ఇల్లు లేని పేదలు ఎందరు? 

29 May, 2019 02:02 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

జూన్‌ 10 కల్లా వివరాలు పంపాలని పురపాలక శాఖ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: నీడ లేని పేదల లెక్క తేల్చాలని ప్రభుత్వం నిర్ణయించింది. గూడు లేని బడుగులను జూన్‌ 10 కల్లా గుర్తించాలని పురపాలక సంఘాల కమిషనర్లను ఆదేశించింది. మున్సిపాలిటీల్లో రహదారులు, చెట్లే అడ్డాగా జీవనం సాగిస్తున్న పేదల డేటా సేకరించాలని.. వారందరికీ కనీస వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని నిర్దేశించింది. మంగళవారం మున్సిపల్‌ కమిషనర్లతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి అర్వింద్‌ కుమార్‌ ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. సేకరించే వివరాల ఆధారంగా ఇల్లు లేని పేదలకు జనన ధ్రువీకరణ పత్రాలు, ఆధార్‌ కార్డు, పింఛన్, బ్యాంక్‌ ఖాతాలు తెరిచేలా చొరవ చూపాలన్నారు. నీడ లేని వారందరినీ షెల్టర్లకు తరలించాలని, క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. కమిషనర్లు విధిగా షెల్టర్లను సందర్శించాలని, వారికి అందుతున్న సేవలను తెలుసుకోవాలని సూచించారు.

రాష్ట్రవ్యాప్తంగా 143 పట్టణ స్థానిక సంస్థలుండగా.. ఇందులో 53 మున్సిపాలిటీల్లోనే షెల్టర్లు ఉన్నాయని, 11,389 మంది ఇక్కడ నివసిస్తున్నారని అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు. ఇందులో 5,807 మందికి ఆధార్‌ కార్డులు, 787 మందికి ఓటరు గుర్తింపు కార్డులు, 1,555 మందికి పింఛన్లు అందుతున్నాయని చెప్పారు. 3,497 మందికి రేషన్‌ కార్డులు కూడా ఉన్నాయని, 201 మందికి బీమా సౌకర్యం కూడా కల్పించినట్లు కమిషనర్లు వివరించారు. 694 మందిని అంగన్‌వాడీ కేంద్రాలకు పంపుతున్నామని, 5,728 మందికి ఉచితంగా ఆహారం అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు 1,050 ఆరోగ్య పరీక్షా శిబిరాలను ఏర్పాటు చేశామని, ఇందులో 129 మందిని శస్త్రచికిత్సల నిమిత్తం ఆస్పత్రులకు సిఫారసు చేసినట్లు వివరించారు. 1,541 మందికి బ్యాంక్‌ అకౌంట్లను ఓపెన్‌ చేసినట్లు తెలిపారు.   

మరిన్ని వార్తలు