కరోనా కట్టడికి... స్వచ్ఛంద యుద్ధం

20 Mar, 2020 03:41 IST|Sakshi

ప్రపంచ విద్యార్థి లోకానికి యూనిసెఫ్, డబ్ల్యూహెచ్‌వో, రెడ్‌క్రాస్‌ పిలుపు

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా మహమ్మారి నుంచి ఈ ప్రపంచాన్ని కాపాడేందుకు విద్యార్థులు స్వచ్ఛంద యుద్ధ వీరులు కావాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ, యునిసెఫ్, రెడ్‌క్రాస్‌ సొసైటీలు పిలుపునిచ్చాయి. ప్రాథమికోన్నత పాఠశాలలు, ఆ తర్వాతి స్థాయిల్లో చదువుకుంటున్న విద్యార్థులు తమను తాము పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు ఇతరులు సురక్షితంగా ఉండేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న దానిపై అవగాహన పెంచుకుని, ఇతరులకు కల్పించాలని కోరాయి. ఈ మేరకు విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు, పాఠశాలల యాజమాన్యాలు కరోనా వైరస్‌ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై అంతర్జాతీయ సంస్థలు 13 పేజీల బులెటిన్‌ను విడుదల చేశాయి. దీని ప్రకారం శుభ్రత, అవగాహన, విస్తృత ప్రచారం, స్వచ్ఛంద సేవ ద్వా రా ప్రపంచాన్ని కరోనా గండం నుంచి బయటపడేసే బాధ్యత తీసుకోవాలని,  తమతోపాటు ఇతరులు, కుటుంబ, ఈ సమాజం ఆరోగ్యవంతంగా ఉండేం దుకు నాయకత్వం వహించేందుకు ముందుకు రావాలని ప్రపంచ విద్యార్థి లోకానికి పిలుపునిచ్చాయి.

తల్లిదండ్రులూ... అన్ని విషయాలూ చెప్పండి 
కరోనా వైరస్‌ విజృంభించకుండా పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యతను తల్లిదండ్రులు చాలా సీరియస్‌గా తీసుకోవాలని ఆ బులెటిన్‌ వెల్లడించింది. ముందు తల్లిదండ్రులు పరిశుభ్రంగా ఉండటం, తరచుగా చేతులు కడుక్కోవడం ద్వారా పిల్లలకు ఆదర్శంగా ఉండాలి. పిల్లలు అనారోగ్యం బారిన పడితే వారికి ధైర్యం చెప్పాలి. వారు ఆసుపత్రిలో ఎందుకు ఉండాల్సి వస్తుందో, అలా ఉండడం వల్ల తన స్నేహితులకు ఎలాంటి ప్ర యోజనం కలుగుతుందో వారికి అర్థమయ్యేలా వివరించాలని సూచించింది. కచ్చితంగా ఆరోగ్యంగా ఉంటేనే పాఠశాలలకు పంపాలని వెల్లడించింది.

పాఠశాలల్లోనూ...పారాహుషార్‌ 
కోవిడ్‌ వ్యాప్తి చెందకుండా పాఠశాలల యాజమాన్యాలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని యూని సెఫ్, డబ్ల్యూహెచ్‌వో, రెడ్‌క్రాస్‌ సంస్థలు సూచించాయి. బులెటిన్‌ ప్రకారం ముఖ్యంగా విద్యార్థులు ఉపయోగించే మరుగుదొడ్లు శుభ్రంగా ఉండేలా విద్యాసంస్థలు జాగ్రత్తలు తీసుకోవాలి.  వారికి సబ్బు, నీళ్లు అందుబాటులో ఉంచాలి. టాయిలెట్లు, క్లాస్‌రూంలు, హాళ్లు, వచ్చిపోయే మార్గాల్లో శానిటైజర్లు అందుబాటులో ఉంచాలి. పాఠశాలల భవనాలు, తరగతి గదులను చాలా పరిశుభ్రంగా ఉంచాలి. గాలి, వెలుతురు వచ్చే విధంగా చూడాలి. విద్యార్థులు పాటించాల్సిన విషయాలతో కూడిన పోస్టర్లు, సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలి.

ప్రాథమికోన్నత స్థాయి విద్యార్థులకు
►ఆ స్థాయి విద్యార్థులు కరోనా గురిం చి ఏదైనా అడిగితే వారికి చెప్పాలి. గుంపుగా ఉన్న ప్రాంతాలకు వెళ్లొద్దని చెప్పడం ద్వారా సామూహిక కలయికలను నిరోధించాలి.  
►కరోనాపై అవగాహన కల్పించేలా వారిచేత పోస్టర్లు తయారుచేయించి పాఠశాలల్లో ప్రదర్శించవచ్చు. వీరు స్వచ్ఛందంగా కరోనా నియంత్రణ కో సం ఏదైనా చేసే విధంగా వారిని ప్రోత్సహించాలి. స్వచ్ఛంద యుద్ధవీరులు ఈ స్థాయి నుంచే తయారు కావాలి.

అప్పర్‌ సెకండరీ విద్యార్థులకు.. 
►తమతో పాటు ఇతరులు కూడా ఎలా సురక్షితంగా ఉండాలో వారు నేర్చుకోవాలి. ఈ మహమ్మారి గురించి వారికి వివరించడంతో పాటు ఎలా నియంత్రించాలో అర్థమయ్యేలా చెప్పాలి.  
►సోషల్‌మీడియా, రేడియో, లోకల్‌ టీవీల్లో తమ ఆలోచనలను వ్యాప్తి చేయ డం ద్వారా ఈ స్థాయి విద్యార్థులు కరోనాపై యుద్ధం చేయాలి.  
►వారు చదువుతున్న సబ్జెక్టుల్లో వైరస్‌ లు, వాటి ప్రభావం, వ్యాధుల వ్యాప్తి, క్రిముల సంచారం, వాటి ప్రభావం లాంటి అంశాలను నేర్పించాలి.

అన్ని స్థాయిల విద్యార్థుల చెక్‌లిస్ట్‌ ఇదే
►కోవిడ్‌ గురించి అందుబాటులో ఉన్న వనరులద్వారా పూర్తిగా అవగాహన చేసుకోవాలి.  
►తెలిసిన సమాచారాన్ని కుటుంబ సభ్యులు, స్నేహితులు, మీ కంటే చిన్నవారితో పంచుకోవాలి.  
►తరచుగా చేతులు కడుక్కోవాలి. కనీసం 20 సెకండ్ల పాటు రెండు చేతు లను పూర్తిగా (గోర్ల కింది భాగంలో కూడా) సబ్బుతో శుభ్రం చేసుకోవాలి.  
►ముఖాన్ని చేతులతో తాకొద్దు. కప్పులు, ప్లేట్లు, ఆహారం, ద్రవ పదార్థాలను ఇతరులతో పంచుకోవద్దు.  
►తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు మోచేయి అడ్డుపెట్టుకోవాలి. వైరస్‌ సోకిన వారిని అవమానపర్చవద్దు. ఈ వైరస్‌ సోకడానికి జాతి, కులం, మతం, ప్రాంతం, వయసు, లింగబేధం ఉండదని గుర్తెరగాలి.

బులెటిన్‌లో ప్రీస్కూల్‌ విద్యార్థులకు సూచనలు 
►శానిటైజర్‌తో చేతులు కడుక్కునే ప్రయత్నం వారితో చేయించాలి. 20 సెకండ్ల వ్యవధి గల పాటను నేర్పించి ఆ పాట పూర్తయ్యేవరకు వారు చేతులు కడుక్కునే విధంగా ప్రోత్సహించాలి. 
►అందుబాటులో ఉన్న బొమ్మలు చూపించి కరోనాపై అవగాహన కల్పించాలి. పిల్లలందరినీ ఒక్కచోట కూర్చోబెట్టి వారి రెండు చేతులు వెడల్పుగా చేయించి ఇద్దరు పిల్లల మధ్య ఆ దూరం ఉండాలని అర్థమయ్యేలా నేర్పించాలి.

ప్రాథమిక పాఠశాల స్థాయి విద్యార్థులకు 
►మంచి ఆరోగ్య అలవాట్లను, తుమ్మేటప్పుడు, దగ్గేటప్పుడు మోచేయిని అడ్డుపెట్టుకోవాలని వారికి  నేర్పించాలి.  
►సబ్బుతో 20 సెకండ్ల పాటు చేతులు ఎలా కడుక్కోవాలో చూపించాలి. క్రిములు ఎలా వ్యాపిస్తాయో అర్థమయ్యేలా చెప్పాలి. ఒక స్ప్రే బాటిల్‌లో రంగునీళ్లు పోసి ఆ నీళ్లను ఒక కాగితంపై స్ప్రే చేయడం ద్వారా ఆ నీళ్లు ఎంత దూరం పడ్డాయో చూపించి క్రిములు కూడా అలాగే వ్యాప్తి చెందుతాయని చెప్పాలి. 

మరిన్ని వార్తలు