జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

2 Sep, 2016 00:37 IST|Sakshi
జిల్లాల్లో విస్తారంగా వర్షాలు

సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ప్రాజెక్టులు, చెరువులు జలకళను సంతరించుకున్నాయి. ఖమ్మం జిల్లాలో  బుధవారం నుంచి ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. గురువారం జిల్లాలోని పలుచోట్ల భారీ వర్షం కురిసింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు వాగులు.. వంకలు ప్రవహిస్తున్నాయి. పలు ప్రాజెక్టుల్లోకి వరద నీరు చేరుతోంది.  చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్టులోకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 25 క్రషర్ గేట్లలో 10 గేట్లను ఎత్తి నీటిని కిందకు వదులుతున్నారు. 16.2 అడుగుల నీటి మట్టం కలిగిన బయ్యారం చెరువు కూడా అలుగు పోస్తోంది.

కిన్నెరసాని ప్రాజెక్టులోకి వరద నీరు చేరుతోంది. ఖమ్మంలోని మున్నేరు వాగు, కొత్తగూడెం మున్నేరు వాగు లో కూడా నీరు ప్రవహిస్తోంది. నిజామాబాద్ జిల్లాలో రెండు, మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కురిసిన వర్షంతో జిల్లాలో 21.7 మిల్లీ మీటర్ల సగటు వర్షపాతం నమోదైంది. అత్యధికంగా లింగంపేట్‌లో 45.0 మిల్లీ మీటర్ల వర్షం కురిసింది. ఈ వర్షం ఎండుముఖం పడుతున్న పంటలకు జీవం పోసింది.

 నల్లగొండలో భారీ వర్షం : నల్లగొండ జిల్లాలో బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటలకు వరకు జిల్లా వ్యాప్తంగా 41 మండలాల్లో వర్షం కురిసింది. 12.7 మి.మీ వర్షపాతం నమోదైంది. అత్యధికంగా చండూరు మండలంలో 70.8 మి.మీ వర్షపాతం నమోదుకాగా... అత్యల్పంగా బొమ్మలరామారం మండలంలో 0.2 మి.మీ నమోదైంది.  ఐదు రోజుల నుంచి కురిసిన వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 337 చెరువులు జలకళను సంతరించుకున్నాయి. హైదరాబాద్‌లో కురిసిన భారీ వర్షానికి అక్కడి నుంచి ప్రవహిస్తున వరద నీరంతా మూసీలోకి వచ్చి చేరుతోంది. మూసీ రిజర్వాయర్‌లోకి ఎగువ నుంచి 5 వేల క్యూసెక్కుల నీరు వచ్చింది. పూర్తి స్తాయి నీటి మట్టం 645 అడుగులు కాగా.. గురువారం సాయంత్రం వరకు 638 అడుగులకు చేరింది. గురువారం పై నుంచి ఇన్‌ఫ్లో 10 వేల క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. ముంపు గ్రామాలైన నెమలిపురి, చింతిర్యాల, వెల్లటూరువాసులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

మరిన్ని వార్తలు