ఇదేం దారి ద్య్రం!

21 Dec, 2018 08:17 IST|Sakshi
అధ్వానంగా మారిన ఉల్వనూరు రహదారి

పాల్వంచరూరల్‌: కిన్నెరసాని అభయారణ్యం పరిధిలో మంజూరైన ఆర్‌అండ్‌బీ రహదారి విస్తరణ పనులకు వైల్డ్‌లైఫ్‌ శాఖ ద్వారా అనుమతులు రాక ఏడాది కాలంగా స్తంభించాయి. మండల పరిధిలోని రాజాపురం నుంచి ఉల్వనూరు, చండ్రాలగూడెం మీదుగా కొత్తగూడెం మండలం మైలారం నుంచి కొత్తగూడెం క్రాస్‌ రోడ్డు వరకు రహదారి నిర్మాణానికి రూ.62 కోట్లు గత ఏడాది మంజూరయ్యాయి. అయితే ఇందులో 51 కిలోమీటర్ల ఆర్‌అండ్‌బీ రహదారి విస్తరణ పనులకు వైల్డ్‌లైఫ్‌ అనుమతి తప్పనిసరి.

కాగా, అభయారణ్యంలో రోడ్డు విస్తరణకు ఆ శాఖ అనుమతి  ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో రాజాపురం నుంచి ఉల్వనూరు వరకు రోడ్డు నిర్మాణ పనులు నిలిచిపోయాయి. పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్‌.. రాజాపురం నుంచి రోడ్డు విస్తరణ పనులు చేస్తుండగా గత మే నెలలో వైల్డ్‌లైఫ్‌ శాఖఅధికారులు నిలిపివేశారు.  రోడ్డు పొడవునా కల్వర్టులు కూడా నిర్మించారు. అయితే అవి రోడ్డుకు ఎత్తుగా ఉండటంతో వర్షాకాలంలో రాకపోకలకు ప్రమాదకరంగా మారిందని వాహనచోదకులు ఆవేధన వ్యక్తం చేస్తున్నారు. ఉల్వనూరు గ్రామ సమీపంలో, మల్లారం క్రాస్‌ రోడ్డు వద్ద రోడ్డుపై కంకర తేలి గుంతలు ఏర్పడ్డాయి.  

ప్రతిపాదనలు పంపినా పర్మిషన్‌ రాలే..  
రోడ్డు నిర్మాణం పనులు నిలిచిపోవడంతో అనుమతి ఇవ్వాలని కోరుతూ ఆర్‌అండ్‌బీ శాఖ ఈఈ ప్రభుత్వం ద్వారా ఢిల్లీకి ప్రతిపాదనలు పంపించారు. స్వయంగా పలుమార్లు ఢిల్లీ వెళ్లి సంబంధిత అధికారులతో చర్చించారు. అయినా రోడ్డు విస్తరణకు అనుమతి ఇచ్చేందుకు వైల్డ్‌లైఫ్‌ అధికారులు నిరాకరించారు. దీంతో చండ్రాలగూడెం నుంచి మైలారం వరకు వైల్డ్‌లైఫ్‌ పరిధిలో లేని 8 కిలోమీటర్ల మేర మాత్రమే రోడ్డు నిర్మించారు. అయితే పాత రోడ్డుపైనే కొత్తగా నిర్మిస్తే తమకు అభ్యంతరం లేదని వైల్డ్‌లైఫ్‌ అధికారులు అంటున్నారు. అంతకుమించి విస్తరిస్తే ఒప్పుకునేది లేదని స్పష్టం చేశారు. అంతేగాక.. గతంలో నిర్మించిన రోడ్డుకు సైతం వైల్డ్‌లైఫ్‌ అనుమతులు లేవని చెపుతున్నారు. అయితే ఆ శాఖ పర్మిషన్‌ లేకుండా పాత రోడ్డు కూడా ఎలా నిర్మించారనేది స్థానికంగా చర్చనీయాంశమైంది.

వైల్డ్‌లైఫ్‌ అనుమతి ఇవ్వడం లేదు
మండల పరిధిలోని రాజాపురం నుంచి ఉల్వనూరు వరకు వైల్డ్‌లైఫ్‌ శాఖ పరిధిలో నిర్మించాల్సిన తారు రోడ్డు పనులకు ఆ శాఖ  అనుమతి ఇవ్వడం లేదు. దీంతో ఏడాది కాలంగా పనులు నిలిచిన మాట వాస్తవమే. అనేక సార్లు ఢిల్లీకి వెళ్లి వైల్డ్‌లైఫ్‌ శాఖ అధికారులతో మాట్లాడినా, ప్రభుత్వం ద్వారా ప్రతిపాదనలు పంపినా అనుమతికి నిరాకరించారు. ఇంకా ప్రయత్నాలు చేస్తున్నాం. చివరికి పాత రోడ్డునే పునరుద్ధరించాలనే ఆలోచన కూడా ఉంది. మరోసారి వైల్డ్‌లైఫ్‌ ఉన్నతాధికారులతో చర్చిస్తాం.
– రాజేశ్వరరెడ్డి, ఆర్‌అండ్‌బీ ఈఈ

మరిన్ని వార్తలు