నీరున్న చోటే ‘కేటీ వియర్లు’

13 Feb, 2016 04:25 IST|Sakshi

విచ్చలవిడిగా నిర్మాణాలు చేపడితే వృథా కట్టడాలవుతాయి
మహారాష్ట్రలో కేటీ వియర్ల అధ్యయనంపై అధికారుల నివేదిక


 సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని నదులు, వాగులు, వంకలపై కేటీ వియర్(కొల్హాపురి తరహా అడ్డుకట్ట)ల నిర్మాణాలను నీటి లభ్యత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే చేపట్టాలని రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ల బృందం తేల్చిచెప్పింది. వర్షాకాలం అనంతరం కూడా నీటి లభ్యత ఎక్కువగా ఉన్న.. పునరుత్పత్తి జలాలున్న చోట వీటి నిర్మాణాలు చేపట్టాలంది. సరైన వర్షాలు లేని, నీటి ప్రవాహాలు లేని ప్రాంతాల్లో విచ్చలవిడిగా కేటీ వియర్ల నిర్మాణం చేపడితే వృథా కట్టడాలుగా మిగులిపోతాయని హెచ్చరించింది. నీటి ప్రవాహాలు నిరంతరం లేని చోట రోడ్లు, భవనాలు, పంచాయతీరాజ్ శాఖ నిర్మించే సంప్రదాయ బ్రిడ్జి కం బ్యారేజీ నిర్మాణాలే మంచి ఫలి తాలనిస్తాయంది.

మహారాష్ట్రలోని కేటీ వియ ర్లు, బ్రిడ్జి కం బ్యారేజీలపై అధ్యయనం చేయడానికి తెలంగాణ ఇంజనీర్ల బృందం జనవరి 11, 12 తేదీల్లో అక్కడ పర్యటించిన విషయం తెలిసిందే. మనరాష్ట్రలోని వాలంతరి, ఔరంగాబాద్‌ల్లోని వాల్మీ సంస్థ సహకారంతో ఈ యాత్ర కొనసాగింది. విస్తృత చర్చలు, క్షేత్ర పర్యటన ముగించుకుని వచ్చిన బృందం 9 పేజీల అధ్యయన నివేదికను నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు, ముఖ్య కార్యదర్శి ఎస్‌కే జోషిలకు శుక్రవారం సమర్పించింది.

అధ్యయన బృందంలో నీటిపారుదల శాఖ తరఫున మైనర్ ఇరిగేషన్ చీఫ్ ఇంజనీర్లు నాగేందర్‌రావు, సురేష్‌కుమార్, ఎస్‌ఆర్‌ఎస్‌పీ చీఫ్ ఇంజ నీర్ శంకర్, ఓఎస్‌డీ శ్రీధర్‌రావుదేశ్‌పాండే, సీడీవో సూపరింటెం డింగ్ ఇంజనీర్ రాజశేఖర్, మైనర్ డీసీఈ దేవేందర్, వాలంతరి ఈఈ రవీందర్‌రెడ్డి, పంచాయతీరాజ్ శాఖ తరఫున చీఫ్ ఇంజనీర్ బి.సురేష్‌కుమార్ తదితరులు న్నారు. కేటీ వియర్ల నిర్మాణంతో ప్రవాహాలు నిలుస్తాయని, దీనివల్ల నీటిని పంపింగ్ చేసుకునే అవకాశం రైతులకు దక్కుతుందని నివేదికలో ఇంజనీర్లు వివరించారు.

ఫలితంగా మూడు పంటలు వేసుకునే అవకాశం ఉంటుం దని, భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయన్నారు. ఇవి నిర్మించిన ప్రాంతాల్లో మట్టి, చెట్లు పెరిగిపోతాయని, నీటి ప్రవాహాలున్నప్పుడు వాటిని తొలగించాల్సి ఉంటుందన్నారు. కేటీ వియర్లు కట్టాలని విధానపరమైన నిర్ణయాలు తీసుకుంటే మహారాష్ట్ర మాదిరిగా రైతుల భాగస్వామ్యం పెంచడానికి అధిక ప్రాధాన్యమివ్వాలని సూచించారు.
 

మరిన్ని వార్తలు