ముస్లింలు కళ్లకు ‘సుర్మా’ ఎందుకు పెడతారు?

29 May, 2018 10:30 IST|Sakshi

కళ్లకు కళ ‘సుర్మా’

సాక్షి, సిటీబ్యూరో : రంజాన్‌ మాసంలో ముస్లింలు ఎక్కువగా సుర్మా వాడతారు. కాటుకలా కళ్లకు రాసుకునే సుర్మా పౌడర్‌ రూపంలో నల్లగా ఉంటుంది. ఇది కళ్లకు కొత్త అందాన్ని తీసుకొస్తుంది. కంటికి తేజస్సును ఇవ్వడంతో పాటు చలువదనాన్ని అందజేస్తుంది. అందుకే ఈ మాసంలో ఎక్కువగా సుర్మాను వినియోగిస్తారు. ప్రవక్త మూసా తొలిసారి దీనిని వాడారు. అరబ్‌ దేశంలోని మరాఖిష్‌ ప్రాంతంలోని కోహితూర్‌ పర్వతం భస్మం కావడంతో భూమి నల్లగా మారిందని, అక్కడికెళ్లిన ప్రవక్త మూసా ఆ నల్లటి పౌడర్‌ను కళ్లకు పెట్టుకున్నారని మత పెద్దలు చెబుతారు. తర్వాత మహ్మద్‌ ప్రవక్త కూడా ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. అదే సంప్రదాయం నేటికీ కొనసాగుతోంది. రంజాన్‌ మాసంలో ప్రతిరోజు రెండు కళ్లకు సుర్మా పెట్టుకుంటారు.  

ఇలా తయారీ...  
నల్లని రాళ్లను పగులగొట్టి, పౌడర్‌గా మారుస్తారు. దీనికి గులాబీ నీరు కలిపి సుర్మా తయారు చేస్తారు. పాతబస్తీకి చెందిన సయ్యది సుర్మాకు దాదాపు 200 ఏళ్ల చరిత్ర ఉంది. అతికొద్ది మంది మాత్రమే ఇప్పుడీ వ్యాపారాన్ని కొనసాగిస్తున్నారు. తాతముత్తాతల కాలం నుంచి తాము ఈ వ్యాపారం కొనసాగిస్తున్నామని చెప్పారు పత్తర్‌గట్టీలోని సయ్యది సుర్మా వ్యాపారి సయ్యద్‌ జహీరుద్దీన్‌ ఖాద్రీ.   

మరిన్ని వార్తలు