జనగాం అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచి కోదండరాం పోటీ..?

22 Apr, 2018 14:32 IST|Sakshi
తెలంగాణ జనసమితి జెండా

పోరుగడ్డలో ఆసక్తికరంగా కోదండరాం పార్టీ

ఆవిర్భావ సభ తర్వాత వలసలు జోరందుకునే అవకాశం..

మూడు నియోజకవర్గాల్లో బలమైన నాయకుల కోసం గాలింపు

 జనగామ అసెంబ్లీ సెగ్మెంట్‌ నుంచే పార్టీ వ్యవస్థాపకుడి పోటీ..?

 టీజేఎస్‌ నాయకుల ప్రచారంపై రాజకీయ వర్గాల్లో చర్చ

సాక్షి, జనగామ: తెలంగాణ ఉద్యమంలో ప్రజా సంఘాలను ఏకం చేయడంతోపాటు ఉద్యోగులు, రాజకీయ పార్టీలను సమన్వయం చేసి ముందుకు నడిచిన ప్రొఫెసర్‌ కోదండరాం ఇటీవల స్థాపించిన తెలంగాణ జనసమితి (టీజేఎస్‌) పార్టీ పోరుగడ్డలో జోరందుకుంది. ఉద్యమ సమయంలో కోదండరాం చూపిన పోరాట పటిమ, రాష్ట్రం సిద్ధించిన తర్వాత ప్రజా సమస్యలపై ఆయన చేపడుతున్న కార్యక్రమాలు అన్ని వర్గాల ప్రజలను ఆకర్షిస్తున్నట్లు తెలు స్తోంది. ఉద్యమ సంస్థగా ప్రారంభమైన జాయింట్‌ యాక్షన్‌ కమిటీ(జేఏసీ)ని ఈనెల 2వ తేదీన ఆయన రాజకీయ పార్టీగా మార్చుతున్నట్లు ఆయన లాంఛనంగా ప్రకటించారు. ఈ మేరకు తెలంగాణ జనసమితి పేరును ప్రకటించి 4వ తేదీన పార్టీ జెండాను సైతం ఆవిష్కరించారు. అయితే టీజేఏసీ ప్రస్తుతం రాజకీయ పార్టీగా రూపాంతరం చెందడంతోపాటు ప్రజలను ఆకర్షించేందుకు తమదైన శైలిలో ముందుకుసాగుతోంది. టీజేఎస్‌.. సామాన్య ప్రజలతోపాటు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నేతలను ఆకర్షిస్తోంది.

పోరుగడ్డలో పాగా కోసం యత్నాలు..
మార్పునకు ప్రతీకగా నిలిచే జనగామ పోరుగడ్డలో టీజేఎస్‌ పాగా వేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. తెలంగాణ ఉద్యమ సమయంలో రాష్ట్రంలో ఎక్కడా లేనట్లుగా జిల్లా కేంద్రంలో ప్రజలు తమ ఆకాంక్షను బలంగా వినిపించారు.  తర్వాత జిల్లా సాధన ఉద్యమంలోనూ నాటి టీజేఏసీ కీలకపాత్ర పోషించింది. ఇప్పటికీ కోదండరాం జనగామలో ప్రత్యేక కేడర్‌ను కలిగి ఉన్నారు. ఇదే ఊపులో జిల్లాలో తమ సత్తాను చాటేందుకు టీజేఎస్‌ వ్యూహాలు  రచిస్తోంది. జిల్లాలోని జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తిలో తమ బలాన్ని పెంచుకునేందుకు సన్నాహాలు ప్రారంభించింది. ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులను టీజేఎస్‌లో చేరే విధంగా స్థానిక నాయకులు సంప్రదింపులు చేస్తున్నారు. ఇప్పటికే కొందరు ముఖ్యనేతలు కోదండరాంతో నేరుగా టచ్‌లో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తెలంగాణ ఉద్యమ సమయంలో పనిచేసి గుర్తింపు లేకుండా ఉన్న కొందరు నాయకులు, ద్వితీయ శ్రేణి కేడర్, మండల స్థాయి నాయకులు టీజేఎస్‌ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్లుగా ప్రచారం సాగుతోంది.

కోదండరాం పోటీపై ఒత్తిడి..
టీజేఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు కోదండరాం రాబోయే ఎన్నికల్లో జనగామ నియోజకవర్గం నుంచే పోటీ చేయాలని స్థానిక నాయకులు ఆయనపై ఒత్తిడి చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర రాజధానికి సమీపంలో జనగామ ఉండడంతోపాటు రైతులు, నిరుద్యోగులు, మహిళలు ఎక్కువ సంఖ్యలో ఉండడం కలిసి వస్తుందని అధినేతకు నచ్చచెబుతున్నట్లు సమాచారం. జనగామను ఎంచుకుంటే రాజకీయ భవిష్యత్‌తోపాటు రాష్ట్ర రాజకీయాలపై పట్టుసాధించవచ్చని భావిస్తున్నారు. చైతన్య వంతమైన ఓటర్లు అండగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నామని టీజేఎస్‌ నాయకుడు ఒకరు చెబుతున్నారు.

దూకుడు పెంచిన ‘టీజేఎస్‌’..
ఈనెల 29వ తేదీన హైదరాబాద్‌లోని సరూర్‌నగర్‌లో టీజేఎస్‌ ఆవిర్భావ సభను నిర్వహించనున్నారు. సభను విజయవంతం చేసేందుకు జిల్లా వ్యాప్తంగా టీజేఎస్‌ శ్రేణులు గ్రామాల్లో పర్యటిస్తున్నాయి. ఈ మేరకు టీజేఎస్‌ జిల్లా ఇన్‌చార్జి సతీష్, రైతు విభాగం నాయకుడు పాతూరి మల్లారెడ్డి, విద్యార్థి నాయకులు తీగల సిద్ధూగౌడ్, ఎండీ దస్తగిరి, మహిళ విభాగం నేతలు రజని, మహంకాళి పద్మ నేతృత్వంలో మండలాల వారీగా సన్నాహాక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. జనగామ, రఘునాథపల్లి, లింగాలఘణపురం, నర్మెట, తరిగొప్పుల, బచ్చన్నపేట మండలాల్లో పర్యటించి ప్రజలను సమాయత్తం చేస్తున్నారు. రాబోయే రోజుల్లో జిల్లాలో టీజేఎస్‌ ప్రత్యామ్నాయ శక్తిగా మారుతుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు