విద్యుదుత్పత్తికి మేము సహకరిస్తాం

13 Aug, 2014 02:51 IST|Sakshi
విద్యుదుత్పత్తికి మేము సహకరిస్తాం

* అతి తక్కువ సమయంలోనే విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తాం
* ముఖ్యమంత్రి కేసీఆర్‌తో చైనా కంపెనీ ప్రతినిధుల భేటీ

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ ఉత్పత్తికి సహకారం అందిస్తామని చైనాకు చెందిన డాన్‌ఫాంగ్ ఎలక్ట్రిక్ కార్పొరేషన్ (డీఈసీ) ముందుకు వచ్చింది. డీఈసీ అంతర్జాతీయ అధ్యక్షుడు హన్ జికియో, డీఈసీ ఇండియా ఎండీ లియాంగ్ జియాన్‌లు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుతో సచివాలయంలో మంగళవారం సమావేశమయ్యారు. తెలంగాణతో దీర్ఘకాలిక భాగస్వామ్యం కోరుకుంటున్నట్టు ఈ సందర్భంగా వారు కేసీఆర్‌కు తెలిపారు. అతి తక్కువ కాలంలో 660 మెగావాట్ల నుంచి వెయ్యి మెగావాట్ల సామర్థ్యం కలిగిన విద్యుత్ ప్లాంట్లను నిర్మిస్తామని పేర్కొన్నారు.
 
 భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో 40 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ప్లాంట్లకు ఉపకరణాలను సరఫరా చేస్తున్నామని వివరించారు. చైనాలో విద్యుత్ ఉపకరణాల తయారీ, ఇతర ప్రాజెక్టులను పరిశీలించేందుకు ‘చెంగ్డు’ను సందర్శించాలని భావిస్తున్నట్టు సీఎం తెలిపారు. హైదరాబాద్‌లో 30 శాతానికిపైగా ఇళ్లలో చైనా నుంచి కొనుగోలు చేసిన ఫర్నిచర్ ఉందని చెప్పారు. ఈ సమావేశంలో ఇంధనశాఖ ముఖ్యకార్యదర్శి ఎస్‌కే జోషీ, సీఎంవో ప్రత్యేక కార్యదర్శి రాజశేఖర్‌రెడ్డిలు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు