అదిగో.. చిరుత

13 Oct, 2014 03:12 IST|Sakshi
అదిగో.. చిరుత

కొద్ది రోజుల క్రితం భిక్కనూరు సౌత్ క్యాంపస్‌లో బహిర్భూమికి వెళ్లిన వాచ్‌మన్ బాలరాజుచిరుతను చూసి జడుసుకున్నాడు. దోమకొండలో పొలానికి వెళ్లిన రైతు వెంకటరెడ్డి భార్య ఇందిర బంతిపూల తోటలో చిరుతను చూసి హడలిపోయింది. మాక్లూరు మండలం మాదాపూర్ శివారులో కస్తూర్బా పాఠశాల విద్యార్థులు చిరుతను చూసి బెంబేలెత్తిపోయారు. అడవులలో సంచరించాల్సిన చిరుతపులులు జనారణ్యంలో అలజడి రేపుతున్నాయి. అటవీ శాఖ అధికారులు మాత్రం ‘నిమ్మకు నీరెత్తినట్లు’ వ్యవహరిస్తున్నారు.       - సాక్షి ప్రతినిధి, నిజామాబాద్
 
 
భిక్కనూరు టు మాక్లూరు
* వయా పాల్వంచ, దోమకొండ
* జనారణ్యంలో చిరుత సంచారం
* పొద్దుగూకితే భయం భయం
* అభయారణ్యంలో కరువైన రక్షణ
* ‘పోచారం’ను వీడి జనావాసాల్లోకి
* వన్యప్రాణుల సంరక్షణ గాలికి
* చోద్యం చూస్తున్న అటవీ శాఖ
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: పదిహేను రోజులుగా జిల్లాలో చిరుతల సంచారం కలకలం సృష్టిస్తోంది. ఎన్నడూ లేని విధంగా చిరుతలు జనారణ్యం వైపు రావడంపై భిన్న కథనాలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖ వన్యప్రాణుల సంరక్షణను విస్మరించిన కారణంగానే పులులు, చిరుతలు జనంలోకి వస్తున్నాయంటున్నారు. నిజామాబాద్‌ను ఆనుకుని ఉన్న ఆదిలాబా ద్ జిల్లా కవ్వాల్ అభయారణ్యం నుంచి కూడ చిరుతలు వచ్చే అవకాశం ఉందన్న చర్చ జరుగుతోంది.
 
ప్రహసనంగా వన్యప్రాణుల సంరక్షణ
అటవీ శాఖ అధికారుల నిర్లక్ష్యంతో వన్యప్రాణుల సంరక్షణ ప్రహసనంగా మారింది. చట్టం అభాసుపాలవుతోంది. పులి గోర్లు, చర్మాల కోసం జంతువుల వేట ప్రధాన వృత్తిగా పెట్టుకున్న స్మగ్లర్ల కారణంగా వన్యప్రాణుల సంఖ్య తగ్గిపోతోంది. మిగిలిన వాటి ని అధికారులు పట్టించుకోకపోవడంతో అవి జనావాసాల వైపు దూసు కొస్తున్నాయి. జిల్లా వైశాల్యం 17,655 చదరపు కిలోమీటర్లు కాగా, అందులో 17.40 శాతం (2,718.09 చ. కి. మీ) వరకు అడవులు విస్తరించి ఉన్నాయి.

పోచారం అభయా రణ్యాన్ని 1952 ఫిబ్రవరి 29 నుంచి జీఓ నంబర్ 124 ప్రకారం వన్యప్రాణుల రక్షిత ప్రదేశంగా ప్రభుత్వం ప్రకటించింది. ఈ అడవిలో మూడు పులులు, పన్నెండు చిరుతలు, నెమళ్లు, దుప్పులు, అడవి జింకలు, కృష్ణజింకలు, అడవిదున్నలు తదితర వన్యప్రాణులున్నాయి. వీటి సంరక్షణ కోసం ప్రత్యేక డివిజన్‌ను ఏర్పాటు చేశారు. కానీ, వేటగాళ్ల ఉచ్చుకు వన్యప్రాణులు చిక్కుతూనే ఉన్నాయి. పులులు, చిరుతల సంతతి రోజు రోజుకూ అంతరించిపోతోందని ‘జాతీయ పులుల గణన సమితి’ ఆందోళన చెం దు తున్నది. వన్యప్రాణుల సంరక్షణ కోసం ప్రభుత్వం ఏటా కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. అయి తే, అధికారులు వాటికి అడవిలో తగిన వసతులు కల్పించడం లో విఫలమవుతున్నారు.
 
లెక్కలు తేలేది ఇలాగ
ప్రభుత్వం ఏటా అభయారణ్యాలలో జీవించే వన్యప్రాణుల గణనను చేపడుతోంది. నాలుగేళ్లకు ఓసారి కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా వన్యమృగాల గణాం కాలపై సర్వే నిరహిస్తోంది. రాష్ట్రంలో మాత్రం దట్టమైన అడవులలో ఏటా మే నెలలో వన్యప్రాణులను గణిస్తారు. జంతువుల ‘అడుగుజాడ (ఇన్‌ప్రింట్)ల’ ఆధారంగా వీటిని లెక్కిస్తారు. గత ఏడాదితో పోల్చి తే ఈ సంవత్సరం వన్యప్రాణుల సంఖ్య తగ్గిందా? పెరిగిందా? అన్నది కూడా ఈ పద్ధతి ద్వారానే తెలుస్తుంది. 2004లో జిల్లాలో మూడు పులులు, పన్నెం డు చిరుతలు ఉండేవి.

ప్రస్తుతం పులుల ఆచూకీ లేకపోగా, చిరుతల సంఖ్య ఎనిమిదికి తగ్గిందని సమాచారం. ఇతర వన్యప్రాణుల విషయానికి వస్తే పో చారం అభయారణ్యంలో 168 అడవి పందులు, 96 నీల్గాయిలు, కుందేళ్లు, నెమళ్లు, కృష్ణ జింకలు, 400 సాంబారులు ఉన్నట్లు అధికారుల రికార్డులు తెలుపుతున్నాయి.  వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం అధికారులు వ్యవహరిస్తే పులులు, చిరుతలు జనంలోకి రాకుండా అడవులకే పరిమితమవుతాయి. కానీ, అంతరిస్తున్న అడవులు, చట్టు బండలవుతున్న కారణంగా చిరుతలు జనంలోకి చేరి ఆందోళన కలిగిస్తున్నాయి.
 
మా ఇంటికి సమీపంలోనే కన్పించింది

మా ఇంటికి సమీపంలోనే సమారు 200 మీటర్ల దూరంలో పులి కన్పించింది, రాత్రి పూటి ఇంటినుంచి బయటకు రావడంలేదు, రాత్రి ఎనిమిది గంటలకు తలుపులు వేస్తే ఉదయం వరకు తీయడంలేదు. భయంగా ఉంది, రాత్రి పూట నిద్రలేకుండా గడుపుతున్నం. అధికారులు వచ్చి పోయిండ్రు.. కానీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు.      -దుర్గేష్, కూలి, మాదాపూర్
 
ఐదు రోజులలో మూడు సార్లు ..
నేను కంకర మిషన్‌లో పని చేస్తా. మేం పని చేసే చోట చిరుత ఐదు రోజులలో మూడు సార్లు కనిపించింది. మొదట ఏడవ తేదీన, తరువాత ఎనిమిది, పదవ తేదీల లో మళ్లీ కన్పిపించింది. మేం ఒంటరిగా పనికి పోవడం లేదు. అందరం కలిసే పోతున్నం. భయంగా ఉంది. అధికారులు చర్యలు తీసుకోవాలి.        - అనిల్‌రామ, మాదాపూర్

మరిన్ని వార్తలు