అఖిలపక్షం అంటే ఎందుకు భయం: పొంగులేటి

3 Sep, 2017 20:05 IST|Sakshi
అఖిలపక్షం అంటే ఎందుకు భయం: పొంగులేటి
సాక్షి, హైదరాబాద్‌: భూముల రికార్డుల సర్వే విధివిధానాలపై చర్చించడానికి అఖిలపక్షం సమావేశం పెట్టాలంటే రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు భయపడుతున్నదని శాసనమండలిలో కాంగ్రెస్‌ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి ప్రశ్నించారు. ఆదివారం ఇక్కడ విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. భూసర్వేకు తాము వ్యతిరేకం కాదని, జరుగుతున్న పద్ధతిపైనే అభ్యంతరమన్నారు. కేవలం టీఆర్‌ఎస్‌ పార్టీ అంతర్గత వ్యవహారంగా భూసర్వేను మార్చడానికి ప్రభుత్వం కుట్ర చేస్తున్నదని విమర్శించారు.
 
భూముల విషయంలో ప్రభుత్వ తీరువల్ల గ్రామాల్లో శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదముందని పొంగులేటి హెచ్చరించారు. జీఎస్టీ తగ్గింపు పరిధిలోకి మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ మాత్రమే కాకుండా చేనేత, గ్రానైట్, వ్యవసాయ యంత్రాలను కూడా తీసుకురావడానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఎందుకు శ్రద్ద చూపించడంలేదని ప్రశ్నించారు. ఈ నెల 9న జరిగే జాతీయ సదస్సులోనైనా వీటి గురించి పట్టించుకోవాలని కోరారు.
 
తెలంగాణలో విషజ్వరాలు విస్తరించాయని, ఖమ్మంలో తీవ్రతను ప్రభుత్వం పట్టించుకోవాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్ల తీవ్రమైన జ్వరాలతో పేదలు ఇబ్బందులు పడుతున్నారని పొంగులేటి విమర్శించారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీంపై ప్రభుత్వం నుంచి ఇప్పటిదాకా ఎలాంటి ప్రకటన రాకపోవటం బాధాకరమని, ప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. 
 
మరిన్ని వార్తలు