చట్టం..మీ పక్షం 

21 Aug, 2019 12:24 IST|Sakshi
వృద్ధుల అవగాహన సదస్సులో మాట్లాడుతున్న న్యాయ సేవాసంస్థ కార్యదర్శి వినోద్‌ కుమార్‌ (ఫైల్‌)

సాక్షి, ఖమ్మం : ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చెదిరిపోవడంతో పెద్దవారిని కుటుంబం గమనించడం తగ్గిపోయింది. ఫలితంగా పెద్దలు ప్రత్యేకించి వితంతువులు వారి జీవనసంధ్యా కాలం ఒంటరిగానూ, భౌతికంగా, ఆర్థికంగా ఏ ఆసరా లేకుండా గడపాల్సి వస్తోంది. వయసు మీరడం అనేది ప్రధానమైన సామాజిక మార్పునకు దారితీస్తుంది. పెద్దవారి సంరక్షణకు వారి భద్రతకు శ్రద్ధ అవసరం. దీనిని దృష్టిలో ఉంచుకుని పార్లమెంట్‌లో 2007 ఏడాదిలో తల్లిదండ్రుల, వృద్ధుల పోషణ సంక్షేమ చట్టం అమలులోకి తెచ్చారు.  

చట్టంలోని సదుపాయాలు.. 
ఆస్తిని వారసత్వం ప్రకారం పొందే సంతానంపైన విధిగా బాధ్యతలు ఉంచింది. మెరుగైన వైద్యసదుపాయాలను వృద్ధులకు కల్పించడంతోపాటు వారి జీవనాన్ని, వారి ఆస్తులను సంరక్షించే సదుపాయాలను కల్పిస్తుంది. తల్లిదండ్రులతో సహా వృద్ధుడు తమ స్వార్జితం ద్వారా లేకపోతే తనకు గల ఆస్తి ద్వారా నిర్వహణ జరుపుకోలేనప్పుడు ఈ చట్టం సెక్షన్‌ 5 ప్రకారం షరతులకు లోబడి దరఖాస్తు చేసుకోవచ్చు. వారి సంతానం తల్లిదండ్రుల అవసరాలను తీర్చేవిధంగా, వారు సాధారణ జీవనం కొనసాగించేలా చూడాల్సిన బాధ్యత ఉంది. వృద్ధుల నిర్వహణ కోసం నెలసరి వేతనాన్ని విడుదల చేస్తూ సంతానానికి లేనిపక్షంలో బంధువులకు ఉత్తర్వులు జారీ చేయవచ్చు. ట్రిబ్యునల్‌ నేర శిక్షా స్మృతి 1973 జుడీషియల్‌ అధికారాలు కలిగి, ప్రతివాదులు హాజరు కాని ఎడల కేసును ఏకపక్షంగా విచారిస్తుంది. సెక్షన్‌–7ను అనుసరించి రాష్ట్ర ప్రభుత్వంలోని ఉప డివిజనల్‌ అధికారి హోదా కలిగిన అధికారి ట్రిబ్యునల్‌ను నిర్వహిస్తారు.

సంతానం, బంధువులు.. వృద్ధుల నిర్వహణలో నిర్లక్ష్యం, తిరస్కారాన్ని సెక్షన్‌ 9 వివరిస్తుంది. సదరు ఉత్తర్వు రాష్ట్ర ప్రభుత్వ నియమావళికి లోబడి నెలకు రూ.10వేలకు లోబడి ఉంటుంది. వృద్ధులకు ఫీజు మినహాయింపు ఉంటుంది. వృద్ధులు, తల్లిదండ్రులు ట్రిబ్యునల్‌ ఉత్తర్వు ద్వారా బాధించబడితే అప్పిలేట్‌ ట్రిబ్యునల్‌కు 60రోజుల్లోగా సెక్షన్‌ 16ను అనుసరించి దరఖాస్తు చేసుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం అనువైన చోట్ల అవసరం ఉందని భావిస్తే జిల్లాకు ఒకటి చొప్పున వృద్ధాశ్రమాలను ఏర్పాటు చేసి కనీసం 150 మంది వృద్ధులకు ఆశ్రయం కల్పిస్తుంది. సంరక్షణ, భద్రత కల్పించాల్సిన వృద్ధులను విడిచిపెట్టినా.. పరిత్యాగం చేసే విధంగా బుద్ధి పూర్వకంగా వ్యవహరించినా శిక్షార్హం. శిక్షా కాలం గరిష్టంగా 3నెలల జైలుశిక్ష, అపరాధ రుసుము గరిష్టంగా రూ.5వేలు, లేకపోతే రెండింటినీ విధించవచ్చు.  

సీనియర్‌ సిటిజన్లకు నల్సా స్కీమ్‌ –2016 
ఈ చట్టం ప్రకారం వృద్ధులు న్యాయసేవాసంస్థలను ఆశ్రయించలేనప్పుడు ప్యానల్‌ లాయర్స్, పారా లీగల్‌ వలంటీర్ల సహాయంతో వారిని న్యాయసేవాసంస్థ వద్దకు తీసుకొచ్చి సమస్యలను పరిష్కరిస్తారు. ఆ మేరకు వారికి సంస్థ శిక్షణను ఇచ్చింది. న్యాయసేవాసంస్థ వృద్ధులను వారి కుమారులు అశ్రద్ధ చేయకుండా వారిలో చైతన్యం కలిగించేందుకు న్యాయసేవాసంస్థ ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఇందుకుగాను ప్యానల్‌ లాయర్స్, పారా లీగల్‌ వలంటీర్లతో స్పెషల్‌ సెల్స్‌ ఏర్పాటు చేశారు. 2017 ఏడాదిలో 47 క్యాంప్‌ల ద్వారా 880మంది వృద్ధులు లబ్ధిపొందారు. 2018లో 16 క్యాంపుల ద్వారా 1538మంది లబ్ధిపొందారు. 2019 ఏడాది ఇప్పటి వరకు 13 క్యాంపుల ద్వారా 1092 మందికి లబ్ధి చేకూర్చారు.  

శిక్షలు కఠినంగానే ఉంటాయి 
న్యాయసేవాసంస్థ ద్వారా వృద్ధుల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి, వారికి వారసుల నుంచి ఆసరా కల్పించడానికి అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాం. అనేకమంది వృద్ధులకు చేయూతను అందించాం. న్యాయసేవాసంస్థ ద్వారా వృద్ధులకు మెరుగైన వైద్య సదుపాయాలు కల్పించడానికి, ఆస్తులను సంరక్షించే సదుపాయాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. వృద్ధులను నిర్లక్ష్యం చేస్తే జైలుశిక్ష, జరిమానా విధించవచ్చు.  
– వినోద్‌ కుమార్, న్యాయ సేవాసంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి, ఖమ్మం  

మరిన్ని వార్తలు