కొనుగోళ్లపై విస్తృత ప్రచారం

10 Nov, 2014 23:44 IST|Sakshi

 సిద్దిపేట జోన్ : ఖరీఫ్, రబీ సీజన్‌లలో రైతులు సాగు చేసిన పంట ఉత్పత్తుల కొనుగోళ్ల ప్రక్రియను సులభతరం చేసేందుకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ దిద్దుబాటు చర్యలకు శ్రీకారం చుట్టింది. జిల్లా వ్యాప్తంగా ఉన్న మార్కెట్ కమిటీల పరిధిలోని గ్రామాల్లో పంట ఉత్పత్తుల కొనుగోళ్లపై విస్తృత ప్రచారం నిర్వహించాలని గత నెల 13న ఆదేశాలు జారీ చేసింది.

అందులో భాగంగానే ప్రతీ గ్రామానికి రూ.200 చొప్పున ప్రత్యేకంగా మార్కెట్ కమిటీ బడ్జెట్ మిసిలేనియస్ పద్దు నుంచి ఖర్చు చేయవచ్చంటూ అధికారాన్ని అప్పగించింది. వివరాల్లోకి వె ళితే.. జిల్లాలో మెదక్, సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, జహీరాబాద్, నర్సాపూర్, అందోల్, సంగారెడ్డి, పటాన్‌చెరు, నారాయణఖేడ్ నియోజకవర్గాల పరిధిలో 18 మార్కెట్ కమిటీలున్నాయి. వీటి పరిధి కింద ఉన్న ఆయా గ్రామాల్లో 2014-15 మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి రైతు పంట ఉత్పత్తులు పత్తి, మొక్కజొన్న, వరిలకు  మద్దతు ధర అందించేందుకు రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ప్రణాళిక రూపొందించింది.

అందుకు అగుణంగానే పత్తి, మొక్కజొన్న, వివిధ రకాల ఉత్పత్తులు కొనుగోళ్లకు సంబంధించి గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని కమిషనర్ పేరిట ఆదేశాలు జారీ అయ్యాయి. ముఖ్యంగా ఆయా గ్రామాల్లో విస్తృత ప్రచారం కోసం, రైతులకు ప్రయోజనం చేకూరే విధంగా కరపత్రాలు, గోడ, పత్రాలు, ఫ్లెక్సీలు, బ్యానర్లు ముద్రించి అతికించాలని అదే విధంగా దండోరా ద్వారా రైతులకు ఎంఎస్‌పీపైన అవగాహన కల్పించాలని సీజన్‌కు ముందే స్పష్టమైన ఆదేశాలు అందాయి.

కానీ వాటి నిర్వహణ ఖర్చు బాధ్యత విషయంలో సందిగ్ధత నెలకొనడం, సీజన్‌లో ఆయా గ్రామాల్లో సాధ్యమైనంత రీతిలో ప్రచారాన్ని చేపట్టారు. ఈ క్రమంలోనే సంబంధిత ప్రచార ఖర్చును మార్కెట్ కమిటీకి సంబంధించిన బడ్జెట్ మిసిలేనియస్ పద్దు నుంచి ఖర్చు చేసుకోవచ్చంటూ కార్యదర్శులకు పూర్తి అధికారాలను అప్పగించారు. దీనికి సంబంధించి ప్రతి గ్రామానికి ప్రచార నిమిత్తం రూ. 200లను గ్రామ సేవలకు బ్యాంక్ ఖాతాలో జమ చేయాలని, అట్టి నిధుల వివరాలను గ్రామ రెవెన్యూ అధికారి ద్వారా ధ్రువీకరణ పత్రం తీసుకోవాలంటూ నిబంధనలను కూడా స్పష్టం చేశారు.

 మరోవైపు ఖరీఫ్ ధాన్యం, కొనుగోళ్ల సీజన్ పూర్తి కావస్తున్న క్రమంలో ప్రచార నిర్వహణ ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు చర్యలు చేపడుతున్నామంటూ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ కమిషనరేట్ నుంచి ఈ నెల 3న జిల్లాలోని మార్కెట్ కమిటీ కార్యదర్శులకు మౌఖిక ఆదేశాలు జారీ అయ్యాయి. ఆకస్మిక తనిఖీల్లో ప్రచారంపై అలసత్వం బహిర్గతమైతే క్రమశిక్షణ చర్యలను సైతం తీసుకుంటామంటూ స్పష్టమైన హెచ్చరికలు జారీ చేశారు. ఒక వైపు ప్రచార నిర్వహణ ఖర్చుపై సందిగ్ధంలో ఉన్న మార్కెట్ కమిటీ అధికారులకు పరిష్కార మార్గం చూపిన ప్రభుత్వం క్షేత్ర స్థాయిలో తనిఖీలు నిర్వహిస్తామంటూ శ్రీ ముఖాల జారీకి సిద్ధం కావడం అధికారులను అయోమయానికి గురి చేస్తుంది.

 ఏదేమైనా ప్రభుత్వం మద్ధతు ధర విషయాన్ని క్షేత్రస్థాయి గ్రామీణ ప్రాంతాల్లో విస్తృత పరిచేందుకు నిధులను కేటాయించడం హర్షించదగ్గ విషయమేనంటూ వ్యవసాయ, మార్కెటింగ్ శాఖకు చెందిన అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు