వ్యాధులకు లోగిళ్లు

26 Nov, 2019 02:48 IST|Sakshi

అస్తవ్యస్త గృహాలతో అనారోగ్యం 

గాలి, వెలుతురు లేకుంటే వ్యాధులు

ఇల్లు–ఆరోగ్యం’పై ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: గృహమే స్వర్గసీమ. అయితే నాసిరకపు ఇళ్లు వ్యాధులకు నిలయాలుగా మారుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) ఆవేదన వ్యక్తం చేసింది. ‘ఇల్లు–ఆరోగ్యం’పేరుతో తాజాగా డబ్ల్యూహెచ్‌వో ఓ నివేదిక  విడుదల చేసింది. ఇరుకైన గదులు, గాలి, వెలుతురు లేకుండా ఎక్కువ మంది నివసించడం వల్ల ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని హెచ్చరించింది. అంటువ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, బీపీ వంటివి చుట్టుముడుతున్నాయని తేల్చింది. పెరుగుతున్న జనాభా, వాతావరణ మార్పుల కారణంగా ఆరోగ్యకరమైన ఇంటి నిర్మా ణం ఎంతో కీలకమైందని పేర్కొంది. 2050 నాటికి ప్రపంచ పట్టణ జనాభా రెట్టింపు అవుతుందని భావిస్తున్నారు. 60 ఏళ్లు పైబడిన జనాభా కూడా 2050 నాటికి రెట్టింపు అవుతుందని డబ్ల్యూహెచ్‌వో పేర్కొంది.

మురికివాడల్లో 100 కోట్ల మంది జనాభా..
ప్రపంచవ్యాప్తంగా మురికివాడల్లో 100 కోట్ల మంది జనాభా నివసిస్తున్నారు. అందులో దాదాపు 10 కోట్ల మంది వరకు భారతదేశంలోనే ఉన్నారని అంచనా. మురికివాడల్లోని చిన్నపాటి గదులుండే ఆవాసాల్లో సక్రమమైన తాగునీరు ఉండే పరిస్థితి లేదు. పారిశుధ్యం మచ్చుకైనా ఉండదు. కలుషితమైన నీరు వారిని వెంటాడుతుంది. డయేరియా వ్యాధితో ప్రపంచవ్యాప్తంగా 2016లో 8.29 లక్షల మంది చనిపోయారని నివేదిక తెలిపింది. ఒకే గదిలో నలుగురు నివసిస్తే అంటు వ్యాధులు ప్రబలుతాయని పేర్కొంది.

వంట కోసం కిరోసిన్, కట్టెల పొయ్యి వాడకం వల్ల కాలుష్యం పెరుగుతుంది. దీంతో ఉబ్బసం, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. 70 శాతం ప్రజలు ఎక్కువ సమయం ఇంట్లోనే గడుపుతారు. కొన్ని దేశాల్లో నిరుద్యోగులు గృహాధారిత పరిశ్రమల్లో పనిచేస్తున్నారు. పిల్లలు, వృద్ధులు, వైకల్యం లేదా దీర్ఘకాలిక అనారోగ్యం ఉన్నవారు కూడా ఇంట్లో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం ఉంది. అలాంటి చోట్ల అంటువ్యాధులు ప్రబలుతున్నాయని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.

సబ్సిడీతో నిర్మించాలి..
మంచి గాలి వెలుతురు, ఆరోగ్యకరంగా ఉండే ఇళ్ల నిర్మాణాలకు ప్రభుత్వం చేయూతనివ్వాలని డబ్ల్యూహెచ్‌వో సూచించింది. వాస్తు శిల్పులు, బిల్డర్లు, హౌసింగ్‌ ప్రొవైడర్లు, డెవలపర్లు, ఇంజనీర్లు, పట్టణ ప్రణాళిక అధికారులు ఈ విషయంపై దృష్టి సారించాలని సూచించింది. అలాగే సామాజిక సేవలు, కమ్యూనిటీ గ్రూపులు, ప్రజారోగ్య నిపుణులు దృష్టి సారించాలి. మంచి గృహ నిర్మాణాల కోసం ప్రజలకు సబ్సిడీ ఇవ్వడం అవసరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ విజ్ఞప్తి చేసింది.
సమస్యలొస్తాయి..

అపరిశుభ్రత వల్ల వచ్చే సమస్యలు
– అపరిశుభ్రమైన ఇళ్లల్లో టీబీ వంటి వ్యాధులు సోకే ప్రమాదముంది.
– టైఫాయిడ్, డెంగీ జ్వరాలు, గుండె జబ్బులు, ఇతర అంటు వ్యాధులు.
– గొంతు, కంటి, చర్మ వ్యాధులు, నవజాత శిశువులకు ఇన్ఫెక్షన్లు వస్తాయి.
– మానసిక ఆరోగ్య సమస్యలు, మద్యం వినియోగం పెరగడం, నిరాశకు గురికావడం జరుగుతుంది.
– ఆస్బెస్టాస్‌ టైల్స్, రేకుల వాడకం వల్ల ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలు వస్తాయి.  

>
మరిన్ని వార్తలు