'గీతారెడ్డిని అవమానించిందెవరు?'

19 Mar, 2015 01:47 IST|Sakshi
'గీతారెడ్డిని అవమానించిందెవరు?'

- ఆమెను జైల్లో పెట్టించే ప్రయత్నం జరగలేదా?:  రసమయి ఎదురుదాడి
- మాటిమాటికి నా పేరెందుకు ఎత్తుతారు: గీతారెడ్డి
- ఇది శాసనసభనా, ధూం..ధాం సభనా?: జానారెడ్డి అసహనం

 
సాక్షి, హైదరాబాద్: ‘దళిత ఉప ముఖ్యమంత్రి బర్తరఫ్ అంశాన్ని లేవనెత్తుతున్న కాంగ్రెస్ సభ్యులు వారి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారు? దళిత మహిళ గీతారెడ్డి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా ఉంటే చూసి ఓర్వలేక ఆమెను జైల్లో పెట్టే ప్రయత్నం చేయలేదా. ఆ విషయాన్ని మరిచిపోయి ఇప్పుడు మా ప్రభుత్వంపై విమర్శలెందుకు చేస్తున్నారు. దళిత సంక్షేమం అంటే వారి పేరు చెప్పుకుని ఓట్లు అడగ టం కాదు.. రాజకీయంగా, ఆర్థికంగా, సామాజికంగా వారి అభ్యున్నతికి కృషి చేయాలి. అది కేసీఆర్ చేస్తున్నారు’ అంటూ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ పేర్కొన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం దళిత వ్యతిరేకిగా వ్యవహరిస్తోందని కాంగ్రెస్ సభ్యులు  విమర్శలు చేయటంతో ఆయన ప్రత్యారోపణలతో సభలో వేడి పుట్టించారు. దీంతో రెండు పక్షాల మధ్య   వాదోపవాదాలతో గందరగోళం నెలకొంది. పాటలు పాడుతూ హద్దుపద్దూ లేని ఆరోపణలు చేస్తున్నా ఎలా అనుమతిస్తున్నారని సీఎల్పీ నేత జానారెడ్డి ఉపసభాపతిని ప్రశ్నించి అసలు ఇది శాసనసభా.. ధూంధాం సభనా అంటూ అసహనం వ్యక్తం చేశారు.
 
సంపత్ వర్సెస్ రసమయి
కాంగ్రెస్ సభ్యుడు సంపత్ ఆవేశ ప్రసంగం.. కాంగ్రెస్ సభ్యుల సస్పెన్షన్ తర్వాత ప్రసంగం ప్రారంభించిన రసమయి... ఆది నుంచి ప్రతిపక్షంపై విరుచుకుపడ్డారు. ఇన్నేళ్ల తర్వాత దళిత పక్షపాత సీఎంగా కేసీఆర్ కనిపిస్తున్నారని, పాటలు పాడుకుంటున్న తనను సాంస్కృతిక సారథికి చైర్మన్ చేశారని రసమయి బాలకిషన్ అన్నారు. హాస్టళ్లలోని పేద పిల్లలు సన్నబియ్యం తింటుంటే అభినందించాల్సిందిపోయి దాన్నీ రాజకీయం చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దశలోనే గీతారెడ్డి ప్రస్తావన తెచ్చారు.  దీనికి గీతారెడ్డి లేచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.   
 
రసమయి సానుభూతి నాకవసరం లేదు
‘సభలో మాటిమాటికి నా ప్రస్తావన ఎందుకు తెస్తున్నారు. రసమయి సానుభూతి నాకవసరం లేదు. కోర్టు పరిధిలో ఉన్న అంశాన్ని సభలో లేవనెత్తటం సరికాదు’ అని కాంగ్రెస్ ఎమ్మెల్యే గీతారెడ్డి అన్నారు. అసలు అప్పుడు ఎవరో చేసిన తప్పుల్లో మంత్రులుగా మా పేరు వచ్చింది. వాస్తవమేంటో కోర్టు తేలుస్తుంది. ఇప్పుడు మీరే అధికారంలో ఉన్నారు కదా... అన్ని ఫైళ్లు తెప్పించుకుని వాస్తవాలేంటో చెప్పమనండని ఆగ్రహంగా మాట్లాడారు.

మరిన్ని వార్తలు