బస్సు ఎరుగని బస్టాండ్!

1 Jul, 2014 23:53 IST|Sakshi
బస్సు ఎరుగని బస్టాండ్!

 జగదేవ్‌పూర్: కొత్త రాష్ట్రం.. కొత్త పరిపాలన.. కొత్త పనులు..అపై సీఎం ఇలాకా..అభివృద్ధికి అడ్డు ఉంటుందా.. ఇలాంటి మాటలు ప్రస్తుతం గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని పల్లె ప్రజల మనస్సుల్లో మెదులుతున్నాయి. కానీ జగదేవ్‌పూర్ మండల ప్రజల్లో మాత్రం అశలు రెట్టింపులోనే ఉన్నాయి. ఎందుకంటే సీఎం ఫాంహౌస్ మండల పరిధి ఎర్రవల్లి గ్రామంలో ఉండడమే. మండల కేంద్రంలో నాడు కేసీఆర్ రవాణ శాఖ మంత్రిగా ఉన్నప్పుడు బస్టాండ్  ప్రారంభించారు. నేటికి బస్సు వచ్చింది లేదు.
 
 పస్తుతం బస్టాండ్ యాచకులకు నిలయంగా మారింది. జగదేవపూర్‌లో బస్టాండ్ నిర్మాణానికి అప్పటి రవాణశాఖ మంత్రి  కేసీఆర్ బస్టాండ్‌ను ప్రారంభించారు. రెండు మూడు సార్లు మాత్రమే ఆర్టీసీ బస్సులు బస్టాండ్‌లోకి వచ్చినట్లు గ్రామస్థులు చెప్పుతున్నారు. 14 ఏళ్లుగా బస్టాండ్ నిరుపయోగంగా మారి యాచకులకు అడ్డాగా మారింది. ఆర్టీసీ యాజమాన్యం బస్సులను రోడ్డుపై నుంచే నడిపిస్తున్నారు తప్ప బస్టాండ్‌లోకి రావడం లేదంటూ ప్రయాణికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  దీంతో ప్రతి రోజూ ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి. రోడ్డు వెడల్పు లేకపోవడం వల్ల బస్సులు, ఆటోలు ఒకచోటి నుంచే మలుపుకుంటున్నారు.
 
 దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలంలో ప్రయాణికులు హోటళ్లు, కిరాణ, వస్త్రాల దుకాణాలలో తల దాచుకుంటున్నారు. పలుసార్లు  జగదేవపూర్ గ్రామ ప్రజలు బస్టాండ్‌ను పునరుద్ధరించాలని ప్రజాప్రతినిధులను, ఆర్టీసీ అధికారులకు కోరినా ఫలితం లేకుండా పోయింది.  నెలకొన్న బస్టాండ్ దుస్థితితో ప్రయాణికులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. ప్రసుత్తం కేసీఆర్ గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి సీఎం అయ్యారని, ఇప్పుడైనా సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు.
 

మరిన్ని వార్తలు