అజంతా, ఎల్లోరా గుహలు కూల్చేస్తారా? 

18 Jul, 2019 02:26 IST|Sakshi

ప్రభుత్వ భవనాలంటూ కూల్చేస్తామంటే ఎలా?

ఎర్రమంజిల్‌ భవనం కూల్చివేతపై హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ భవనాలైనంత మాత్రాన, చారిత్రక కట్టడాల కింద రక్షణ ఉన్న భవనాలను కూల్చివేయడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అజంతా, ఎల్లోరా గుహలు కూడా ప్రభుత్వానికి చెందినవేనని, అంత మాత్రాన వాటిని కూల్చేస్తామంటే కుదరదని వ్యాఖ్యానించింది. ప్రభుత్వమేమీ చట్టానికి అతీతం కాదని, ఎవరైనా సరే చట్టానికి లోబడే పనిచేయాల్సి ఉంటుందని పేర్కొంది. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, ఏకవ్యక్తి పాలనలో లేమని ఘాటుగా వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌ పట్టణాభివృద్ధి చట్టంలో నిబంధన 13 ప్రకారం 137 గుర్తించిన చారిత్రక కట్టడాలకు రక్షణ ఉందని తెలిపింది. ఈ రక్షణను తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదంది. చారిత్రక కట్టడాల రక్షణ విషయంలో కేంద్ర సాధారణ నిబంధనల చట్టంలోని సెక్షన్‌ 6 గురించి వివరణ ఇవ్వాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రాఘవేంద్రసింగ్‌ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్‌ షమీమ్‌ అక్తర్‌ల ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీ నిర్మాణం నిమిత్తం ఎర్రమంజిల్‌ భవనాన్ని కూల్చివేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో పలు వ్యాజ్యాలు దాఖలైన విషయం తెలిసిందే. వీటిపై బుధవారం సీజే నేతృత్వంలోని ధర్మాసనం మరోసారి విచారణ జరిపింది. ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు వాదనలు వినిపిస్తూ, హుడా చట్టంలో నిబంధన 13 చేర్చేంత వరకు చారిత్రక కట్టడాలకు ఎటువంటి రక్షణ ఉండదన్నారు. ఒకసారి చట్టంలో నుంచి ఓ నిబంధనను తొలగించిన తరువాత, మాస్టర్‌ ప్లాన్‌లో ఉన్న భవనాలకు ఎటువంటి విలువ లేదన్నారు. అలా అయితే మాస్టర్‌ ప్లాన్‌ను ఎవరైనా ఉల్లంఘించవచ్చునని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

ఎర్రమంజిల్‌ భవనం ప్రభుత్వ భవనమని, దీని విషయంలో నిర్ణయం తీసుకునే విచక్షణాధికారం ఉందని రామచంద్రరావు చెప్పారు. అలా అయితే అజంతా, ఎల్లోరా గుహలు కూడా ప్రభుత్వానివేనని, వాటిని కూల్చేస్తామని కేంద్రం చెబితే అందుకు ఎవ్వరూ అంగీకరించరని ధర్మాసనం తెలిపింది. చట్టాలకు లోబడి ప్రభుత్వ నిర్ణయాలు ఉన్నప్పుడు వాటికి మాత్రమే న్యాయస్థానాల ఆమోదం ఉంటుందని గుర్తు చేసింది. చారిత్రక కట్టడాల విషయంలో సాధారణ నిబంధనల చట్టంలోని సెక్షన్‌ 6 గురించి వివరించాలని ప్రభుత్వానికి స్పష్టం చేస్తూ విచారణను 22కి వాయిదా వేసింది.   

మరిన్ని వార్తలు