‘కూతురమ్మ’కు అండగా నిలుస్తాం..

19 Apr, 2017 03:29 IST|Sakshi
‘కూతురమ్మ’కు అండగా నిలుస్తాం..

‘సాక్షి’ కథనానికి విశేష స్పందన..

నిర్మల్‌ రూరల్‌: తనను కన్నవాళ్లకే అమ్మగా మారి.. తల్లిదండ్రులను పిల్లలుగా భావించి సేవలం దిస్తున్న పేదింటి ‘కూతురమ్మ’కు తాము అండగా నిలుస్తామంటూ మనసున్నోళ్లు ముందుకు వస్తున్నారు. ‘సాక్షి’ ఫ్యామిలీ పేజీలో మంగళవారం ‘కూతురమ్మ’ శీర్షికన ప్రచురించిన కథనానికి విశేష స్పందన వస్తోంది. నిర్మల్‌ జిల్లా మామడ మండలం దిమ్మదుర్తికి చెందిన అర్చన తల్లిదండ్రులు పద్మ, దుర్గారెడ్డిల దీనగాథతో ‘సాక్షి’ప్రచురించిన కథనం విశ్వవ్యాప్తమైంది. ఈ కథనాన్ని చదివి మానవత్వానికి ఎల్లలు లేవు.. మనసుంటే మార్గముంటుంది.. అన్న మంచి మనసుతో అర్చనకు అండగా నిలిచేందుకు పలువురు ముందుకు వస్తున్నారు.

అర్చన కుటుంబానికి డబుల్‌ బెడ్రూం ఇంటిని మంజూరు చేస్తామని మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి పేర్కొన్నారు. హృదయాన్ని కదిలించే కథనాన్ని రాసిన ‘సాక్షి’ని ఆయన అభినందించారు. అర్చన పరిస్థితిపై స్పందించిన వారిలో మాణిక్‌రెడ్డి(షాద్‌నగర్‌), సతీశ్‌రాజు (భీమవరం), భాస్కర్‌రెడ్డి(హైదరాబాద్‌), వెంగళ్‌రావు(నెల్లూరు), మాధురి (హైదరాబాద్‌), బాలాజీ వరప్రసాద్‌ (విజయవాడ)లతో పాటు నిర్మల్‌కు చెందిన టీఆర్‌ఎస్‌ నేత కూచాడి శ్రీహరిరావు, డాక్టర్‌ ప్రమోద్‌చంద్రారెడ్డి, ప్రముఖ కాంట్రాక్టర్‌ లక్కడి జగన్‌మోహన్‌రెడ్డి, జాన్‌డీర్‌ షోరూం యజమాని రవీందర్, కనకదుర్గా చిట్స్‌ బ్రాంచ్‌మేనేజర్‌ నర్సారెడ్డి, మనోహర్‌రెడ్డి(డీఎస్పీ) జీవన్‌రెడ్డి(పట్టణ సీఐ) ఇలా చాలా మంది మనసున్నోళ్లు ముందుకు వచ్చారు.

మరిన్ని వార్తలు