కోట్లు.. ఓట్లయ్యేనా..! 

5 Apr, 2019 13:20 IST|Sakshi
టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రంజిత్‌రెడ్డి, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కాంగ్రెస్‌ అభ్యర్థి 

చేవెళ్లలో ఇద్దరు శ్రీమంతుల మధ్య ఎన్నికల సమరం 

సాక్షి, తాండూరు: ఒకరేమో దేశంలో ఉన్న రాజకీయ పార్టీ నేతల్లో అందరికంటే ధనవంతుడు..మరొకరు శ్రమతో కోటీశ్వరుడు..ఇద్దరిది వ్యాపారమే.. ఒకరు సాఫ్ట్‌వేర్‌ రంగంతో పాటు పలు పరిశ్రమలు ఉన్న చేవెళ్ల సిట్టింగ్‌ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, మరొకరు పాల్ట్రీ పరిశ్రమ దిగ్గజం, చేవెళ్ల టీఆర్‌ఎస్‌ ఎంపీ అభ్యర్థి రంజిత్‌రెడ్డి. ఇద్దరు శ్రీమంతుల మధ్య జరుగుతున్న పొలిటికల్‌ వార్‌లో గెలుపోటములపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వ వ్యతిరేకతే తనను గెలిపిస్తుందని కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి అంటుంటే.. కేసీఆర్‌ చరిష్మాతో తాను విజయం సాధిస్తానని «టీఆర్‌ఎస్‌ అభ్యర్థి అంటున్నారు. ఇద్దరి రాజకీయ బలాబలాలు ఎలా ఉన్నా... ఇద్దరు శ్రీమంతుల వద్ద ఉన్న కోట్లు.. ఓట్లుగా మారుతాయా అనేది ప్రస్తుతం హట్‌ టాపిక్‌గా మారింది. ఎంపీగా నామినేషన్‌ వేసే ముందు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి దాదాపు రూ.800 కోట్ల ఆస్తి విలువను చూపించారు. అయితే టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థి డాక్టర్‌ గడ్డం రంజిత్‌రెడ్డి ఎన్నికల నామినేషన్‌ వేసే ముందు రూ.180కోట్ల ఆస్తి విలువను ఎన్నికల అఫిడవిట్‌లో పొందుపర్చారు. దీంతో ఇద్దరు శ్రీమంతుల మధ్య ఎన్నికల వేడి రసవత్తరంగా సాగుతోంది.


ఓట్లు రాబట్టుకోవడంలో ఎవరు సఫలమవుతారు..? 
ఇద్దరు కోటీశ్వరుల మధ్య జరుగుతున్న ఎన్నికల సంగ్రామంలో ఓటర్ల నుంచి ఓట్లు ఎవరు రాబట్టుకుంటారనేది ప్రస్తుతం చర్చనీయాంశమైంది. అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ రంజిత్‌రెడ్డికి ప్రభుత్వ సానుకూలత బాగా పనిచేస్తుంది. అయితే కాంగ్రెస్‌ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డికి కుటుంబ రాజకీయ చరిత్రతో పాటు స్థానికత అనే అంశం కలిసొచ్చేలా ముందుకు వెళ్తున్నారు. 
స్థానికంగా మంచి వ్యక్తిగా ముద్ర పడ్డ కొండా ఓట్లను రాబట్టుకుంటారా లేకా టీఆర్‌ఎస్‌ పార్టీ ప్రభంజనంలో చతికిలా పడతారా అనేది వేచి చూడాల్సిందే. 

>
మరిన్ని వార్తలు