తెర వెనక ఎవరు..?

9 Mar, 2018 07:26 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సివిల్‌ సప్లయీస్‌ అధికారుల వరుస దాడులు

తూతూమంత్రంగానే కేసులు

ప్రతీ దాడిలో కీలక వ్యక్తులు సేఫ్‌

ఆగని పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా

నేరుగా రంగంలోకి దిగిన టాస్క్‌ఫోర్స్‌ బృందం

స్థానిక పరిచయాలపై నిఘా.. ముమ్మర విచారణ

సాక్షి ప్రతినిధి, వరంగల్‌ : వేర్లను వదిలేసి పైపై కొమ్మలను కొడుతుండడంతో రేషన్‌ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడడం లేదు. దాడులు జరుగుతున్న సందర్భాల్లో ప్రధాన వ్యక్తులను పక్కకు తప్పిస్తుండడంతో ఈ దందా మూడు పువ్వులు.. ఆరు కాయలు అన్నట్లుగా కొనసాగుతూనే ఉంది. దీంతో పేదలకు ప్రభుత్వం అందించే  
రూపాయికి కిలోబియ్యం అక్రమార్కులకు కాసుల వర్షం కురిపిస్తోంది. రేషన్‌ బియ్యం దుర్వినియోగం అవుతున్న విషయాన్ని గ్రహించి అక్రమ రవాణా చేస్తున్నవారి పట్ల రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తోంది. వరుస దాడులు చేయడంతోపాటు పీడీ యాక్టు సైతం ప్రయోగిస్తోంది.

అయితే.. ఎన్ని సార్లు దాడులు జరిగినా, తిరిగి పీడీఎస్‌ బియ్యం అక్రమ రవాణా జరుగుతూనే ఉంది. దీనికి ప్రధాన కారణం అక్రమ రవాణాకు కేంద్ర బిందువుగా వ్యవహరించే వ్యక్తులు ఉద్దేశపూర్వకంగానే పక్కకు తప్పుకుంటున్నట్లు తెలుస్తోంది. అక్రమ రవాణా సజావుగా సాగినంత వరకు వీరే అన్ని తామై వ్యవహారాలు చక్కబెడుతున్నారు. ఏదైనా తేడా వచ్చి దాడులు జరిగి బియ్యంతో పట్టుబడిన సందర్భాల్లో నేర్పుగా పక్కకు తప్పుకుని కింది స్థాయి వ్యక్తులను కేసుల్లో ఇరికిస్తున్నారు. ఫలితంగా బియ్యం అక్రమ రవాణా కొంత కాలం మందగించినా ... మళ్లీ తిరిగి జోరుగా సాగుతోంది. సగటున ప్రతి రెండు రోజులకు ఒక లారీ లోడు బియ్యం వరంగల్‌ నుంచి అక్రమ రవాణా అవుతున్నట్లు సమాచారం.

కేసుల్లో ఉండరు
తొర్రూరు, జనగామ ఏరియాల్లో ఏర్పాటు చేసుకున్న ఏజెంట్ల ద్వారా గ్రామాల్లో బియ్యాన్ని సేకరిస్తున్నారు. ఇలా సేకరించిన బియ్యాన్ని ఆటోలు, ట్రాలీల ద్వారా వరంగల్‌లో ఉన్న ప్రధాన కేంద్రంలో నిల్వ చేస్తున్నారు. లారీకి సరిపడా లోడు రాగానే.. వెంటనే వరంగల్‌ నుంచి తరలిస్తున్నారు. ఈ తరహాలో బియ్యం అక్రమ రవాణాకు సంబంధించి పక్కా సమాచారం లభించడంతో మంగళవారం ఖిలావరంగల్‌ మండలం బొల్లికుంట శివారు సింగారం క్రాస్‌ సమీపంలో 500 క్వింటాళ్ల నిల్వ చేసిన బియ్యాన్ని స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను టాస్క్‌ఫోర్సు అధికారులు గోప్యంగా ఉంచుతున్నారు. మరోవైపు ఈ కేసుకు సంబంధించి నలుగురు వ్యక్తులను మామునూరు పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 

అసలు వ్యక్తి ఎక్కడ..
వరంగల్‌ రూరల్‌ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి  ఈ అక్రమ రవాణాలో కీలకపాత్ర పోషించినట్లు సమాచారం. గతంలో కొబ్బరికాయల వ్యాపారం చేసి... ప్రస్తుతం బియ్యం అక్రమ రవాణాలో కీలక వ్యక్తిగా మారాడు. ఇతను సాగిస్తున్న దందాకు సంబంధించిన సమాచారాన్ని అనేక సార్లు స్థానికంగా ఉన్న పోలీసులు, విజిలెన్సు సిబ్బందికి అందించినా ఫలితం లేకుండా పోయింది. లోకల్‌ స్థాయిలో పోలీసు సిబ్బందితో ఉన్న పరిచయాల కారణంగా ఎప్పటికప్పుడు సేఫ్‌ అవుతున్నట్లు తెలుస్తోంది. దీంతో నేరుగా పౌరసరఫరాల శాఖ కమిషనర్‌ కార్యాలయానికి పక్కా ఆధారాలతో సమాచారం అందించారు.

దీంతో స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నేరుగా టాస్క్‌ఫోర్స్‌ అధికారులు మంగళవారం దాడి చేశారు. దీనికి సంబంధించి కనీసం స్థానిక పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయలేదు. టాస్క్‌ఫోర్స్, సివిల్‌ సప్లయీస్‌ అధికారులు అక్రమ రవాణాపై విచారణ చేస్తున్నారు. మొక్కజొన్న కంకుల వ్యాపారం చేస్తామంటూ మిల్లును లీజుకు తీసుకుని, బియ్యం అక్రమ రవాణాకు అడ్డాగా మార్చినట్లు ఇప్పటికే తేలింది. ఈ మేరకు బియ్యం అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్నది ఎవరు, అతనికి అండదండలు అందిస్తున్న వారు ఎవరు అనే అంశాలపై దృష్టి పెట్టినట్లు సమాచారం. పక్కా ఆధారాలు సేకరించిన అనంతరం కేసులు నమోదు చేసేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు.


11 మంది వ్యాపారులపై కేసు నమోదు

మామునూరు: ఖిలావరంగల్‌ మండలం బొల్లికుంట గ్రామ శివారు సింగారం గ్రామ ప్రధాన రహదారిలోని ఓ పాత రైస్‌ మిల్లు గోదాంలో ప్రజల నుంచి భారీగా సేకరించి అక్రమంగా నిల్వ చేసిన ప్రజాపంపిణీ బియ్యం పట్టుబడింది. వరంగల్‌ మండల డిప్యూటీ తహసీల్దార్‌ దురిశెట్టి శ్రీధర్‌ ఫిర్యాదు మేరకు గురువారం సాయంత్రం 11 మంది వ్యాపారులపై కేసు నమోదు చేసినట్లు మామునూరు సీఐ శ్రీనివాస్‌ తెలిపారు.

ఆయన కథనం ప్రకారం.. ఖిలా వరంగల్‌ మండలం బొల్లికుంట గ్రామ సమీపంలోని సింగారం రహదారిలో ఓ పాత రైసు మిల్లు గోదాములో పలు ప్రాంతాలకు చెందిన బియ్యం వ్యాపారులు మాలగాని రమేష్, దొడ్డ శ్రీనివాస్, పులిశేరి శ్రీను, పస్తం మహేందర్, సిరిగి సంపత్, పస్తం నరేందర్, తూర్పాటి కుమారస్వామి, చిదురాల నవీన్, వెంకన్న, ఇమ్మడి సోమ నర్సయ్య, సందీప్‌ మొత్తం 11 మంది ఒక బృందంగా ఏర్పడ్డారు. వీరందరూ నగర శివార్లల్లోని పాత బడ్డ భవనాలు, గోదాంలను ఎంచుకుని ప్రజల నుంచి అక్రమంగా సేకరించిన రేషన్‌ బియ్యాన్ని భారీగా నిల్వ చేశారు.

రెవెన్యూ, సివిల్‌ సప్లయీస్‌ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆ శాఖ విజిలెన్స్‌ బృందం ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మొత్తం 425.22  క్వింటాళ్ల రేషన్‌ బియ్యం, 22.17 క్వింటాళ్ల నూకలు పట్టుబడ్డాయి. వీటి విలువ రూ.10,79,519 రూపాయలు ఉంటుందని అంచనా. వీటితోపాటు బియ్యాన్ని తరలించేందుకు సిద్ధంగా ఉన్న 2 ట్రాలీ ఆటోలను సైతం సీజ్‌ చేసి స్టేషన్‌లో ఆప్పగించారు.

మరిన్ని వార్తలు