నారాయణఖేడ్‌లో ‘కింగ్‌’ ఏవరు..?

3 Dec, 2018 11:55 IST|Sakshi

నారాయణఖేడ్‌ లో త్రిముఖ పోరు

గెలుపే లక్ష్యంగా సాగుతున్న ప్రచారం

నారాయణఖేడ్‌: కర్ణాటక, మహారాష్ట్రకు సరిహద్దుగా ఉన్న నారాయణఖేడ్‌ నియోజకవర్గం త్రివేణీ సంగమంగా విరాజిల్లుతుంది. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడి ఉన్న ప్రాంతంగా ఈ నియోజకవర్గం పేరుగాంచింది. కాంగ్రెస్‌ కంచుకోటగా ఉన్న ఈ నియోజకవర్గంలో 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పాగావేసింది. మళ్లీ ఈ గడ్డపై గులాబీ జెండాను ఎగురవేయాలన్న లక్ష్యంతో ఆ పార్టీ నేతలు ప్రచారన్ని సాగిస్తున్నారు. నియోజకవర్గంలో ఇప్పటివకు పటోళ్ల, షెట్కార్, మహారెడ్డి కుటుంబాల పాలనే సాగుతూ వస్తోంది.

ప్రస్తుత ఎన్నికల్లో సైతం ప్రధాన పార్టీల నుంచి ఆ కుటుంబాల వారే బరిలో నిలిచారు. రెండున్నరేళ్లలో చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందన్న ధీమాతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి భూపాల్‌రెడ్డి ముందుకు సాగుతున్నారు. తన తండ్రి దివంగత ఎమ్మెల్యే స్వర్గీయ కిష్టారెడ్డి నియోజకవర్గాన్ని ఎంతగానో అభివృద్ధి చేశాడని గుర్తు చేస్తూ బీజేపీ అభ్యర్థి సంజీవరెడ్డి ప్రచారన్ని సాగిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, కాంగ్రెస్‌ గతంలో చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందన్న ధీమాతో ఆ పార్టీ అభ్యర్థి సురేశ్‌ షెట్కార్‌ చెబుతున్నారు. ఖేడ్‌లో ఈ ముగ్గురి నడమే ప్రధానంగా పోటీ నెలకొంది.

పట్లోళ్ళ సంజీవరెడ్డి (బీజేపీ అభ్యర్థి) 
ఖేడ్‌ మండలం పంచగామకు చెందిన మాజీ ఎమ్మెల్యే కిష్టారెడ్డి కుమారుడు పట్లోళ్ళ సంజీవరెడ్డి. వృత్తి రిత్యా వైద్యుడు. 2004లో రాజకీయాల్లోకి ప్రవేశించారు. 2006 నుంచి 2011 వరకు ఖేడ్‌ జెడ్పీటీసీగా పనిచేశారు. 2013లో ఎంపీటీసీగా గెలుపొంది ప్రస్తుతం నారాయణఖేడ్‌ ఎంపీపీగా ఉన్నారు. తండ్రి వెంటే రాజకీయాల్లో ఉంటూ ఎన్నికల సమయంలో తండ్రి గెలుపుకోసం శ్రమించారు. కిష్టారెడ్డి హఠాన్మరణం చెందడంతో 2016 ఉప ఎన్నికల్లో పోటీచేశారు. ముక్కుసూటితనం ఉండడం, ఒక్కమారుగా పార్టీ మారడం కొంత ప్రతికూలత అయినా, తండ్రి క్యాడర్, ఉప ఎన్నికల ఓటమి సానుభూతి, ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, కార్యకర్తలకు అందుబాటులో ఉండడం, యువత సపోర్ట్‌ తదితర అంశాలతో గెలుపొందుతాననే ధీమాతో ఉన్నారు.

సురేష్‌ షెట్కార్‌ (కాంగ్రెస్‌ అభ్యర్థి) 
ఖేడ్‌ పట్టణానికి చెందిన స్వాతంత్ర సమరయోధుడు, దివంగత మాజీ ఎమ్మెల్యే శివరావు షెట్కార్‌ కుమారుడు సురేష్‌ షెట్కార్‌. 1997లో రాజకీయాల్లో ప్రవేశించారు. యూత్‌ కాంగ్రెస్‌ జిల్లా ఉపాధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా ఒక పర్యాయం కొనసాగారు. డీసీసీ అధ్యక్షుడిగా సైతం పనిచేశారు. 2004లో నారాయణఖేడ్‌ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో జరిగిన ఎన్నికల్లో జహీరాబాద్‌ ఎంపీగా పోటీచేసి గెలుపొందారు. 2014లో అదే స్థానానికి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుత ఎన్నికల్లో ప్రజా కూటమి తరఫుగా ఖేడ్‌ శాసనసభ స్థానం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆయన బరిలో నిలిచారు. స్థానికంగా అందుబాటులో ఉండడనే అపవాదు ఉండడం, ఉప ఎన్నికల్లో క్యాడర్‌ కొంత దూరం కావడం కొంత ప్రతికూల అంశాలుగా ఉన్నాయి. ఎమ్మెల్యే, ఎంపీగా ఖేడ్‌కు చేసిన అభివృద్ధే తనను గెలిపిస్తుందనే ధీమాతో ఉన్నారు. 

సిట్టింగ్‌ ప్రొఫైల్‌.. 
భూపాల్‌రెడ్డిది కల్హేర్‌ మండలం ఖానాపూర్‌(కె). దివంగత మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి వెంకట్‌రెడ్డి కుమారుడు. కృష్ణాపూర్‌ ప్రాథమిక సహాకర సంఘం చైర్మన్‌గా జిల్లా సహకార కేంద్ర బ్యాంకు డైరెక్టర్‌గా పనిచేశాడు. 2008లో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరి పార్టీ రైతు విభాగం రాష్ట్ర నాయకులుగా> ఎన్నికయ్యారు. 2009లో టీఆర్‌ఎస్, టీడీపీ పొత్తులో భాగంగా టీఆర్‌ఎస్‌ టిక్కెట్‌ దక్కించుకొని ఓటమి చెందారు. తిరిగి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో నిలిచి రెండో సారి ఓటమిపాలయ్యారు. అనంతరం 2016లో అప్పటి ఎమ్మెల్యే కిష్టారెడ్డి మరణంతో జరిగిన ఉప ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొంది శాసనసభలో అడుగుపెట్టారు.

అభివృద్ధి పనులు.. 
ఖేడ్‌లో మార్కెట్‌ యార్డు, పెద్దశంకరంపేటలో సబ్‌మార్కెట్‌ యార్డు, మండలానికి ఒక గిడ్డంగి నిర్మాణం. మద్దతు ధరకు ధాన్యం కొనుగోళ్లు చేపట్టడం. 
15 నూతన 33/11 కేవీ సబ్‌స్టేషన్లు ఒక 132కేవీ సబ్‌స్టేషన్‌ నిర్మాణం, 80మంది నిరుద్యోగులకు ఉపాది. విద్యుత్‌ సమస్య నివారణ
రూ.24కోట్లతో నల్లవాగు కాల్వల ఆధునికీకరణ. 8 కొత్త చెరువులు మంజూరు, 12 చెరువులకు హైడ్రాలిక్‌ అనుమతులు. 
7.5 కోట్లతో మనూరు, నాగల్‌గిద్ద మండలాలకు సాగునీటికోసం నాలుగు ఎత్తిపోతల పథకాల రమ్మతులు 
15కిలోమీటర్లు ఉన్న డబుల్‌లైన్‌ రోడ్డు 130కిలోమీటర్లకు విస్తరించడం. పీఆర్, ఆర్‌అండ్‌బీలో 100కోట్లతో రోడ్ల మరమ్మతులు. 
ఏడు గురుకులాలు మంజూరు
మనూరుకు జూనియర్‌ కళాశాల మంజూరుతోపాటు, కల్హేర్, కంగ్టిలో కళాశాల భవనాల ఏర్పాటు, ఖేడ్‌లో మోడల్‌ డిగ్రీ కళాశాల ప్రారంభం.
ఖేడ్‌లో 100 పడకల ఆస్పత్రి ప్రారంభం. డయాలసిస్‌ కేంద్రం ఏర్పాటు, మండలాల్లోని పీహెచ్‌సీల స్థాయి పెంపు. 
ఖేడ్‌ డివిజన్‌ కేంద్రం, డీఎస్పీ కార్యాలయం, రెండు నూతన మండలాల ఏర్పాటు. 
రూ.70కోట్లతో 20 నూతన వంతెనల నిర్మాణం, రూ.30కోట్లతో నియోజకవర్గంలో సీసీ రోడ్ల నిర్మాణం. 

ప్రధాన సమస్యలు.. 
ఖేడ్‌ నుండి వలసలు శాశ్వతంగా నిలిచిపోకపోవడం, కర్మాగారాల నిర్మాణం జరగకపోవడం. 
డబుల్‌బెడ్‌రూం ఇండ్లు ఇంకా లబ్ధిదారులకు అందకపోవడం. 
మంజీరా నీరు సాగుకు అందకపోవడం. 
మిషన్‌ భగీరథ పథకం పూర్తికాకపోవడం. 
రోడ్ల విస్తరణ పనులు పూర్తికాకపోవడం, ఖేడ్‌ ఆస్పత్రిలో సిబ్బంది కొరత.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు