రెగ్యులర్‌ ఉపాధ్యాయులేరి?

21 Jul, 2018 13:28 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

భైంసాటౌన్‌ ఆదిలాబాద్‌ : ప్రభుత్వ పాఠశాలల బలోపేతమే లక్ష్యమంటూ ఊదరగొడుతున్న సర్కారు.. విద్యార్థులకు సరైన విద్య అందించడంపై మాత్రం శ్రద్ధ చూపడం లేదని తెలుస్తోంది. పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన, రెగ్యులర్‌ ఉపాధ్యాయుల భర్తీపై దృష్టి సారించడం లేదు.

జిల్లాలో మొత్తం 510 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీలున్నాయి. అయితే ప్రభుత్వం ప్రస్తుతం ఆ ఖాళీల్లో విద్యావలంటీర్ల భర్తీతో సరిపెట్టనుంది. మరోవైపు ఇటీవల నిర్వహించిన టీఆర్‌టీలో మెరిట్‌ సాధించిన అభ్యర్థులు నియామకాల ప్రక్రియ జాప్యం అవుతుండడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

జిల్లాలో 764 ప్రభుత్వ పాఠశాలలు.. 

జిల్లాలో ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు అన్నీ కలిపి 764 పాఠశాలలున్నాయి. ఈ పాఠశాలల్లో మొత్తం 3047 ఉపాధ్యాయులు అవసరం ఉండగా, ప్రస్తుతం 2537 మంది ఉపాధ్యాయులు విధులు నిర్వర్తిస్తున్నారు. 510 ఖాళీలున్నాయి.

ఏళ్ల తరబడిగా ఉపాధ్యాయ నియామక ప్రక్రియ చేపట్టకపోవడంతో ఇప్పటికే పలుచోట్ల ఉపాధ్యాయులు లేక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోంది. విద్యార్థుల తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలకు పంపేందుకు ఆసక్తి చూపడం లేదు. అయినా ఉపాధ్యాయులు ఏటా బడిబాట కార్యక్రమం నిర్వహిస్తూ విద్యార్థుల ప్రవేశాలను పెంచుతున్నారు.  

సమస్యలతో సతమతం.. 

పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలోనైనా నిరుద్యోగ సమస్య తీరుతుందని నిరుద్యోగ యువత భావించింది. ప్రభుత్వం కూడా టీచర్ల భర్తీ అంటూ చాలాసార్లు ప్రకటనలు చేసింది. ఎట్టకేలకు ప్రభుత్వం ఇటీవల టీఆర్‌టీ నిర్వహించినా.. దానికి సంబంధించిన ఫలితాలు, నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. మూడేళ్లుగా సమస్యలతో సతమతమవుతున్న పాఠశాలల్లో విద్యార్థులకు సరైన విద్యాబోధన అందక ఇబ్బందులు పడ్డారు.

అంతేగాకుండా ఉపాధ్యాయులు ఏటా ప్రభుత్వ బడుల్లో పిల్లలను చేర్పించాలంటూ బడిబాట కార్యక్రమాలు నిర్వహిస్తూనే ఉన్నారు. దీంతో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. కానీ అందుకనుగుణంగా ఉపాధ్యాయులు లేకపోవడంతో విద్యార్థులకు విద్యాబోధన అందించడం కష్టంగా మారింది.  

అయోమయంలో టీఆర్‌టీ అభ్యర్థులు.. 

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీగా ఉన్న పలు ఉపాధ్యాయ పోస్టుల్లో ప్రభుత్వం విద్యావలంటీర్లతో భర్తీ చేయనుంది. 510 ఖాళీలుండగా, ప్రభుత్వం అన్ని చోట్ల టీచర్ల భర్తీకి వీవీ పోస్టులను మంజూరు చేసింది. ఈనెల 16వరకు దరఖాస్తుల స్వీకరించారు. ప్రస్తుతం డీఈవో కార్యాలయం నుంచి ప్రొవిజనల్‌ లిస్టు ఎంఈవో కార్యాలయాలకు చేరింది.

ఏమైనా అభ్యంతరాలుంటే పరిశీలించిన అనంతరం తిరిగి డీఈవో కార్యాలయానికి లిస్టు పంపనున్నారు. అనంతరం అభ్యర్థులు తుది ఎంపిక ప్రక్రియ పూర్తికానుంది. నేడో, రేపో అభ్యర్థులు విధుల్లో చేరే అవకాశముంది. దీంతో విద్యార్థులకు కొంతమేర ఇబ్బంది తొలగినా.. అది తాత్కాలికమేనని అనిపిస్తోంది. ఒకవేళ టీఆర్‌టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తయితే వీవీల పరిస్థితి ఏమిటోనన్నది ప్రశ్నార్థకంగా మారింది.  

2600 దరఖాస్తులు 

జిల్లాకు 510 విద్యావలంటీర్ల పోస్టులు మంజూరుకాగా, ఆయా మండలాల్లోని ఎంఈవో కార్యాలయాల్లో దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 2600 దరఖాస్తులు వచ్చినట్లు డీఈవో తెలిపారు.
దరఖాస్తులదారులకు సంబంధించి నిబంధనల మేరకు రోస్టర్‌ పాయింట్లు కేటాయించారు. ఎంఈవో కార్యాలయాలకు అభ్యర్థుల లిస్టు పంపించారు. దరఖాస్తుల్లో తప్పులుంటే సరిచేసి, అనంతరం అభ్యర్థుల తుది ఎంపిక లిస్టు రానుంది. నేడో, రేపో అభ్యర్థులు విధుల్లో చేరే అవకాశం ఉంది.

రెగ్యులర్‌ టీచర్లను నియమించాలి 

మూడేళ్లుగా ప్రభుత్వ పాఠశాలల్లో ఖాళీలతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. కొన్నిచోట్ల విద్యార్థులకు సరైన విద్యాబోధన అందకపోవడంతో తల్లిదండ్రులు పిల్లల్ని బడికి పంపడానికి ఆసక్తి చూపలేదు. ప్రభుత్వం టీఆర్‌టీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను వేగవంతం చేయాలి. 

– బివి.రమణారావు,పీఆర్‌టీయూ జిల్లా అధ్యక్షుడు  

మరిన్ని వార్తలు