ఆ డబ్బు ఎవరు పంపారు?

30 Jan, 2019 02:11 IST|Sakshi

అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబడ్డ రూ.6 కోట్ల నగదుపై విచారణ ముమ్మరం

ఫిబ్రవరి మొదటివారంలో నామా, కొండా, రవిచంద్రలకు నోటీసులు

విశాఖపట్నం నుంచే ఆ హవాలా డబ్బు వచ్చినట్టు గుర్తించిన పోలీసులు

విశాఖలో విచారణకు రెండు బృందాలు.. పచ్చపార్టీ నేతల్లో వణుకు!  

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో పట్టుబడ్డ నగదు కేసులో పోలీస్‌శాఖ విచారణను వేగవంతం చేసింది. ఇటీవల జరిగిన శాసనసభ ఎన్నికల్లో వరంగల్‌ కమిషనరేట్‌ పోలీసులు పెంబర్తి చెక్‌పోస్టు వద్ద రూ.6 కోట్ల నగదును పట్టుకున్నారు. ఈ కేసులో పట్టుబడ్డ బేగంబజార్‌కు చెందిన హవాలా వ్యాపారి అగర్వాల్‌ను టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు విచారించారు. ముగ్గురు నేతలకు ఆ డబ్బును తీసుకెళ్తున్నట్టు అగర్వాల్‌ విచారణలో బయటపెట్టాడని వరంగల్‌ పోలీసులు తెలిపారు. ఖమ్మం మాజీ ఎంపీ నామా నాగేశ్వర్‌రావు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి, వరంగల్‌ ఈస్ట్‌లో కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన వద్దిరాజు రవిచంద్రకు ఈ నగదును తరలిస్తున్నట్లు వెల్లడించారు. అయితే పట్టుబడ్డ డబ్బు అగర్వాల్‌కు ఎక్కడి నుంచి వచ్చింది.. హవాలా ద్వారా అభ్యర్థులకు డబ్బు పంపించింది ఎవరన్న దానిపై వరంగల్‌ పోలీసులు దృష్టి సారించారు. మొన్నటివరకు అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు పంచాయతీ ఎన్నికలు ముగుస్తున్న తరుణంలో కేసు దర్యాప్తును వేగవంతం చేయాలని పోలీస్‌ ఉన్నతాధికారులు వరంగల్‌ యంత్రాంగాన్ని ఆదేశించినట్టు సమాచారం. 

ఫిబ్రవరి మొదటి వారంలో నోటీసులు: హవాలా డబ్బులు తెప్పించిన వ్యవహారంలో ముగ్గురు నేతలు నామా నాగేశ్వర్‌రావు, కొండా మురళి, రవిచంద్రకు ఫిబ్రవరి మొదటి వారంలో నోటీసులు జారీ చేయనున్నట్టు పోలీస్‌ ఉన్నతాధికారులు తెలిపారు. డబ్బు కోసం ఎవరిని సంప్రదించారు.. ఎక్కడ్నుంచి ఆ డబ్బు వచ్చింది.. తదితర అంశాలపై విచారించేందుకు వరంగల్‌ పోలీసులు సిద్ధమయ్యారు. ఎన్నికల్లో ఇంత మొత్తంలో డబ్బు ఖర్చు పెట్టడం వెనుక వ్యూహకర్త ఎవరన్న దాని పైనా వివరాలు రాబట్టేందుకు పోలీసులు ప్రయత్నించనున్నట్టు తెలుస్తోంది. 

విశాఖ నుంచే వచ్చిందా? 
హవాలా ద్వారా హైదరాబాద్‌ వచ్చిన సొమ్మును కారు వెనుక సీట్లో కింద ప్రత్యేక అమరికలో తరలించిన విధానం చూస్తుంటే లింకు పెద్దదిగా ఉన్నట్టు వరంగల్‌ పోలీసులు అనుమానిస్తున్నారు. పట్టుబడిన నగదు మాత్రమే కాకుండా ఇంకా ఎక్కడెక్కడికి అగర్వాల్‌ ద్వారా డబ్బులు పంపించారు.. ఎవరెవరికి ఎంత అందింది.. అన్న లెక్కలు కూడా బయటపడే అవకాశాలున్నట్టు భావిస్తున్నారు. అయితే ఆ డబ్బు వచ్చింది ఏపీలోని విశాఖపట్నం నుంచే అని విచారణలో పోలీసులు గుర్తించినట్టు తెలుస్తోంది. దీంతో విశాఖపట్నంలోనూ విచారణ జరిపేందుకు రెండు బృందాలను పంపనున్నట్టు సమాచారం. ఈ వ్యవహారానికి సంబంధించి ఆ ముగ్గురు నేతలతో పాటు ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసిన వారి అనుచరుల ఫోన్‌ కాల్‌డేటాలను సేకరించినట్టు తెలుస్తోంది. ఇటు అగర్వాల్‌తో పాటు అతడి సోదరులు, వారి అసిస్టెంట్ల కాల్‌డేటాలను సైతం అనాలసిస్‌ చేస్తున్నట్టు తెలిసింది. దీని ద్వారా విశాఖలో ఎవరి నుంచి డబ్బు వచ్చిందన్న వివరాలు త్వరలోనే వెల్లడవుతాయని ఉన్నతాధికారులు స్పష్టంచేశారు. 

ఆ డబ్బు పచ్చపార్టీదేనా? 
తెలంగాణలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని కూటమిగా పోటీ చేసిన ఏపీ సీఎం చంద్రబాబుకు సంబంధించిన వ్యక్తుల నుంచే ఈ రూ.6 కోట్లు హవాలా ద్వారా వచ్చి ఉంటుందని సర్వత్రా చర్చ జరుగుతోంది. తెలంగాణలో టీడీపీ పోటీ చేసిన స్థానాలతో పాటు పలువురు కాంగ్రెస్‌ అభ్యర్థులకు సైతం పచ్చ పార్టీ నుంచే కోట్ల రూపాయలు రవాణా అయినట్టు ఆరోపణలున్నాయి. పట్టుబడ్డ డబ్బుకు సంబంధించిన వ్యవహారంలో టీడీపీ నేత నామా నాగేశ్వర్‌రావు పేరుండటం సంచలనంగా మారింది. అయితే వరంగల్‌ పోలీసులు కేసు విచారణలో వేగం పెంచడంతో పక్క రాష్ట్రంలోని పచ్చపార్టీ నేతలు వణికిపోతున్నారని తెలిసింది.  

మరిన్ని వార్తలు