రంజాన్‌కు ముందే జీతాలపై సందిగ్ధత!

26 Jul, 2014 02:55 IST|Sakshi

ఆనవాయితీగా మార్చొద్దంటున్న ఆర్థిక శాఖ
సాక్షి, హైదరాబాద్: రంజాన్ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ  సర్కారు వేతనాలను శుక్రవారమే మంజూరు చేసింది. అయితే, ఆంధ్రా ఉద్యోగులకు ఏపీ సర్కారు శనివారమైనా ఇస్తుందా లేదా అనే విషయంపై సందిగ్ధత నెలకొంది. దీనికి ప్రధాన కారణం.. పండుగల పేరుతో వేతనాలను ముందుగా ఇచ్చే విధానంపై ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ విముఖత వ్యక్తం చేయడమే. వివరాలు.. రంజాన్ సందర్భంగా ఉద్యోగులకు జీతాలను ఇచ్చే విషయం ఏపీలో చర్చకు దారితీసింది. ప్రతి నెలా 1న ఇస్తున్న వేతనాలను పండుగల నేపథ్యంలో తేదీతో సంబంధం లేకుండా ఇచ్చే విధానానికి తెరదీయొద్దని ఏపీ ఆర్థిక శాఖ సీఎంకు సూచించింది.
 
 ఈ మేరకు ఓ ఫైలును సీఎంకు పంపింది. ఇప్పుడు రంజాన్‌కు ముందుగా వేతనాలు, పెన్షన్లు ఇస్తే మిగతా పండుగలకు కూడా ముందుగా జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంటుందని, ఇది ఆనవాయితీగా మారిపోతుందని ఆర్థిక శాఖ పేర్కొంది. రంజాన్ సందర్భంగా ముందుగా వేతనాలు, పెన్షన్లు ఇవ్వాలంటే 26ని ఫైలులో ప్రతిపాదించారు. అయితే సంబంధిత ఫైలు సీఎం వద్ద ఉంది. శుక్రవారం చంద్రబాబు జిల్లా పర్యటనలో ఉన్నందున దీనిని పరిశీలించలేదు. ఇక శనివారం ఈ ఫైలుకు ఆమోదం తెలిపితే జీవో జారీ చేయడం, వేతనాలు, పెన్షన్లు చెల్లించడం ఆరోజు సాధ్యం కాదని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఆదివారం సెలవు, ఇక సోమవారమే జీవో జారీ వేతనాలు చెల్లింపు జరిగే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు