కౌన్‌ బనేగా సీఎల్పీ నేత?

17 Jan, 2019 03:19 IST|Sakshi

కాంగ్రెస్‌పక్ష నేత ఎంపిక ఆసక్తికరం

రేసులో ఉత్తమ్, భట్టి, శ్రీధర్‌బాబు

ఉత్తమ్‌కే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు

నేడు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల సమావేశం

సాక్షి, హైదరాబాద్‌: నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ శాసనసభా పక్ష (సీఎల్పీ) నేతగా ఎవరు ఎన్నికవుతారనే దానిపై సస్పెన్స్‌ కొనసాగుతోంది. ఈ పదవి కోసం పార్టీలోని హేమాహేమీలు పోటీపడుతుండటం, అధిష్టానం కూడా మనసులోని మాటను వెల్లడించకపోవడంతో ఉత్కంఠ రేగుతోంది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, పార్టీ ప్రచార కమిటీ చైర్మన్‌ భట్టి విక్రమార్కలు ఈ రేసులో ముందున్నారు. మాజీ శాసనసభా వ్యవహారాల మంత్రిగా పనిచేసిన దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేరు కూడా పరిశీలనలో ఉంది. తమకు అవకాశం ఇవ్వాలని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డిలు డిమాండ్‌ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అధిష్టానం ఏం నిర్ణయం తీసుకుంటుందనేది చర్చనీయాంశమైంది. ఇటీవలి ఎన్నికల్లో పార్టీ ఓటమికి ఉత్తమ్, భట్టిలు బాధ్యులనే చర్చ జరుగుతున్నందున.. అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది. అయితే.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల్లో ఎక్కువ మంది ఉత్తమ్‌ పేరు సూచించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఉత్తమ్‌ను సీఎల్పీ నేతగా ఎంపిక చేస్తే కొన్నాళ్లు పీసీసీ అధ్యక్షునిగా కూడా కొనసాగించి, తర్వాత ఆ పదవిని భట్టికి అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది.

ఇక, భట్టిని సీఎల్పీ నేత చేస్తే.. ఉత్తమ్‌ టీపీసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగే అవకాశం ఉంది. లోక్‌సభ ఎన్నికల అనంతరం పీసీసీ అధ్యక్షుని విషయంలో అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని తెలుస్తోంది. అధిష్టానం ప్రత్యామ్నాయ నేత కోసం వెతికితే మాత్రం మాజీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. అయితే, శ్రీధర్‌ బాబు సీఎల్పీ నేత కన్నా ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) చైర్మన్‌ పదవిని ఆశిస్తున్నట్టు సమాచారం. శ్రీధర్‌బాబు కూడా కాకపోతే మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేరు మహిళా కోటాలో పరిశీలించే అవకాశముంది. మొన్నటి ఎన్నికల్లో మునుగోడు నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా సీఎల్పీ పదవిపై ఆసక్తి కనబరుస్తున్నారు. అయితే.. తొలిసారి ఎమ్మెల్యే కావడం ఆయనకు ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. ఇదే జరిగితే పార్టీకి సంబంధించిన కీలక బాధ్యతలు తనకు గానీ, తన సోదరుడు వెంకటరెడ్డికి గానీ అప్పగిస్తామని అధిష్టానం హామీ ఇచ్చే అవకాశాలున్నాయనే చర్చ కూడా జరుగుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా సీఎల్పీ పదవికి పోటీ ఉండటం, అధిష్టానం కూడా ఈ విషయంలో గుంభనంగా వ్యవహరిస్తుండటంతో గురువారం నాటి సీఎల్పీ భేటీపై ఆసక్తి నెలకొంది.

హైదరాబాద్‌కు వేణుగోపాల్‌
సీఎల్పీ నేత ఎన్నిక సమావేశానికి అధిష్టానం దూతగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ హాజరవుతున్నారు. ఆయన బుధవారం సాయంత్రమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆయనకు శంషాబాద్‌ విమానాశ్రయంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, కోశాధికారి గూడూరు నారాయణ రెడ్డి, ప్రొటోకాల్‌ ఇన్‌చార్జి హర్కర వేణుగోపాల్, ఏఐసీసీ కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్‌లు స్వాగతం పలికారు. అక్కడి నుంచి నేరుగా గోల్కొండ హోటల్‌ చేరుకున్న వేణుగోపాల్‌ అక్కడ టీపీసీసీ కోర్‌కమిటీ సమావేశం నిర్వహించారు. సీఎల్పీ నేతగా ఎవరిని ఎన్నుకోవాలన్న దానిపై ఈ భేటీలో చర్చించినట్టు తెలుస్తోంది. కాగా, గురువారం ఉదయం 9 గంటలకు అసెంబ్లీ ప్రాంగణంలో సీఎల్పీ సమావేశం జరగనుంది.

మరిన్ని వార్తలు