ఎవరిదీ.. 'పాపం'

22 Aug, 2015 01:19 IST|Sakshi

నవమసాలు మోసి పండంటి ఆడ బిడ్డను జన్మనిచ్చిన ఆ తల్లికి చెప్పుకోలేని కష్టం వచ్చిందా.. లేక ఆడపిల్ల  పుటి ్టందనే వివక్షతో వదిలేసిందో తెలియదుకాని పుట్టిన గంటకే ఆ చిన్నారిని శ్మశానికి చేర్చి వెళ్లిపోయింది. సమాదుల మధ్య అమ్మకోసం పరితపించిన పసికందు ఏడుపు విన్న కొందరు మహిళలు అక్కున చేర్చుకొని ప్రాణాలు నిలబెట్టారు. రక్తబంధం విలువలు దిగజార్చేలా చోటుచేసుకున్న ఈ సంఘటన మండలంలోని వెంకిర్యాల గ్రామంలో వెలుగుచూసింది.                                             

-  బీబీనగర్


 రోజులాగే వెంకిర్యాల గ్రామస్తులు శుక్రవారం ఎవరిపనుల్లో వారున్నారు. విద్యార్థులు పాఠశాలలకు వెళ్తుండగా రైతులు పొలాలకు, కూలీలు ఉపాధి పనులకు వెళ్తున్నారు. వెంకిర్యాల గ్రామం నుంచి రాఘవాపురం వెళ్లే రహదారిపై ఉన్న శ్మశానవాటిక దారిలో పనులకు వెళ్తున్న ఉపాధి కూలీలకు చిన్నారి ఏడుపులు వినిపించాయి. శ్మశానం నుంచి ఏడుపులు రావడంతో ముందుగా భయపడిన వారు తర్వాత ధైర్యంచేసి లోనికి వెళ్లారు. అప్పుడే పుట్టిన ఆడ శిశువును గుర్తుతెలియని వ్యక్తులు ప్లాస్టిక్ కవర్లో కట్టి సమాధుల వద్ద పడేశారు. చిన్నారి ఊపిరాడక కాళ్లూచేతులు కొట్టుకోవడంతో కవర్‌ముడి విడిపోయింది. కవరు తెరుచుకోవడంతో పసికందు ఎడువడం వినిపించడం, శ్వాస ఆడడంతో ప్రాణాలతో బయటపడింది. ఏడుపుల శబ్ధం పెరగడంతో బిడ్డకోసం వెతికిన మహిళలకు రక్తంలో తడిసి విలపిస్తున్న చిన్నారి ఎట్టకేలకు కనిపించింది. నివ్వెరపోయిన వారు వెంటనే అక్కున చేర్చుకొని గ్రామంలోకి తీసుకొచ్చారు.
 
 స్థానికుల పనేనా?
 జన్మించిన అరగంట వ్యవధిలోనే ఆడ శిశువును వదిలేసి వెళ్లడంతో ఇది ముమ్మాటికీ స్థానికుల పనేనని అందరూ అనుమానిస్తున్నారు. పడేసిన కాసేపటికే విషయం బయటపడటంతో ఈ దారుణానికి ఒడిగట్టిందెవరని ఆరా తీస్తున్నారు. పసికందును వేసి ఉన్న కవర్లో డెలివరీకి వాడిన బ్లౌస్‌లు ఉండడంపై ఆర్‌ఎంపీ డాక్టర్లు డెలివరీ చేసి ఉండవచ్చని  బీబీనగర్ పీహెచ్‌సీ వైద్యాధికారులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు.
 
 ఐసీడీఎస్ అధికారులకు అప్పగింత
 పసికందును చేరదీసిన గ్రామ మహిళలు స్థానిక నాయకుల సహకారంతో ఓ పాఠశాలకు చెందిన బస్సులో బీబీనగర్ పీహెచ్‌సీకి తీసుకువచ్చారు. వెంటనే వైద్య సిబ్బంది శిశువును శుభ్రం చేసి చికిత్స చేశారు. సమాచారం తెలుసుకున్న స్థానిక తహసీల్దార్, ఎంపీడీఓలు ఆసుపత్రికి చెరుకొని జరిగిన విషయం తెలుసుకున్నారు. అనంతరం ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు పీహెచ్‌సీకి చెరుకొని పసికందును నల్లగొండలోని శిశు సంక్షేమ గ ృహానికి తీసుకెళ్లారు.
 

మరిన్ని వార్తలు