'దయచేసి లైంగిక వేధింపులు ఆపండి'

4 Dec, 2019 01:16 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచవ్యాప్తంగా ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. మహిళలపై జరుగుతున్న హింస మానవ హక్కుల ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. వారిపై వివక్ష చూపడమేనని తెలిపింది. ‘స్త్రీలను గౌరవించడం, వారిపై హింసను నిరోధించడం’పై డబ్ల్యూహెచ్‌వో ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేసింది. మహిళల భద్రతకు మొదటి స్థానం కల్పించాలని ప్రపంచ దేశాలకు పిలుపునిచ్చింది.

వారికి ఎలాంటి హాని చేయకూడదని హితవు పలికింది. వారి గోప్యతను కాపాడాలని, భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేసింది. వారిపై ఏ మాత్రం వివక్ష చూపించొద్దని కోరింది. అందుకోసం కార్యక్రమాలను రూపొందించాలని పేర్కొంది. నిర్దేశిత ప్రణాళిక ప్రకారం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పేర్కొంది. మహిళల పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న దానిపై ఓ విధానం తీసుకురావాలని సూచించింది. స్త్రీలపై జరుగుతున్న లైంగిక వేధింపులు, అత్యాచారాల వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని తెలిపింది. దీనివల్ల సమాజ అభివృద్ధికి ఆటంకం ఏర్పడుతుందని, కుటుంబాలు ఛిన్నాభిన్నం అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది.

లైంగిక హింసతో విలవిల..
ప్రపంచవ్యాప్తంగా దాదాపు ప్రతి ముగ్గురు మహిళల్లో ఒకరు లైంగిక వేధింపులకు గురవుతున్నారు. కౌమారదశలో ఉన్న బాలికలు, యువతులు, ఇతర మైనారిటీ మహిళలు, వైకల్యాలున్న స్త్రీలు అనేక రకాల హింసలకు గురవుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా 38 నుంచి 50 శాతం మహిళల హత్యలు వారి సన్నిహితుల ద్వారానే జరుగుతున్నాయి. ఈ పరిస్థితులు సామాజిక, ఆర్థిక, కుటుంబాలపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి. హింస నుంచి బయటపడిన మహిళల్లో దాదాపు 55 శాతం నుంచి 95 శాతం మంది వరకు ఆ సంఘటనను బయటకు చెప్పడానికి ముందుకు రావట్లేదు. పురుషుల అక్రమ సంబంధాలు కూడా అనేకసార్లు మహిళలపై హింసకు కారణంగా నిలుస్తున్నాయి.

ఆరోగ్యంపై ప్రభావం..
లైంగిక హింస మహిళలకు తీవ్రమైన శారీరక, మానసిక, లైంగిక, పునరుత్పత్తికి సంబంధిం చిన ఆరోగ్య సమస్యలను కలిగిస్తాయి. గర్భం దాల్చడం, ప్రేరేపిత గర్భస్రావం, హెచ్‌ఐవీ సహా పలు వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. లైంగిక వేధింపులకు గురైన మహిళల్లో ఇలాంటి వ్యాధులు ఒకటిన్నర రెట్లు ఎక్కువ. గర్భస్రావం రెండింతలు ఎక్కువ. ఈ రకమైన హింస కారణంగా నిరాశ, ఒత్తిడి, నిద్రలేమి, ఆత్మహత్యాయత్నాలకు పాల్పడే ప్రమాదం ఉంది. తాగుడుకు బానిసలు అవుతారు. తలనొప్పి, వెన్నునొప్పి, జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశముంది. హింస ఉన్న కుటుంబాల్లో పెరిగే పిల్లల్లో నేర ప్రవృత్తి ఉండే అవకాశం ఉంది.

కింది జాగ్రత్తలు తీసుకోవాలి..

  • స్త్రీలకు సురక్షితమైన బహిరంగ ప్రదేశాలుండాలి.
  • బయటకు వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉండకూడదు.
  • పురుషుల హక్కులను కాపాడుతూ స్త్రీ అణచివేతను సమర్థించే నిబంధనలను తొలగించాలి.
  • మహిళలకు చట్టబద్ధమైన, సామాజిక రక్షణలు మాత్రమే సరిపోవని, రాజకీయ సంకల్పం ఉండాలని డబ్ల్యూహెచ్‌వో స్పష్టం చేసింది.
  • మహిళలపై హింసను పరిష్కరించడానికి కార్యక్రమాలు, పరిశోధనలు, ఆరోగ్యం, విద్య, చట్టం అమలు, సామాజిక సామర్థ్యాలను బలోపేతం చేయడానికి వనరులు కేటాయించాలి.
  • మహిళా సాధికారత పెరగాలి.
  • పేదరికం తగ్గించాలి.
  • ప్రభుత్వాలు మహిళలపై హింసను అంతం చేయాలి.  
మరిన్ని వార్తలు