టీకా వచ్చేసినట్లేనా?

14 Jul, 2020 04:27 IST|Sakshi

వ్యాక్సిన్‌ ప్రయోగాలపై రష్యా ప్రకటనలో కానరాని స్పష్టత

వాణిజ్య స్థాయి ఉత్పత్తిపై వెలువడని సమాచారం

మానవ ప్రయోగ దశలపైనా పలు అనుమానాలు

తొలిదశ టీకాలుగానే చెబుతున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ

కరోనాకు ముకుతాడు వేసే టీకాను మేం తయారు చేశామంటూ రష్యా ప్రకటించగానే అందరిలోనూ ఆనందం వెల్లివిరిసింది. ఇంకేముంది.. ఇంకొన్ని నెలల్లో మహమ్మారి మాయమవుతుంద న్న నమ్మకం కలిగింది. మళ్లీ ప్రపంచమంతా సాధారణ స్థితికి చేరుకుంటుందన్న ఆశ చిగురించింది. ఇంతవరకు బాగానే ఉంది.. కానీ ఈ కొత్త టీకా అందరికీ ఎప్పటికి చేరుతుంది? ఈలోగా ఇతర దేశాల్లో జరుగుతున్న ప్రయోగాలూ కొలిక్కి వస్తాయా? ఇప్పటికిప్పుడు ప్రపంచంలో ఎన్ని కరోనా టీకాలు తయారవుతున్నాయి? రేసులో ఏవి ముందున్నాయి? వెనుకబడ్డవి ఏవి? 

సాక్షి, హైదరాబాద్‌: రష్యాలోని సెషెనోవ్‌ యూనివర్సిటీ కరోనా టీకా తయారు చేయడమే కాకుండా అన్ని మానవ ప్రయోగాలను పూర్తి చేసిందన్న వార్త ఇంటర్నెట్‌లో విపరీతంగా వైరల్‌ అయింది. వైరస్‌కు వ్యతిరేకంగా టీకా రోగ నిరోధక శక్తిని విజయవంతంగా ప్రేరేపించిందని, సురక్షితంగానూ ఉందని ఈ ప్రయోగాలకు నేతృత్వం వహించిన ఎలెనా స్మోల్యార్‌చుక్‌ ప్రకటించడం అందరిలో కొత్త ఆశలు నింపింది. టీకాలు తీసుకున్న వారిలో కొందరు బుధవారం, మరికొందరు ఈ నెల 20న ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్‌ అవుతున్నారని కూడా ఎలెనా ప్రకటించారు. అయితే ఇంతకు మించిన సమాచారమేదీ రష్యా నుంచి రాలేదు. అంటే వాణిజ్య స్థాయి ఉత్పత్తి ఎప్పుడు జరుగుతుంది? ఎంత సమయం పడుతుంది? నిర్వహించిన మానవ ప్రయోగాలు మూడు దశల్లో పూర్తి చేశారా? ఒక దశ మాత్రమేనా? అన్న అనుమానాలూ వ్యక్తమవుతున్నాయి.

అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే రష్యాలోని గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడిమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ  రెండు టీకాలను అభివృద్ధి చేసింది. వీటిని మానవులపై పరీక్షించేందుకు రష్యా గత నెలలో అనుమతులు జారీ చేసింది. రెండు టీకాల్లో ఒకటి పొడి రూపంలోనూ, ఇంకోటి ఇంజెక్షన్‌ రూపంలోనూ ఉన్నట్లు సమాచారం. పొడి రూపంలోని టీకాను ఏదైనా ద్రవంతో కలిపి వాడతారు. రెండు టీకాలు కూడా కండరాల ద్వారా శరీరంలోకి ప్రవేశిస్తాయి. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ట్రాన్స్‌లేషనల్‌ మెడిసిన్‌ అండ్‌ బయోటెక్నాలజీ డైరెక్టర్‌ వాదిమ్‌ తరసోవ్‌ గత నెలలో అధికారిక వార్తా సంస్థ స్పుత్నిక్‌తో మాట్లాడుతూ టీకా అభివృద్ధిలో తామూ పాలుపంచుకున్నామని, ప్రీ క్లినికల్‌ అధ్యయనాలు, ప్రొటోకాల్స్‌ తయారీ వంటివి పూర్తి చేసుకొని మానవ ప్రయోగాలకు సిద్ధం చేశామని ప్రకటించడం ఇక్కడ చెప్పుకోవాలి. రష్యా రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన ‘48వ సెంట్రల్‌ రీసెర్చ్‌ సెంటర్‌’లో మానవ ప్రయోగాల కంటే ముందు టీకా భద్రత, జంతు ప్రయోగాలు, రోగ నిరోధక శక్తిని ప్రేరేపిస్తుందా? లేదా? అన్న అంశాలను పరీక్షించారు.

ప్రయోగాలు జరిగిందిలా
టీకా ప్రయోగాల కోసం 18–65 మధ్య వయస్కులను ఎంపిక చేసుకున్నారు. మహిళలు, పురుషులు ఇద్దరిపై ప్రయోగాలు జరిగాయి. తొలి దశలో భాగంగా 18 మందికి జూన్‌ 18న, రెండో దశలో 20 మంది కార్యకర్తలకు జూన్‌ 23న టీకాలు ఇచ్చారు. గమలేయా నేషనల్‌ రీసెర్చ్‌ సెంటర్‌ ఫర్‌ ఎపిడిమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ ఈ ప్రయోగాల సమాచారాన్ని సేకరించి విశ్లేషించింది. రెండు బృందాల్లోని కార్యకర్తల్లో కరోనా వైరస్‌ నిరోధానికి అవసరమైన ప్రతిస్పందన కనిపించింది. కొంత మంది తలనొప్పి, జ్వరం వంటి వాటితో ఇబ్బంది పడినప్పటికీ వ్యాక్సిన్‌ ప్రయోగించిన 24 గంటల్లో ఈ లక్షణాలన్నీ తగ్గిపోయాయని యూనివర్సిటీ తెలిపింది.

కార్యకర్తలందరినీ సెషెనోవ్‌ వర్సిటీలోనే 28 రోజులపాటు ఐసోలేషన్‌లో ఉంచారు. విడుదలైన తరువాత కూడా వైద్యులు వారిని కనీసం ఆరు నెలలపాటు పరిశీలిస్తారని తెలుస్తోంది. గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసిన ఈ టీకాను బర్డెంకో మిలిటరీ ఆసుపత్రిలోనూ పరీక్షించారు. గమలేయా డైరెక్టర్‌ అలెగ్జాండర్‌ గింట్స్‌బర్గ్‌ జూన్‌ 22న తెలిపిన దాని ప్రకారం ఈ కొత్త టీకాను రెండు డోసులుగా తీసుకుంటే రెండేళ్లపాటు కరోనా వైరస్‌ నుంచి రక్ష ణ లభిస్తుంది. ఒకే రకమైన జన్యువులను వేర్వేరు వాహకాల ద్వారా ఇవ్వడం వల్ల దీర్ఘకాలంలో మాత్రమే లభించే నిరోధకత వేగం గా సంక్రమిస్తుందని ఆయన అంటున్నారు.

ఇంకా తొలిదశలోనే..?
కరోనా కారక వైరస్‌ నిరోధానికి రష్యా మొత్తం 17 వరకూ టీకాలను అభివృద్ధి చేసేందుకు పూనుకుంది. అందులో గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ అభివృద్ధి చేసేవి రెండు మాత్రమే. అయితే ఈ రెండు టీకాలూ మానవ ప్రయోగాలన్నీ పూర్తి చేసుకున్నాయని రష్యా చెబుతుండగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మాత్రం వాటిని తొలిదశలో ఉన్న టీకాలుగానే చూపుతోంది. డబ్ల్యూహెచ్‌వో వెబ్‌సైట్‌లో కరోనా టీకా ప్రయోగాలపై ఉన్న సమాచారం ప్రకారం జూలై 7 నాటికి చైనాకు చెందిన సైనోవాక్, ఆక్స్‌ఫర్డ్‌ యూనివర్సిటీ/ఆస్ట్రాజెనెకాల టీకాలు మాత్రమే మూడో దశ మానవ ప్రయోగాల దశకు చేరుకున్నాయి. ఆస్ట్రాజెనెకా అభివృద్ధి చేసే టీకాను తయారు చేసే లైసెన్స్‌ పొందిన భారతీయ కంపెనీ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కూడా సురక్షితమైన టీకా అందుబాటులోకి వచ్చేందుకు ఇంకో ఆరు నెలల సమయం పడుతుందని చెబుతోంది. అమెరికాకు చెందిన ‘క్లినికల్‌ట్రయల్స్‌.గవ్‌’ వెబ్‌సైట్‌ ప్రకారం కూడా గమలేయా ఇన్‌స్టిట్యూట్‌ టీకాలు రెండూ తొలిదశలోనే ఉండటం గమనార్హం.

రేసులో ఉన్నది  21 టీకాలు
కరోనా నిరోధక టీకాల తయారీలో ప్రస్తుతం రెండు ప్రయోగాలు రెండు/మూడో దశ మానవ ప్రయోగాల దశకు చేరుకోగా ఇంకో 19 తొలిదశల్లోనే ఉన్నాయి. సు మారు 139 ప్రాజెక్టుల్లో టీకాలకు సం బంధించిన ప్రీ క్లినికల్‌ ట్రయల్స్‌ నడుస్తున్నాయి. సైనోవ్యాక్‌ తయారు చేస్తు న్న టీకా మూడోదశ మానవ ప్రయోగాలు జరుగుతుండగా ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ నకళ్లు రూపొందించుకోలేని వైరస్‌నుఉపయోగించి అభివృద్ధిచేస్తోన్న సీహెచ్‌ఏడీఓఎక్స్‌–01 టీకా మూడోదశకు చేరుకుంది.

కాన్‌సైనో (చైనా), మో డెర్నా (అమెరికా) కంపెనీలు 1,2 దశలను సమాంతరంగా నిర్వహిస్తుంటే ఇనోవియో, కాడిల్లా హెల్త్‌కేర్‌లు రెండూ డీఎన్‌ఏ ప్లాస్మి డ్‌ పద్ధతిలోనూ రెండు దశల ప్రయోగాల ను సమాంతరంగా నిర్వహిస్తున్నాయి. ఇవి కాక చైనా ఫార్మా కంపెనీ సైనోఫార్మ్‌ వూహాన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయలాజికల్‌ ప్రొడక్ట్స్, బీజింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ బయలాజికల్‌ ప్రొడక్ట్స్‌తో కలసి 2 టీకాలను అభివృద్ధి చేస్తోంది. నోవావాక్స్, బయోఎన్‌టెక్, ఫోసు న్‌ ఫార్మా, ఫైజర్‌లు కూడా వ్యాక్సిన్‌ రేసులో ఉన్నాయి. 

మరిన్ని వార్తలు