ఇండోర్‌ స్టేడియం పూర్తయ్యేదెప్పుడో?

15 Mar, 2019 16:21 IST|Sakshi
 అసంపూర్తిగా మిగిలిన మినీ ఇండోర్‌స్టేడియం   

పనులకు నిధుల కొరత

సౌకర్యాలు లేక క్రీడలకు దూరమవుతున్న విద్యార్థులు

పనులు పూర్తి చేయాలని కోరుతున్న క్రీడాకారులు

సాక్షి, జగిత్యాలటౌన్‌: జగిత్యాల జిల్లా కేంద్రంగా ఆవిర్భవించిన ఇప్పటికి ఒక్క ఇండోర్‌ స్టేడియం కూడా లేదు. గతంలో నిర్మాణం ప్రారంభించిన ఏళ్లు గడుస్తున్నా... మోక్షం రావడం లేదు. దీంతో జిల్లాకు చెందిన క్రీడాకారులు ప్రాక్టిస్‌ చేసేందుకు ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలోని ఇన్‌డోర్‌ స్టేడియాలపై ఆధారపడాల్సి వస్తుంది. దూర భారంతో పాటు వ్యయ ప్రయాసాలతో క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు.

నిరుపేద, మద్యతరగతి క్రీడాకారులు క్రీడలకు దూరమవుతున్నారు. నిధులు పూర్తి స్థాయిలో రాకపోవడంతో ఇండోర్‌ స్టేడియం పనులు నిలిచిపోయాయి. మంజురు అయిన డబ్బులతో చేపట్టిన కాస్త పనులు అసంపూర్తిగా ఉండి విద్యార్థులను నిరాశలోకి నెట్టుతున్నాయి. పూర్తి స్థాయిలో నిధులు మంజూరు చేసి ఇండోర్‌ స్టేడియం నిర్మాణం పూర్తి చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

 
2011లో ప్రారంభం..


జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల అవరణలో 2011లో ఆంధ్రప్రదేశ్‌ ఎడ్యుకేషనల్‌ వెల్ఫేర్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ డెవలప్‌మెంట్‌ ద్వారా ఇండోర్‌ స్టేడియం మంజూరైంది. ఇండోర్‌ స్టేడియానికి మొత్తం రూ. 40 లక్షలు ఖర్చును అంచనా వేయగా, ప్రభుత్వం రూ. 20 లక్షలు కేటాయించడంతో 2015లో కేవలం గోడలు వరకు మాత్రమే నిర్మించారు. దీంతో ఇంకా 20 లక్షలు అవసరమని అంచనా వేసారు. ప్రస్తుతం ఏళ్ల క్రితం అంచనా కాబట్టి మరింత ఖర్చు పెరిగే ఆవకాశం ఉంది. 


నిరాశలో విద్యార్థులు..


నిర్మాణం పూర్తి కాకపోవడంతో క్రీడల్లో రాణించాలనుకునే విద్యార్థులు నిరాశకు గురవుతున్నారు. ఫలితంగా క్రీడలకు దూరం కావాల్సి వస్తుందని క్రీడాకారులు ఆందోళన చెందుతున్నారు. సంబందిత కళాశాలకు చెందిన విద్యార్థులు క్రీడా మెలకువలు మెరుగు పరుచుకునేందుకు కరీంనగర్, హైదరాబాద్‌ వంటి ప్రాంతాలకు వెళ్లి ప్రాక్టీస్‌ చేస్తున్నారు.

దీంతో విద్యార్థులకు ఆర్థికభారం పెరుగుతోంది. స్థానికంగా సౌకర్యాలు కల్పిస్తే ఇలాంటి దుస్థితి ఉండదని క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. ఇంకొంత మందికి ఆటల్లో ప్రావీ ణ్యం సాధించాలని ఉన్నా సౌకర్యాలు లేక మిన్నకుండి పోవాల్సి వస్తోంది. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇండోర్‌ స్టేడియం పూర్తి చేసేందుకు నిధులు మంజూరు చేయాలని విద్యార్థులు కోరుతున్నారు.

పనులు పూర్తి చేయాలి


క్రీడాకారుల కోసం నిర్మాణం చేపట్టిన ఇన్‌డోర్‌ స్టేడియం పూర్తి కాకపోవడంతో విద్యార్థులు క్రీడల్లో రాణించలేక పోతున్నారు. ఆర్థికంగా ఇబ్బందులకు గురి అవుతున్నారు. త్వరగా పూర్తి చేస్తే విద్యార్థులకు అందుబాటులో ఉంటుంది


– అంజలి, విద్యార్థిని, జగిత్యాల


ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోంది


జిల్లాలో ఇండోర్‌ స్టేడియం లేక విద్యార్థులు, క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆసక్తి ఉన్న ఏమి చేయలేని పరిస్థితి నెలకోంది. కరీంనగర్, హైదారాబాద్‌కు వెళ్లి కోచింగ్‌ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. త్వరగా పూర్తి చేస్తే ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన పని లేదు.  

 – సుమన్, విద్యార్థి, జగిత్యాల

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా