భార్య పిటిషన్‌.. భర్త మరణించాడన్న ప్రభుత్వం

4 Jun, 2020 14:19 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : కరోనా బారిన పడిన తన భర్తను వైద్యులు గాంధీ ఆస్పత్రికి తరలించారని, అయితే ఇప్పటి వరకు తనకు ఎటువంటి సమాచారం ఇవ్వలేదని ఓ మహిళ హైకోర్టును ఆశ్రయించారు. ఈ మేరకు నగరంలోని వనస్థలిపురంకు చెందిన మధుసూదన్ భార్య మాధవి హైకోర్టులో హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. పిటిషన్‌పై స్పందించిన న్యాయస్థానం అసలు మధుసూదన్‌ బ్రతికి ఉన్నాడా? లేడా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది.  హైకోర్టు ప్రశ్నకు ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ సమాధానిస్తూ.. కొద్ది రోజుల క్రితమే అతని కరోనాతో మరణించాడని కోర్టుకు తెలిపారు. ప్రభుత్వ సమాధానంపై న్యాయస్థానం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. రోగి చనిపోయినప్పుడు డెత్ సర్టిఫికేట్ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించింది. కనీసం కుటుంబ సభ్యులకు ఎందుకు సమాచారం ఇవ్వలేదని నిలదీసింది. దీనిపై పూర్తి వివరాలతో శుక్రవారంలోగా అఫిడవిట్‌ సమర్పించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను రేపటికి (శుక్రవారం) వాయిదా వేసింది. (పదో తరగతి పరీక్షలపై హైకోర్టులో విచారణ)

ప్రభుత్వానికి మధ్యంతర ఉత్తర్వులు..
తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో కీలకమైన మల్లన్నసాగర్‌  భూ నిర్వాసితుల సమస్యలపై హైకోర్టు విచారణ చేపట్టింది. రిజర్వాయర్‌ నిర్మాణంలో ముంపుకు గురవుతున్న ఏటిగడ్డ కిస్తాపూర్ గ్రామం ఖాళీ విషయంపై గురువారం వాడీవేడి వాదనలు జరిగాయి. భూ నిర్వాసితులకు పూర్తి స్థాయిలో నష్టపరిహారం చెల్లించకుండా ఇళ్లను ఖాళీ చేయించడం సరైనది కాదని న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇప్పటి వరకు చెల్లించిన నష్టపరిహారాలపై పూర్తిస్థాయిలో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే తదుపరి తీర్పు వెలువరించే వరకు గ్రామాన్నిఖాళీ చేయించొద్దని మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది.

మరిన్ని వార్తలు