పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ ఎందుకు ఎత్తేయలేదు?

2 Dec, 2018 11:25 IST|Sakshi
కేంద్ర మాజీ మంత్రి జితిన్‌ ప్రసాద్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ప్రజల సంక్షేమానికి పెద్దపీట వేశామని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ పెట్రో ఉత్పత్తులపై వ్యాట్‌ ఎందుకు తగ్గించలేదని కేంద్ర మాజీ మంత్రి జితిన్‌ ప్రసాద్‌ ప్రశ్నించారు. శనివారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. వ్యాట్‌ను తగ్గించని కారణంగా వ్యవసాయ రైతులపై పెనుభారం పడిందని విమర్శించారు.

2014లో అంతర్జాతీయ మార్కెట్‌లో క్రూడ్‌ఆయిల్‌ బ్యారెల్‌ధర 110 డాలర్లు ఉందని, ప్రస్తుతం 60 డాలర్లకు తగ్గిందని చెప్పారు. కేంద్రంలో నరేంద్ర మోదీ, రాష్ట్రంలో కేసీఆర్‌ ఒకే తరహా పాలన సాగిస్తున్నారన్నారు. బ్యారెల్‌ ధర తగ్గినా ఎక్సైజ్‌ డ్యూటీ, వ్యాట్‌ల పేరిట కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పెట్రో ఉత్పత్తులపై ధరలు తగ్గించలేదని తెలిపారు.

ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ విధిస్తున్న వ్యాట్‌ డీజీల్‌పై 26%, పెట్రోల్‌పై 33.32 శాతం అధికమని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే ప్రజలపై భారం తగ్గిస్తామన్నారు. విద్యను రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, సర్వశిక్షా అభియాన్‌ కింద చేసిన కేటాయింపుల్లో సగం నిధులను మాత్రమే ఖర్చు చేసిందన్నారు. లక్ష ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, 19 లక్షల మందిని నిరుద్యోగులను చేశారని జితిన్‌ విమర్శించారు.

మరిన్ని వార్తలు