప్రాజెక్టు నీటి నిలువ 90.31 టీఎంసీల నుంచి 24 టీఎంసీలకు పడిపోయింది. బుధవారం బాబ్లీ గేట్లు మూసివేయనుండడంతో రబీ సాగు ప్రశ్నా ర్థకంగా మారనుంది. తెలంగాణలోని ఆరు జిల్లాలలోని 18.66 లక్షల ఎకరాలపై ఈ ప్రభావం పడనుంది.

 
 సాక్షి ప్రతినిధి, నిజామాబాద్:
 ఉత్తర తెలంగాణ జిల్లాల వరప్రదాయిని అయిన శ్రీరాంసాగర్ మరింతగా బోసిపోనుం ది. ఈ ప్రాజెక్టు కింద ఆధారపడిన ఆరు జిల్లా ల ఆయకట్టు రైతులు రబీ సాగుకు దూరం కానున్నారు. గతేడాది ఇదే సమయంలో ఎస్‌ఆర్‌ఎస్‌పీ నీటిమట్టం 1,091 అడుగులు కాగా, ప్రస్తుతం 1,068 అడుగులే ఉంది. గతేడాది 90.31టీఎంసీల నీరు  నిలువ ఉండగా, ఇప్పు డు 24 టీఎంసీలకే పరిమితమైంది. ఇందులో ఐదు టీఎంసీలు నిజామాబాద్, కరీంనగర్, వరంగల్ జిల్లాల ముంపు ప్రాంతాల తాగునీటి అవస రాల కోసం వినియోగించాలి. సాగుకు చుక్కనీరు వదిలే పరిస్థితి లేదు.

 ఎందుకిలా
 జూన్ 30న బాబ్లీ ప్రాజెక్టు గేట్లు తెరిస్తే, దానికి తోడు వానలు కురిస్తే జులై ఒకటి నుంచి నాలుగు నెలలపాటు శ్రీరాంసాగర్‌లోకి భారీగా వరద నీరు చేరుతుందని భా వించారు. వానలు కురియలేదు. ఎగువ నుంచి వరదలు రాలేదు. గతేడాది కురిసిన వానల కారణంగా చేరిన 24 టీఎంసీల నీరే ప్రస్తుత నిల్వగా ఉంది. ఇందులో ఐదు టీఎంసీలు తాగునీటి అవసరాలకు పోను, మరో ఐదు టీఎంసీలను ప్రాజెక్టు వాటర్ లాసెస్ (ఆవిరి)గా చూపుతారు. మిగిలిన 14 టీఎంసీలలో ఐదు టీఎంసీలు ఎస్‌ఆర్‌ఎస్‌పీ కనిష్ట నీటి మట్టం కాగా, ఇక 9 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉండే అవకాశం ఉంది.

ఖరీఫ్ సాగు కోసం కనీసం 35 టీఎంసీలు, రబీ కోసం 50 టీఎంసీల నీరు అవసరం ఉంటుంది. ఈ నేపథ్యంలో 9 టీఎంసీలు ఏ మూలకూ సరిపోవు. దీంతో రబీ కోసం చుక్క నీరు కూడ వదిలే అవకాశం లేదని నీటి పారుదల శాఖ అధికారులు చెబుతున్నారు.

 ‘బాబ్లీ’తో ఆందోళనే
 మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకా బాబ్లీ వద్ద అక్కడి సర్కారు ప్రాజెక్టును నిర్మించింది. ఇది ఎస్‌ఆర్‌ఎస్‌పీకి ఎగువ భాగాన 80 కిలోమీటర్ల దూరం లో ఉంది. బాబ్లీ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ రైతులు అనేక ఆందోళనలు చేశారు. చివరకు ఇది రెండు రాష్ట్రాల మధ్య జల వివాదంగా మారింది. రెండు రాష్ట్రాలూ సుప్రీం కోర్టు గడప తొక్కాల్సి వచ్చింది.

విచారణ అనంతరం, ఏటా జూన్ 30 నుంచి అక్టోబరు 29 వరకు బాబ్లీ గేట్లను తెరవాలని సుప్రీం కోర్టు మహారాష్ట్రను ఆదేశించింది. ఈ సారి ఈ నాలుగు నెలల కాలమూ తెలంగాణకు ఆశించిన సాగు నీటి ప్రయోజనం తీర్చలేదు. ఈ క్రమంలో బుధవారం బాబ్లీ గేట్లు మళ్లీ మూసుకోనున్నాయి. వాస్తవానికి ఈ మాయా గేట్లు తెరుచుకున్నా, మూసుకున్నా ఎస్‌ఆర్‌ఎస్‌పీకీ గండమే.
 
ఇక ఎడారేనా!

 ఎస్‌ఆర్‌ఎస్‌పీలో ఆశించిన స్థాయిలో నీరు లేకపోవడంతో నిజామాబాద్, ఆదిలాబాద్, కరీం నగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాకు చెందిన 18,66,765 ఎకరాల ఆయకట్టు పరి స్థితి డోలాయమానంలో పడింది. నిజామాబా ద్ జిల్లాలో 1,60,578 ఎకరాలు, ఆదిలాబాద్ లో 1,45,387, కరీంనగర్‌లో 6,72,900, వరంగల్‌లో 4,71,67 8, ఖమ్మంలో 1,28,914, నల్గొండ జిల్లాలో 2,87,508 ఎకరాలపై తీవ్ర ప్రభావం పడనుంది. శ్రీరాంసాగర్ ద్వారా ఎన్‌టీపీసీ వినియోగానికి, కరీంనగర్, జగిత్యా ల, కోరుట్ల, సిరిసిల్ల, వేములవాడ, మల్యాల, నిజామాబాద్, బోధన్, వరంగల్ వంటి పట్టణాలు, నగరాలకు తాగునీరందాలి. మరికొన్ని ప్రాంతాల దాహమూ తీరాలి. ఇంతటి విశిష్ట ప్రాజెక్టుకు నీరందించే గోదావరి గలగలలకు ‘బాబ్లీ’ సంకెళ్లు పడడం సంకటంగా మారింది.

మరిన్ని వార్తలు