పదవీ విరమణ @ 61

1 Feb, 2020 02:29 IST|Sakshi

రిటైర్‌మెంట్‌ వయసు పెంపు ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి? 

58 ఏళ్ల నుంచి  61 ఏళ్లకు పెంచాలని సూత్రప్రాయ నిర్ణయం 

తదుపరి కేబినెట్‌ భేటీలో ఆమోదం!

వచ్చే మూడేళ్లలో  రిటైరయ్యే 26,133 మందికి మూడేళ్ల  సర్వీసు పొడిగింపు 

గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన  సీఎం కేసీఆర్‌ 

సాక్షి, హైదరాబాద్‌: ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసును 61 ఏళ్లకు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని ఏప్రిల్‌ 1 నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు సమాచారం. దీంతో ప్రస్తుతం 58 ఏళ్లుగా ఉన్న విరమణ వయసు 61 ఏళ్లకు పెరగనుంది. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్ణయం జరిగింది. దీనికి సంబంధించి తదుపరి మంత్రివర్గ సమావేశం నాటికి ఫైల్‌ను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి.

విరమణ వయసును 61 ఏళ్లకు పెంచితే ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి 2023 మార్చి 31 నాటికి పదవీ విరమణ చేయనున్న 26,133 మంది ఉద్యోగులకు మూడేళ్ల పాటు అదనపు సరీ్వసు కలిసొస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరి రాష్ట్రంలో కూడా పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచడంతో పాటు 33 ఏళ్ల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగులకు ఈ పెంపు వర్తింపచేయకూడదన్న ఉన్నతాధికారుల కమిటీ సిఫారసులను సీఎం పక్కన పెట్టినట్లు తెలిసింది. ఉద్యోగుల సర్వీసు, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయసుతో నిమిత్తం లేకుండా ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన విధంగానే 61 ఏళ్లకు సీఎం మొగ్గు చూపినట్లు సమాచారం.


 

మూడేళ్ల పాటు నో రిటైర్‌మెంట్‌.. 
పదవీ విరమణ వయసు పెంపుదల ఉత్తర్వులు అమల్లోకి వస్తే 2020 ఏప్రిల్‌ 1 నుంచి 2023 మార్చి 31 దాకా రిటైర్‌మెంట్లు ఉండవు. దాదాపు 26,133 మంది ఉద్యోగులకు సంబంధించిన గ్రాట్యుటీ, పదవీ విరమణ సందర్భంగా ఇచ్చే అన్ని రకాల బెనిఫిట్లకు సంబంధించి చెల్లింపులు నిలిచిపోతాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో తాత్కాలికంగా ప్రభుత్వానికి ఆర్థికంగా కొంత ఊరట లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న 58 ఏళ్లు కొనసాగిస్తే ప్రభుత్వం ప్రతినెలా రూ.250  కోట్ల నుంచి రూ.300 కోట్ల మేర గ్రాట్యుటీ, ఇతర బెనిఫిట్లు చెల్లించాల్సి ఉంటుంది. అంటే సంవత్సరానికి సగటున రూ.3,500 కోట్లు మూడు సంవత్సరాల పాటు ప్రభుత్వానికి కలిసొస్తుంది.

పదవీ విరమణ వయసు పెంపుదలతో ప్రభుత్వ ఉద్యోగులందరికీ మూడు సంవత్సరాల పాటు సరీ్వసు పెరుగుతుంది. ఈ ఏడాది ఏప్రిల్‌ నుంచి డిసెంబర్‌ వరకు పదవీ విరమణ చేయనున్న 7,040 మందితో పాటు ఆ తర్వాత రెండేళ్లు కలుపుకొని మొత్తం 26,133 మంది ఉద్యోగులకు వెంటనే మూడేళ్ల పాటు అదనంగా ఉద్యోగంలో కొనసాగడానికి వీలు కలుగుతుంది.  

మరిన్ని వార్తలు