నిర్లక్ష్యం మూల్యం.. నిండు ప్రాణం

20 Jan, 2015 03:28 IST|Sakshi
నిర్లక్ష్యం మూల్యం.. నిండు ప్రాణం

సిరిసిల్ల: ప్రభుత్వాస్పత్రిలో నిర్లక్ష్య వైద్యానికి ఓ పసిగుడ్డు పురిట్లోనే కన్నుమూసింది. నవమాసాలు మోసిన కన్నతల్లి పురిటినొప్పులతో ఆస్పత్రికి వస్తే.. నార్మల్ డెలివరీ చేయాలని జాప్యం చేయడంతో పసిగుడ్డు లోకంపోకడ చూడకుండానే కన్నుమూసింది. బాధితుల కథనం.. సిరిసిల్ల పట్టణంలోని అంభికానగర్‌కు చెందిన ఎండీ సాదుల్లా, షబానా దంపతులకు ఇద్దరు అమ్మాయిలు. షబానా గర్భవతి కావడంతో గత శనివారం సిరిసిల్ల ప్రాంతీయ వైద్యశాలలో చేరింది.

పరీక్షించిన అధికారులు నార్మల్ డెలివరీ చేస్తామని హామీ ఇచ్చారు. సోమవారం తెల్లవారుజామున నొప్పులు రావడంతో ఆపరేషన్ చేయకుండా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం చేశారని ఆరోపించారు. ఉదయం స్కానింగ్ చేసి బాబు చనిపోయాడని సమాధానం ఇచ్చారని తెలిపారు. మెకానిక్ పనిచేసే సాదుల్లా నిరుపేద కావడంతో ప్రైవేటు ఆస్పత్రికి వెళ్లలేక ప్రభుత్వ ఆస్పత్రిలో చేరారని కుటుంబ సభ్యులు రోదించారు.
 
సిబ్బంది నిర్లక్ష్యం..
తెల్లవారుజామునే షబానాకు నొప్పులు రావడంతో సకాలంలో వైద్యసేవలు అందించడంలో సిబ్బంది నిర్లక్ష్యం చేశారని కుటుంబ సభ్యులు ఆరోపించారు. నొప్పులు భరించలేక ఆర్తనాదాలు చేస్తే.. అప్పుడు వచ్చి గ్లూకోజ్ పెట్టారని రెండు గంటల వరకు డాక్టర్ రాలేదని ఆరోపించారు. తొలుత రక్తం తక్కువ ఉందని చెప్పారని, తల్లికి బాగా రక్తస్రావం అయిందని, సబ్బు, నూనె తెచ్చుకోమని చెప్పి నమ్మించి నిండా ముంచారంటూ ఆవేదనగా చెప్పారు. మూడో సంతానంగా బాబు కావడంతో ఆ కుటుంబ సభ్యుల వేదనకు అంతే లేదు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిని శిక్షించాలని కుటుంబ సభ్యులు కోరారు. బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా దర్యాప్తు చేస్తున్నారు.
 
మా తప్పేమీ లేదు..
ఇందులో మా తప్పేమీ లేదు. పాప తల్లి కడుపులోనే ఉమ్మనీరు మింగింది. రెండో కాన్పు నార్మల్ డెలివరీ అయింది. అందుకే నార్మల్ డెలివరీ కోసం వేచిచూశాం. చాలా అరుదుగా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. సకాలంలోనే వైద్యసేవలు అందించి తల్లిని రక్షించాం. పాప చనిపోవడం బాధాకరం.       
  - డాక్టర్ గూడూరి రవీందర్, సూపరింటెండెంట్

మరిన్ని వార్తలు