విశేషాధికారాలపై వైఖరి మారదు: తెలంగాణ కేబినెట్

12 Aug, 2014 03:32 IST|Sakshi
విశేషాధికారాలపై వైఖరి మారదు: తెలంగాణ కేబినెట్

* గవర్నర్‌కు అధికారాలపై రాష్ర్ట కేబినెట్ ఆందోళన
* కేంద్రం సూచనలకు సమ్మతించరాదని నిర్ణయం
* తదుపరి కార్యాచరణకు మరోసారి భేటీకి యోచన
* రుణమాఫీ, రెగ్యులరైజేషన్, కేసుల ఎత్తివేత, అమరుల కుటుంబాలకు సాయం, టీ ఇంక్రిమెంట్‌కు ఆమోదం
* పంద్రాగస్టున ప్రకటించనున్న సీఎం కేసీఆర్
* రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ బకాయిల విడుదలకు నిర్ణయం

 
 సాక్షి, హైదరాబాద్: గవర్నర్ విశేషాధికారాలకు సంబంధించి కేంద్రం పంపిన లేఖపై తెలంగాణ కేబినెట్ ఆందోళన వ్యక్తం చేసింది. దీనికి ఎట్టిపరిస్థితుల్లోనూ సమ్మతించబోమన్న వైఖరికే కట్టుబడి ఉండాలని నిర్ణయించింది. సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన దాదాపు నాలుగు గంటల పాటు రాష్ర్ట మంత్రి వర్గం సమావేశమైంది. గవర్నర్ విశేషాధికారాలపై పార్లమెంటులో ఎంపీలు స్పందించిన తీరును ఈ సందర్భంగా కేబినెట్ ప్రశంసించింది. ఎన్డీయే ప్రభుత్వం తెలంగాణపై నిర్బంధాన్ని ప్రయోగిస్తుందనే అంశాన్ని సమర్థంగా వెల్లడించగలిగామని మంత్రులు అభిప్రాయపడ్డారు.
 
అయితే దీనిపై మరింత ఆచితూచి తదుపరి కార్యాచరణ రూపొందించుకోవాల్సి ఉందని, ఇందుకు మరోసారి భేటీ కావాలని కొందరు మంత్రులు అభిప్రాయపడ్డారు. కాగా, ఈ భేటీలో ప్రధానంగా ఆరు అంశాలపై సుదీర్ఘంగా చర్చ జరిగింది. రైతులకు రుణ మాఫీ, చేనేత కార్మికులకు రుణ మాఫీ, కాంట్రాక్టు కార్మికుల రెగ్యులరైజేషన్, అమరవీరుల కుటుంబాలకు చేయూత, తెలంగాణ ఉద్యమకారులపై కేసుల ఎత్తివేత, ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్‌కు సంబంధించిన పలు అంశాలను  మంత్రివర్గం విశ్లేషించింది. ఈ వివరాలను స్వాతంత్య్ర దినోత్సవం రోజున ముఖ్యమంత్రి అధికారికంగా ప్రకటించనున్నారు. కాగా, పంద్రాగస్టు వేడుకల్లోనే దళితులకు భూ పంపిణీ పథకాన్ని అమలు చేయాలని కూడా కేబినెట్ నిర్ణయించింది. ఐదేళ్లుగాా పెండింగ్‌లో ఉన్న రైతుల ఇన్‌పుట్ సబ్సిడీ(రూ. 480.42 కోట్లు)ని విడుదల చేయడానికి ఆమోదముద్ర వేసింది. ఇక చారిత్రక గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరపాలని నిర్ణయించడంపై కేసీఆర్‌ను మంత్రివర్గం ప్రత్యేకంగా అభినందించింది.
 
 ఎంసెట్ కోసం ఉమ్మడి కమిటీ
సుప్రీం తాజా తీర్పు నేపథ్యంలో ఎంసెట్ కౌన్సెలింగ్ అంశం కూడా ప్రధానంగా చర్చకు వచ్చింది. కౌన్సిలింగ్ నిర్వహణకు ఉమ్మడిగా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. తమ ఆధ్వర్యంలోనే ప్రవేశాలను చేపట్టేందుకు సిద్ధపడిన ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. జేఎన్‌టీయూహెచ్ తెలంగాణలోనే ఉన్నందున తామే కౌన్సిలింగ్ నిర్వహిస్తామని, ఇందుకు రెండు రాష్ట్రాల అధికారులతో కూడిన ఉమ్మడి కమిటీని కూడా ఏర్పాటు చేస్తామని కేబినెట్‌లో తీర్మానించింది.
 
 జేఎన్‌టీయూ వీసీ జాయింట్ కన్వీనర్‌గా ఉండే ఈ కమిటీలో రెండు రాష్ట్రాల నుంచి ఇద్దరేసి చొప్పున అధికారులు సభ్యులుగా ఉండాలని నిర్ణయించారు. కౌన్సిలింగ్ నిర్వహణ కోసం మంగళవారమే నోటిఫికేషన్ జారీ చేసి, వీలైతే 13 లేదా 14 నుంచే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రారంభించాలని నిర్ణయించినట్టు తెలిసింది. తెలంగాణ విద్యార్థులకు ఆర్థిక సాయం(ఫాస్ట్) కింద నిబంధనల ప్రకారమే ఫీజులను చెల్లించే అంశంపై కూడా సమావేశంలో మంత్రులు చర్చించారు. 1956 స్థానికతకు కట్టుబడి ఉండాలని, ఫీజు బకాయిలపై తక్షణమే లెక్కలు తీయాలని నిర్ణయించారు.
 
 జెండాలు ఎగరేసేది వీరే..
 పంద్రాగస్టు వేడుకల సందర్భంగా జిల్లా కేంద్రాల్లో ఆయా జిల్లాల మంత్రులు త్రివర్ణ పతాకాన్ని ఎగరవేస్తారు. మంత్రులు లేని మహబూబ్‌నగర్‌లో మంత్రి కేటీఆర్, ఖమ్మంలో మంత్రి పద్మారావులు పతాకాలను ఆవిష్కరిస్తారు. ఆదిలాబాద్‌లో జోగు రామన్న, నిజామాబాద్‌లో పోచారం శ్రీనివాసరెడ్డి, కరీంనగర్‌లో ఈటెల రాజేందర్, వరంగల్‌లో రాజయ్య, మెదక్‌లో హరీష్‌రావు, రంగారెడ్డిలో మహేందర్‌రెడ్డి, నల్గొండలో జగదీశ్‌రెడ్డి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.
 
 దసరాకే కల్లు డిపోలు
 హైదరాబాద్‌లో గతంలో మూతపడ్డ 103 కల్లుడిపోలతో పాటు రంగారెడ్డిలో 17 కల్లు డిపోలను దసరా రోజున తిరిగి ప్రారంభించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని మంత్రివర్గం నిర్ణయించింది. ఈ బాధ్యతను ఎక్సైజ్ మంత్రి పద్మారావుకు అప్పగించింది. వీలైనంతవరకు పాతవారికే వాటిని అప్పగించాలని కొందరు మంత్రులు సూచించారు.
 
రుణాలమాఫీపై మరోసారి ఆర్‌బీఐ వద్దకు ....
 ఇదిలా ఉండగా, రైతుల రుణాల రీషెడ్యూల్ విషయంలో మరోసారి రిజర్వ్ బ్యాంకు తలుపుతట్టాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది, ఈ అంశాన్ని తెలంగాణ మంత్రిమండలి సోమవారం సుధీర్ఘంగా చర్చించింది. కరువు, వరదల కారణంగా పంటలు నష్టపోయిన 415 మండలాల్లో రుణాలు రీ షెడ్యూల్ చేయాలని ఇదివరకే తెలంగాణ ప్రభుత్వం ఆర్‌బీఐని కోరిన సంగతి తెలిసిందే. అయితే పంటల దిగుబడిని పరిగణలోకి తీసుకుని ఆర్‌బీఐ కేవలం మెదక్, రంగారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాల్లోని వంద మండలాల్లోనే రుణాల రీ షెడ్యూల్‌కు అంగీకరించి, వాటి చెల్లింపులకు కూడా అనేక షరతులు విధించిన సంగతి తెలిసిందే.
 
రుణాల రీ షెడ్యూల్‌ను మరిన్ని మండలాలకు వర్తింప చేయాలని కోరుతూ ఆర్‌బీఐని కోరాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు. రైతుల రుణాల మాఫీకి ప్రభుత్వం కట్టుబడి ఉందని, అయితే భారీమొత్తంలో నిధులు సమీకరణపై ఈ సమావేశంలో చర్చించినప్పటికీ, ఎలాంటి తుది నిర్ణయానికి రాలేదు. ఒకేసారి నిధుల సేకరణ ఎలా అన్న అంశం ఇబ్బందికరంగా మారుతుందని, అయితే,దీనిపై వచ్చే సమావేశంలో చర్చిద్దామని ముఖ్యమంత్రి సూచించారు. ప్రస్తుతం ఆర్‌బీఐ చేసిన ప్రతిపాదన ప్రకారమైతే.. తెలంగాణ ప్రభుత్వం దాదాపు 16 వేల కోట్ల మేరకు సమీకరించుకోవాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు