విజిల్‌ సాంగ్స్‌తో అలరిస్తున్న నగర వాసి

24 Jan, 2019 10:34 IST|Sakshi

వంద గీతాలతో సోషల్‌ మీడియాలో పోస్టింగ్‌

శేషశాయి ఈల పాటలకు ఫిదా అవుతున్న పలువురు ప్రముఖులు..

శిశుర్వేత్తి.. పశుర్వేత్తి.. వేత్తిగాన రసం ఫణి.. అనే నానుడికి ఆయన ఈల పాట సరిగ్గా అతుకుతుంది. చిన్నారులనే కాకుండా మూగజీవాలను, చివరికి పాములను సైతం అలరింపజేసే గుణం గానానికి ఉంది. సాధారణంగా ఎప్పుడో ఒకప్పుడు బాత్రూంలోనో మరేదైన ఆనంద సమయంలోనో నోటితో పాటలు పాడటం అందరూ చేస్తుంటారు. కానీ ఈల పాట అంత సులువుగా రాదు. నగరానికి చెందిన కర్రా శేషశాయి మాత్రం విజిల్‌ సాంగ్‌లో తనదైన ప్రత్యేకత చాటుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంటున్నారు.

హిమాయత్‌నగర్‌: విద్యానగర్‌కు చెందిన సుబ్రహ్మణ్య కుమార్, పద్మ దంపతుల కుమారుడు శేషశాయి. ప్రస్తుతం డీసీబీ బ్యాంకులో డిప్యూటీ మేనేజర్‌. చిన్నప్పుడు తండ్రి విజిల్‌తో పాటలు పాడుతూ ఇంట్లో  వారిని అలరించేవారు. ఆయనను అనుసరిస్తూ శేషశాయి కూడా విజిల్‌తో పాడటం మొదలుపెట్టారు. కొన్ని ఫంక్షన్లలో సరదాగా విజిల్‌ పాటలు పాడుతూండేవారు. చాలా బాగా పాడుతున్నావు. కొనసాగించు అని పలువురు ప్రోత్సహించడంతో తనదైన శైలిలో ముందుకు సాగుతున్నారు శేషశాయి. 

గురువు అడుగుజాడల్లో..
ప్రముఖ సంగీత విద్వాంసులు, విజిల్‌తో పాడుతూ ప్రేక్షకులను అలరిస్తున్న కొమరవోలు శివప్రసాద్‌ సమక్షంలో శేషశాయి ఓనమాలు దిద్దుకుంటున్నారు. ఆయన తర్ఫీదులో సరిగమలు, కృతులు, అన్నమయ్య కీర్తనలు నేర్చుకున్నారు. గురువు శివప్రసాద్‌తో కలిసి శేషశాయి ఇప్పటి వరకు 50కిపైగా స్టేజీషోల్లో పాల్గొన్నారు.  

గుక్క తిప్పుకోకుండా..  
మహా అయితే మనం ఒక్క నిమిషం పాటు గుక్కతిప్పుకోకుండా పెదాలతో విజిల్‌ వేస్తూ పాడతాం. అంతకంటే ఎక్కువ సేపు పాడలేం.. ఆయాసం వస్తుంటుంది. కానీ.. శేషశాయి తన టాలెంట్‌తో 15 నిమిషాల పాటు గుక్కతిప్పుకోకుండా విజిల్‌తో పాటలు పాడతారు. 2014లో సింగర్‌ రోహిత్‌తో కలిసి విజిల్‌తో పాటలు పాడి అలరించారుఆయన.

ప్రముఖులెందరో నచ్చారు.. 
రంగస్థలం సినిమాలోని ‘రంగా రంగా రంగస్థలాన’ అనే పాటను విజిల్‌తో పాడి ట్విట్టర్‌లో పోస్ట్‌ చేశారు శేషశాయి. ఈ పాటను చూసిన మ్యూజిక్‌ డైరెక్టర్‌ దేవిశ్రీ ప్రసాద్‌ లైక్‌ కొట్టారు. దీంతో ఒక్కరోజులోనే ఆ పాటకు 15వేల లైకులు వచ్చాయి. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ ఎదుట ఆయనకు నచ్చిన పాట ‘కురే ఉండ్రు మిళై’ తమిళ పాటను పాడి ఆశ్చర్యానికి గురిచేశారు. ఇప్పటి వరకు వంద పాటలను ప్రత్యేకంగా పాడి వాటిని ఫేస్‌బుక్, ఇన్‌స్ట్ర్రాగామ్, ట్విట్టర్‌లలో పోస్ట్‌ చేశారు. సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసిన ఈ వీడియోలకు వేలల్లో లైకులు వచ్చాయి.  

రెహమాన్‌ ఎదుట పాడాలి..  
స్టేజీషోల్లో అవకాశమిస్తే నా సత్తా నిరూపిస్తాను. విజిల్‌తో పాట పాడటం నేర్చుకున్నప్పటి నుంచి నాకు ఓ కోరిక ఉండేది. ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ ఏఆర్‌ రెహమాన్‌ ఎదుట కొన్ని పాటలను విజిల్‌తో పాడాలని, ఆయన కాంప్లిమెంట్స్‌ అందుకోవాలని. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నా.         – కర్రా శేషశాయి, ఈల పాట     గాయకుడు

మరిన్ని వార్తలు