కౌన్సెలింగ్‌పై నిర్ణయాధికారం మండలిదే

30 Jul, 2014 02:58 IST|Sakshi

ఆలస్యంపై కారణాలను సుప్రీంకోర్టుకు చెబుతాం: చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడ్డి వెల్లడి
 సాక్షి, హైదరాబాద్:  ఎంసెట్ కౌన్సెలింగ్ విషయంలో తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేస్తున్నా ముందుకే సాగాలని ఉన్నత విద్యామండలి నిర్ణయించింది. ఈనెల 30న నోటిఫికేషన్ జారీ చేసి, 7వ తేదీ నుంచి సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేసేందుకు సిద్ధమైంది. మంగళవారం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నివాసంలో అనంతరం ఆ రాష్ట్ర చీఫ్ సెక్రటరీ ఐవైఆర్ కృష్ణారావుతో సమావేశం తర్వాత ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ వేణుగోపాల్‌రెడి ్డ విలేకరులతో మాట్లాడారు.
 
  ప్రవేశాల కౌన్సెలింగ్‌పై నిర్ణయాధికారం ఉన్నత విద్యామండలికే ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాలమేరకు ఆగస్టు 1 నాటికి తరగతులు ప్రారంభించాల్సి ఉందని, ఆగస్టు 15 తరువాత ఎలాంటి ప్రవేశాలు చేపట్టవద్దని పేర్కొందని వివరించారు. తల్లిదండ్రులు, విద్యార్థులు, వివిధ సంఘాల నేతలు కౌన్సెలింగ్ త్వరగా చేపట్టాలని కోరుతున్నారని చెప్పారు. ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరంలో చేరాల్సిన ఈసెట్ విద్యార్థులు నష్టపోతున్నారని వివరించారు. సుప్రీంకోర్టు కౌన్సెలింగ్‌ను ఆపాలని చెప్పలేదన్నారు.  ఆంధ్రప్రదేశ్ పునర్‌వ్యవస్థీకరణ చట్టంలోని సెక్షన్ 75 ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహణ, ప్రవేశాల అధికారం పదేళ్లపాటు ఉన్నత విద్యా మండలికే ఉందన్నారు.
 
 మేమూ ఇంప్లీడ్ అవుతాం...
 4వ తేదీలోగా సుప్రీంకోర్టులో తామూ ఇంప్లీడ్ అవుతామని చైర్మన్ వివరించారు. ప్రవేశాల ఆలస్యానికి కారణాలను కోర్టుకు తె లియజేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆదేశాల మేరకే ప్రవేశాల కమిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకుందని తెలంగాణ ప్రభుత్వం చెబుతోందని విలేకరులు ప్రశ్నించగా, వేణుగోపాల్‌రెడ్డి సమాధానం ఇవ్వకుండా వెళ్లిపోయారు. కాగా, సోమవారం జరిగిన ప్రవేశాల కమిటీ సమావేశంలోనూ ఎక్కువమంది సభ్యులు ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు ఆలస్యంగా తెలిసింది. ఎంసెట్ కమిటీలో మొత్తం 12 మంది ఉండగా, సమావేశానికి 9 మందే హాజరయ్యారు. వారిలో ఐదుగురు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్ణయాన్ని, నోటిఫికేషన్ నిర్ణయాన్ని వ్యతిరేకించినట్టు తెలిసింది. అయినా ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని తెలంగాణ అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలాఉండగా, మండలి ఛైర్మన్ వేణుగోపాల్‌రెడ్డితో తెలంగాణ విద్యాశాఖ కార్యదర్శి వికాస్‌రాజ్ ఫోన్‌లో మాట్లాడి, వివరాలు తెలుసుకున్నారు.

మరిన్ని వార్తలు