గుట్టెక్కిన గుడ్డు!

15 Nov, 2017 10:10 IST|Sakshi

ఒక్కంటికి ధర రూ.5.30 నుంచి రూ.6వరకు.

నాలుగు నెలల నుంచి పైపైకే...

డిమాండ్‌ సరిపడా ఉత్పత్తి లేకపోవడమే కారణం

మరో ఆరు నెలలు ఇదే పరిస్థితి

అంటున్న పౌల్ట్రీ యాజమాన్యాలు

స్టేషన్‌ మహబూబ్‌నగర్‌:  నలుగురు డిగ్రీ విద్యార్థులు ఎక్కడి నుంచో వచ్చి జిల్లా కేంద్రంలో గది అద్దెకు తీసుకుని చదువుకుంటున్నారు, ఉదయం లేచి కళాశాలకు వెళ్లి, రావడంతోనే సమయం సరిపోతుండగా వంట విషయానికొచ్చే సరికి కోడిగుడ్లు గుర్తుకొస్తాయి.. ఓ ఇంటికి అనుకోని అతిథులు వచ్చారు, ఇంటి యజమానికి ఆఫీస్‌కు వెళ్లడంతో గృహిణి మాత్రమే ఉంది, వచ్చిన అతిథులకు వంట చేయాలనగానే పక్క షాపు, అందులోని కోడిగుడ్లే మదిలోకి వస్తాయి.. ఇలా ప్రతీ ఒక్కరికీ అందుబాటులో ఉండి ఆపదలో ఆదుకునే కోడిగుడ్ల ధరలకు ఇప్పుడు రెక్కలొచ్చాయి! ఎన్నడూ లేని విధంగా తొలిసారిగా గుడ్ల ధరలు అమాంతం పెరుగుతుండడంతో అన్ని వర్గాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఒకవైపు కూరగాయలు, మటన్, చికెన్‌ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో కోడిగుడ్లతోనైనా సరిపెట్టుకుందామన్న పేద ప్రజల ఆశలపై పెరిగిన ధరలు నీళ్లు చల్లుతున్నాయి. చలితీవ్రత ఎక్కువగా ఉండడం, డిమాండ్‌ సరిపడా ఉత్పత్తి తక్కువగా ఉండడంతో గుడ్ల ధరలు పెరుగుతున్నట్లు వ్యాపారులు పేర్కొంటున్నారు.

బంధం కోల్పోయిన డిమాండ్‌
సప్లయ్‌మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, జోగుళాంబ గద్వాల జిల్లాల్లో కలిపి దాదాపు 180 పౌల్ట్రీ ఫాంలు ఉన్నాయి. అన్ని ఫాంల్లో కలిపి రోజుకు నాలుగు జిల్లాల పరిధిలో 1.20 కోట్ల గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఇందులో కోటి గుడ్లను మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, కోల్‌కత్తాకు ఎగుమతి చేస్తారు. మిగిలిన గుడ్లతోనే జిల్లా ప్రజలు సరిపెట్టుకోవాలి. కానీ జిల్లా అవసరాలకు 30లక్షల గుడ్లు అవసరమైతే 20 లక్షలే ఉంటున్నాయి. ఇలా డిమాండ్‌కు తగినట్లు సప్లయి లేకపోవడంతో ధర పెరుగుతూ వస్తోంది. ఇక 2012 నుంచి పౌల్ట్రీ రైతులు నష్టాలు వస్తున్నాయన్న ఆవేదనతో కోడిపిల్లల పెంపకాన్ని తగ్గించడం కూడా గుడ్లు అందుబాటులో లేకపోవడానికి, ధర పెరగడానికి ప్రధాన కారణమని రైతులు చెబుతున్నారు. అదిగాక కూరగాయల ధరలు విపరీతం గా పెరుగుతుండడంతో ప్రజలు గుడ్ల కొనుగోలుకు ప్రా«ధాన్యత ఇస్తుండడం కూడా ధర పెరుగుదలకు మరో కారణమనితెలుస్తోంది. 

జూలై నుంచి..
ఈ ఏడాది జూలై నుంచి గుడ్ల ధరలు పెరుగుతూ వస్తున్నాయి. జూలై నెలలో సరాసరి ఒక గుడ్డు ధర రూ.3.35 ఉండగా ఈనెలలో 14వ తేదీ మంగళవారం నాటికి ఒక గుడ్డు ధర హోల్‌సేల్‌లో రూ.4.93గా నమోదైంది. రోజురోజు 2 నుంచి 5 పైసల వరకు పెరుగుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. హోల్‌సెల్‌ వ్యాపారులు మార్కెట్‌ ధర ప్రకారం గుడ్లు సరఫరా చేస్తున్నా రిటైల్‌ వ్యాపారులు ఒక గుడ్డును రూ.5.30 నుంచి రూ.6 వరకు విక్రయిస్తున్నారు. మారుమూల గ్రామాలు, రవాణా సౌకర్యం అంతగా లేని గ్రామాల్లోనైతే ఒక గుడ్డు రూ.7 వరకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇంత ఎన్నడూ చూడలేదు...
గుడ్డు ధర ఇంత పెరగడం ఎప్పుడు చూడలేదు. చలితీవ్రత ఎక్కువగా ఉండడం, డిమాండ్‌కు తగ్గ సప్లయ్‌ లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. నెల రోజులుగా వ్యాపారం అంతంతే ఉంది. గుడ్లు దించేటప్పుడు, ఎక్కించేటప్పుడు జాగ్రత్త పడాలి. ఒక్కో గుడ్డును పగిలిపోకుండా కాపాడుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఉత్పత్తి పెరిగితే గుడ్ల ధరలు తగ్గే అవకాశం ఉంద.
– సయ్యద్‌ అయాజ్‌ షర్ఫీ, ఎస్‌ఆర్‌ ఎగ్‌సెంటర్‌  

మరో ఆరు నెలల ఇంతే..
ప్రస్తుతం దేశవ్యాప్తంగా గుడ్ల ధరలు పెరుగుతున్నాయి. మరో ఆరు నెలల వరకు ఇదే పరిస్థితి ఉండే అవకాశం ఉంది. గత నాలుగేళ్ల నుంచి పౌల్ట్రీ రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో చాలా మంది రైతులు పెట్టుబడి పెట్టలేక కోళ్ల పెంపకాన్ని తగ్గించడంతో గుడ్ల ఉత్పత్తి కూడా పడిపోయింది. గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో 2000 మంది పౌల్ట్రీ రైతులు ఉంటే వారి సంఖ్య ఇప్పుడు 200 కు పడిపోయింది. ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌కు తగినట్లు గుడ్ల ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయి.
– జూపల్లి భాస్కర్‌రావు,తెలంగాణ పౌల్ట్రీ ఫెడరేషన్‌ కార్యదర్శి

మరిన్ని వార్తలు