రెండోసారి గెలుపు కోసం రాథోడ్ బాపూరావు ఆరాటం
ప్రభుత్వ వ్యతిరేకత, ఆదివాసీల ఓట్లపై ‘సోయం’ ఆశలు
కేంద్ర పథకాలతో బీజేపీ ముందుకు..
సాక్షి, ఇచ్చోడ(బోథ్) : పోరాటాల పురిటి గడ్డ బోథ్ అసెంబ్లీ నియోజకవర్గం ఓటర్లు ఈ సారి ఎవరిని ఆదరిస్తారు? ఏ పార్టీకి ఓటేస్తారు.. అనేది ఆసక్తిగా మారింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ అభ్యర్థిని తీవ్ర ఉత్కంఠ మధ్య శనివారం ప్రకటించడంతో బరిలో నిలిచే వారెవరనేది తేలిపోయింది. నామినేషన్ల గడువు కూడా సమీపిస్తుండటంతో రాజకీయం రసవత్తరంగా మారనుంది. ఈ నేపథ్యంలో బోథ్ నియోజకవర్గ అభ్యర్థుల అనుకూల, ప్రతికూలతలపై కథనం.
కొత్తగా బరిలో కమలం
బోథ్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరఫున మాడవి రాజు బరిలో ఉండనున్నారు. గతంలో 2009లో బీజేపీ నుంచి పోటీ చేసిన అడే మానాజీకి టికెట్ ఇవ్వకుండా మాడవి రాజుకు టికెట్ ఇచ్చారు. ఇతను గోండు సామాజిక వర్గానికి చెందిన వారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ.. పథకాలు, హిందుత్వం కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. గోండు సామాజిక వర్గం అభ్యర్థి కావడంతో కొంత ఓటర్లను ఆకర్శించే అవకాశం ఉంది.
ప్రతికూలతలు..
చాలా కాలం తర్వాత బీఎస్పీ అభ్యర్థి: చాలా కాలం తర్వాత బోథ్ నియోజకవర్గంలో బీస్పీ అభ్యర్థి బరిలో దిగుతున్నారు. 1999లో బోథ్ నియోజకవర్గంలో బీఎస్పీ అభ్యర్థి రాములునాయక్ పోటీ చేసి ఓటమి చవిచూశారు. అప్పటి నుంచి బీఎస్పీ నుంచి బోథ్ బరిలో ఎవరూ లేరు. నేరడిగొండ మండలానికి చెందిన లంబాడా సామాజిక వర్గానికి చెందిన అడే గజేందర్ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి బీఎస్పీ నుంచి పోటీలో ఉన్నారు. గజేందర్ రాజకీయాలకు కొత్త. బలమైన అభ్యర్థులు రంగంలో ఉండటంతో ఎదుర్కొనే శక్తి సామర్థ్యాలు సరిపోవనే భావన ఉంది.
పథకాలే అధికార పార్టీకి అండ..
అనుకూలతలు
టీఆర్ఎస్ నుంచి రెండోసారి పోటీ చేస్తున్న రాథోడ్ బాపురావు తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 2014 ఎన్నికల్లో అనుహ్యంగా బోథ్ బరిలో దిగిన రాథోడ్ బాపూరావు టీఆర్ఎస్ నుంచి పోటీచేసి మొదటి సారికే విజయం సాధించారు. ఇప్పుడు మరోసారి టీఆర్ఎస్ నుంచి పోటీలో ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, తాను చేసిన అభివృద్ధి పనులే గెలిపిస్తాయని ధీమాతో ఉన్నారు. బీటీ రోడ్ల నిర్మాణం, మిషన్ కాకతీయ ద్వారా నిర్మించిన చెరువులు, విద్యుత్ సబ్స్టేషన్ల నిర్మాణం, గొముత్రి వద్ద బ్యారెజీ, కుప్టి ప్రాజెక్టు మంజూరు, తదితర అభివృద్ధి పనులు చేయడంతో ఆశలు ఉన్నాయి. తాజాగా ప్రభుత్వం ఇచ్చే హామీలు ఓటర్లను ఆకర్షించనున్నాయి.
ప్రతికూలతలు