మల్కాపూర్, కేశవాపురంలోనే..

2 Sep, 2015 01:47 IST|Sakshi
మల్కాపూర్, కేశవాపురంలోనే..

‘గ్రేటర్’ దాహార్తి తీర్చే భారీ స్టోరేజీ రిజర్వాయర్ల నిర్మాణం ఇక్కడే 
ప్రభుత్వానికి నివేదించిన జలమండలి అధికారులు
 మొత్తం 35 టీఎంసీల నీటి నిల్వకు అవకాశం
ఏడాది పాటు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సరిపడా నీళ్లు

 
హైదరాబాద్: గ్రేటర్ హైదరాబాద్ దాహార్తిని తీర్చే రెండు భారీ స్టోరేజీ రిజర్వాయర్ల నిర్మాణానికి క్షేత్రస్థాయి నివేదిక సిద్ధమైంది. నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం వద్ద 20 టీఎంసీల మేర కృష్ణా జలాలు, రంగారెడ్డి జిల్లా శామీర్‌పేట్ మండలం కేశవాపురం వద్ద 15 టీంఎంసీల గోదావరి జలాల నిల్వ చేసేందుకు ఈ రిజర్వాయర్లు నిర్మించనున్నారు. దీనికి సంబంధించిన క్షేత్రస్థాయి నివేదికను సిద్ధం చేసిన జలమండలి అధికారులు మంగళవారం ప్రభుత్వానికి నివేదించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు త్వరలో సమగ్ర నివేదిక సిద్ధం చేస్తామని అధికారులు తెలిపారు.

 ముంపు సమస్యలు తక్కువే..?
 ఈ భారీ రిజర్వాయర్ల నిర్మాణంతో భూములు కోల్పోయేవారు నామమాత్రంగానే ఉన్నారని అధికారులు నివేదికలో పేర్కొన్నారు. ఇది క్షేత్రస్థాయి నివేదిక మాత్రమేనని, సమగ్ర ప్రాజెక్టు నివేదిక సిద్ధం చేశాక అవసరమైన భూములు, అంచనా వ్యయంపై స్పష్టత వస్తుందని జలమండలి వర్గాలు ‘సాక్షి’కి తెలిపాయి.

 వందేళ్ల అవసరాలకు తగ్గట్లుగా...
 వచ్చే వందేళ్లలో హైదరాబాద్ జనాభా, తాగునీటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఈ భారీ రిజర్వాయర్లను నిర్మించాలని ప్రభుత్వం సంకల్పించింది. మహానగరం వేగంగా విస్తరిస్తుండటం, జనాభా పెరుగుతున్న నేపథ్యంలో మరో 35 టీఎంసీల నీటి నిల్వకు ఏర్పాట్లు చేయాలని సీఎం కేసీఆర్ సంకల్పించారు. ఇందుకోసం ఈ రెండు భారీ రిజర్వాయర్లు నిర్మించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం ఉస్మాన్‌సాగర్ (గండిపేట్), హిమాయత్‌సాగర్‌లలో 7 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. సింగూరు, మంజీరా జలాశయాలతో పాటు అక్కంపల్లి రిజర్వాయర్‌లో మరో 32 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యం ఉంది. కానీ ఆయా జలాశయాల్లో ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీటి నిల్వలు 5.266 టీఎంసీలకు మించి లేవు. ఈ నీటినే ఏడాది పొడుగునా 365 ఎంజీడీల చొప్పున నగరం నలుమూలలకూ జలమండలి సరఫరా చేస్తోంది. ఇవి ఏ మూలకు సరిపోవడం లేదు. అందుకే కొత్తగా నిర్మించే ఈ భారీ రిజర్వాయర్లకు కృష్ణా,గోదావరి నదుల నుంచి నీటి లభ్యత అధికంగా ఉన్న సమయాల్లో పంపింగ్ ద్వారా నీటిని తరలించి నగర దాహార్తిని తీర్చాలని నిర్ణయించారు. ప్రస్తుతం సిరియా, అమెరికా, స్కాండినేవియా దేశాల్లోనే ఇలాంటి భారీ నీటి స్టోరేజీ రిజర్వాయర్లు అందుబాటులో ఉన్నాయి. ఇదే తరహాలో నగరంలోనూ విపత్కర, కరువు పరిస్థితుల్లోనూ నగరవాసుల దాహార్తిని తీర్చేందుకు ఇలాంటి రిజర్వాయర్లు అవసరమని ప్రభుత్వం భావిస్తోంది.
 
 దేవులమ్మనాగారం రిజర్వాయర్.. రూ. 1,500 కోట్లు
 నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం దేవులమ్మ నాగారం, మల్కాపూర్ సరిహద్దుల్లో రూ. 1,500 కోట్ల అంచనా వ్య యంతో స్టోరేజీ రిజర్వాయర్‌ను నిర్మిస్తారు. సము ద్ర మట్టానికి 70-80 మీటర్ల ఎత్తులో ఉండేలా దీని రూపకల్పన చేశారు. ఈ ప్రాంతంలో ప్రాజెక్టు ఏర్పాటుకు వీలుగా 2 వేల ఎకరాల ప్రభుత్వ భూమి కూడా ఉంది. పాలమూరు ఎత్తిపోతల, డిండి నీటి పథకం ద్వారా కొంతదూరం పంపింగ్ మరికొంత మార్గంలో గ్రావిటీతో 20 టీఎంసీల జలాలను ఈ రిజర్వాయర్‌కు తరలిస్తారు. వర్షాకాలంలో నీటి లభ్యత అధికంగా ఉన్నప్పుడే ఈ జలాశయాన్ని పూర్తిస్థాయిలో నింపే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు.
 
 
 
 కేశవాపురం రిజర్వాయర్.. రూ. 1,200 కోట్లు
 రంగారెడ్డిజిల్లా శామీర్‌పేట్ మండలం కేశవాపురం వద్ద రూ.1,200 కోట్ల అంచనా వ్యయంతో 15 టీఎంసీల గోదావరి జలాల నిల్వకు అవసరమైన స్టోరేజీ రిజర్వాయర్‌ను నిర్మించనున్నారు. ఈ నిర్మాణానికి అవసరమైన 3,600 ఎకరాల మేర ప్రభుత్వ భూమి ఇక్కడ అందుబాటులో ఉంది. సముద్ర మట్టం నుంచి 60 మీటర్ల ఎత్తులో దీన్ని నిర్మిస్తారు. గోదావరి మంచినీటి పథకం మొదటి, రెండవ, మూడవ దశల ద్వారా ఈ జలాశయానికి నీటిని తరలిస్తారు. అయితే గోదావరిలో వరద ప్రవాహం ఉన్నప్పుడే ఈ రిజర్వాయర్ పూర్తిస్థాయి జలకళ సంతరించుకుంటుంది.
 
 

మరిన్ని వార్తలు