భర్త కోసం భార్య ఆత్మహత్యాయత్నం

10 Nov, 2019 11:25 IST|Sakshi
పరామర్శిస్తున్న అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

ధర్మపురి: ‘నాయకుల పలుకుబడితో నా భర్తను అణగదొక్కడానికి రౌడీషీట్‌ ఓపెన్‌ చేసిండ్రు. అవమానం భరించలేకనే శనివారం పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డా’నని బాధితురాలు అనూష రోదిస్తూ తెలిపింది. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం..మండలంలోని నేరెల్ల గ్రామానికి చెందిన జాజాల అనూష(28) అదే గ్రామానికి చెందిన జాజాల రమేష్‌ను 2017లో ప్రేమవివాహం చేసుకుంది. వీరికి చైత్రిక(15 నెలలు) కూతురు ఉంది. ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో సర్పంచ్‌ పదవికి అనూష, ఎంపీటీసీ పదవికి రమేష్‌ పోటీ చేసి ఓటమిపాలయ్యారు. రమేష్‌పై 2015, 2016, 2018లో మొత్తం మూడు కేసులున్నాయని, ఏడాది క్రితం ఒకటి, ఇటీవల నిర్వహించిన లోక్‌ అదాలత్‌లో మొత్తం రెండు కేసులు కొట్టుడుపోగా మిగిలిన చిన్నపాటి కేసు కరీంనగర్‌లో నడుస్తోందని తెలిపింది.

కొందరు నాయకులు పలుకుబడితో తన భర్తపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశారని, పలువురు పలు విధాలుగా మాట్లాడుతూ హేళన చేస్తున్నారని వివరించింది. ఈక్రమంలో  మనస్తాపానికి గురై శనివారం ధర్మపురి పోలీస్‌స్టేషన్‌ ముందు క్రిమిసంహారకమందు తాగి స్టేషన్‌లోకి వెళ్లింది. కొంత సేపటికి కిందపడిపోగా ధర్మపురి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి జగిత్యాల ఏరియా ఆస్పత్రికి తరలించారు. అవమానం భరించలేకనే ఆత్మహత్యయత్నానికి పాల్పడినట్లు తెలిపింది. జరిగిన సంఘటనపై ఎస్సై శ్రీకాంత్‌ను వివరణ కోరగా అనూష భర్త రమేష్‌పై రౌడీషీట్‌ ఉందని, రైడీషీట్‌కు ఆత్మహత్యాయత్నానికి సంబంధం లేదని, కుటుంబకలహాలతోనే క్రిమిసంహారకమందు తాగి స్టేషన్‌కు రాగా ఆస్పత్రికి తరలించామని తెలిపారు.

పరామర్శించిన అడ్లూరి..
జగిత్యాలక్రైం: ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన అనూషను సాయంత్రం కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పరామర్శించారు. కాగా, ఆమె భర్తపై రౌడీషీట్‌ కేసు నమోదు చేశారని, మనస్తాపానికి గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె పరిస్థితి విషమించడంతో కరీంనగర్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.  

మరిన్ని వార్తలు