భర్త ఇంటిముందు భార్య ధర్నా!

29 Jan, 2020 12:31 IST|Sakshi

వనస్థలిపురంలో... ఆడపిల్ల పుట్టిందని

సాక్షి, హైదరాబాద్ : ఆడపిల్ల పుట్టిందని ఓ ప్రబుద్ధుడు భార్య ఇంటి నుంచి గెంటేశాడు. అదనపు కట్నం తెస్తేనే ఇంట్లోకి రానిస్తానంటూ షరతులు పెట్టాడు. దీనికి అతని తల్లిదండ్రులు సైతం వంతపాడారు. దీంతో తనకు న్యాయం చేయాలంటూ భర్త ఇంటిముందు తన చిన్నారితో కలిసి ఓ మహిళ మౌనపోరాటానికి దిగింది. పసిపాపతో కలిసి ధర్నా చేపట్టింది. ఈ ఘటన వనస్థలిపురం పోలీసు స్టేషన్‌ పరిధిలోని సహారా ఎస్టేట్‌లో జరిగింది.

సహారా ఎస్టేట్‌లో ఉంటున్న మౌనిక, ఉదయ్‌కుమార్‌ దంపతులు. వీరికి ఓ కూతురు ఉంది. అయితే, పెళ్లయిన ఏడాది నుంచి భర్త, అత్తమామలు తనను తీవ్రంగా వేధిస్తున్నారని, అత్తమామలే కాదు మరిది కూడా తనను కొట్టేవారని బాధితురాలు మౌనిక తెలిపారు. ఈ క్రమంలో ఆడపిల్ల పుట్టిందని, అదనపు కట్నం తేవాలంటూ ఇంటి నుంచి భర్త ఉదయ్‌ బయటకు పంపించాడని పేర్కొంటూ మౌనిక తన చిన్నారి కూతురితో కలిసి ధర్నా చేపట్టారు. అంతేకాకుండా సరూర్‌నగర్‌ మహిళా పోలీసు స్టేషన్‌లో భర్త, అత్తమామలపై ఫిర్యాదు చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో ధర్నా చేస్తున్న మౌనికను, ఆమె బిడ్డను భర్త, అత్తమామ ఇంట్లోకి తీసుకెళ్లారు.

మరిన్ని వార్తలు