ఎవరీ స్వప్నారెడ్డి?

11 Jul, 2018 02:23 IST|Sakshi

ముఖ్యమంత్రి నోట పోసానిపేట సర్పంచ్‌ మాట

ఆరా తీసిన ప్రభుత్వం

జోగిపేట (అందోల్‌): గ్రామ పంచాయతీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లు 50 శాతానికి మించిపోతున్నాయ ని, ఇది సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పునకు విరుద్ధమని అందోల్‌ మండలం పోసాని పేట గ్రామ సర్పంచ్‌ స్వప్నారెడ్డి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో రిజర్వేషన్ల కేటాయింపు 50 శాతానికి మించి ఉండకూడదంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు సోమ వారం తేల్చిచెప్పింది.

దీంతో స్వప్నారెడ్డి పేరు ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అసలు ఈ స్వప్నారెడ్డి ఎవరు? అని ఇంటెలిజెన్స్‌ అధికారులు ఆరా తీశారు. రిజర్వేషన్లకు సంబంధించి కోర్టు ఉత్తర్వులపై సీఎం కేసీఆర్‌ స్పందించి సర్పంచ్‌ పేరును ప్రస్తావించడం చర్చనీయాంశమైంది. కాంగ్రెస్‌ పార్టీకి చెందిన సర్పంచ్‌గా సీఎం ప్రస్తావించడంతో స్థానిక నాయకులు చర్చించుకున్నారు.

ఎన్నికలు ఆపాలన్న ఉద్దేశం లేదు..
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను ఆపాలన్న ఉద్దేశంతో కోర్టులో పిటిషన్‌ దాఖలు చేయలేదు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉల్లంఘనకు గురవుతోందనే పిటిషన్‌ వేశాం. ఒకవేళ దీనిపై ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయిస్తే నేను కూడా సుప్రీంకు వెళ్లి 50% మించకుండా చూడాలని కోరతాను.    – స్వప్నారెడ్డి

మరిన్ని వార్తలు