ముస్లిం రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకిస్తాం

22 Mar, 2017 02:50 IST|Sakshi
ముస్లిం రిజర్వేషన్ల బిల్లును వ్యతిరేకిస్తాం

సాక్షి, హైదరాబాద్‌: రాజ్యాంగ విరుద్ధమైన ముస్లిం రిజర్వేషన్ల బిల్లును సభలో పెడితే తాము వ్యతిరేకిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్యే కె.లక్ష్మణ్‌ పేర్కొన్నారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 24న యువమోర్చా ఆధ్వర్యంలో చలో అసెంబ్లీ కార్యక్రమం చేపడతామని తెలిపారు. గతంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం 5 శాతం మతపరమైన రిజర్వేషన్‌ కల్పిస్తే ఏ గతి పట్టిందో ప్రస్తుత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికీ అదే గతి పడుతుందని హెచ్చరించారు. మంగళవారం అసెంబ్లీ మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ మతపరమైన రిజర్వేషన్ల కల్పనకు బీజేపీ వ్యతిరేకమని పేర్కొన్నారు.

యువమోర్చా ఆధ్వర్యంలో జిల్లా, మండల కేంద్రాల్లో ధర్నాలు, నిరసనలు నిర్వహిస్తుంటే పోలీసులు కేసులు పెడుతున్నారని తెలిపారు. సోమవారం భువనగిరిలో ధర్నా చేస్తున్న బీజేపీ, బీజేవైఎం, ఇతర నాయకులపై నాన్‌బెయిలబుల్‌ కేసులు పెట్టి జైలుకు పంపించడం అక్రమమని ఆరోపించారు. వారిపై పెట్టిన కేసులు ఎత్తివేసి విడుదల చేయాలన్నారు. హైదరాబాద్‌లోని ధర్నాచౌక్‌ను ఎత్తేశారని.. ఇంకా ఎక్కడ నిరసన తెలపాలన్నారు.

మరిన్ని వార్తలు