కుర్సీ వేసుకుంటా

2 Apr, 2014 00:02 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ‘ఆంధ్ర ప్రాజెక్టులు చకచకా పూర్తయిపోతున్నాయి. మన సింగూరు.. చిన్న ప్రాజెక్టు. ఇంత చిన్న ప్రాజెక్టు ఇప్పటివరకు ఎందుకు పూర్తికాలేదు?   ఇప్పుడు నేను చెప్తున్నా.. సింగూరు ఇప్పుడైతది. అవసరమైతే సింగూరు కట్ట మీద కుర్సేసుకొని కూర్చుంటా.. ప్రాజెక్టు కట్టిస్తా’అని టీఆర్‌ఎస్ పార్టీ అధ్యక్షుడు కె. చంద్రశేఖర్‌రావు జిల్లా ప్రజలకు హామీ ఇచ్చారు. జోగిపేటలో మంగళవారం
 తెలంగాణ విజయోత్సవ సభ జరిగింది. ఈ సభకు కేసీఆర్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా పారిశ్రామికవేత్త బీబీ పాటిల్, మాజీ మంత్రి కరణం రామచంద్రారావు భార్య, మాజీ ఎమ్మెల్యే కరణం ఉమాదేవిలకు  కేసీఆర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయన ప్రసంగించారు.గతంలో బాబూమోహన్‌ను గెలిపించడం కోసం జోగిపేటకు వ చ్చానని, ఈ నియోజక వర్గంపై నాకు పూర్తి అవ గాహన ఉందని చెప్పారు. ఆనాడు మీరు బాబుమోహన్‌ను గెలిపిస్తే జోగిపేటను దత్తత తీసుకుంటానని చెప్పి రూ.100 కోట్ల అభివృద్ధి పనులు చేశానని కేసీఆర్ గుర్తుచేశారు. ‘1930లో ఇక్కడ ప్రథమాంధ్ర మహాసభ జరిగింది. 2014లో తెలంగాణ ఏర్పడ్డ తర్వాత ఇప్పుడు మొట్ట మొదటి తెలంగాణ సభ ఇక్కడే జరుగుతోంది. జోగిపేటకే ఆ గౌరవం దక్కిందని’ అన్నారు. జోగిపేటను సిద్దిపేటగా మారుస్తానని హామీ ఇచ్చారు.

రైతుల ఆకలి చావులకు, చేనేత కార్మికుల ఆత్మహత్యలకు కారణం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలే కారణమన్నారు. సింగూరు నుంచి అందోల్‌కు 40 వేల ఎకరాలకు నీళ్లు రావాలని ఏనాడో 30 ఏళ్ల క్రితం జీఓ ఇస్తే ఇవాల్టీకి చుక్కనీరు రాని పరిస్థితి ఉందన్నారు. ‘సింగూరు ప్రాజెక్టుకు కాల్వలు తవ్విన పరిస్థితి ఘోరంగా ఉంది. తూములు ఎంత ఎత్తులో ఉన్నాయ్, కాల్వలు ఏ ఎత్తులో తవ్వారు? ఇలాంటి పనులతో సింగూరు  నీళ్లను మనం జన్మలో చూస్తమా?’ అని ప్రశ్నించారు. సింగూరు ఎత్తి పోతల ప్రాజెక్టును కూడా మంజూరు చేయించింది కేసీఆరే అని చెప్పారు. సోనియాగాంధీని ఒప్పించి ప్రాజెక్టును పట్టుకొచ్చినట్లు చెప్పారు. ఇక్కడినుంచి మనుషులు పెద్ద పెద్ద పదవుల్లో ఉన్నా కానీ ఆ పని ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చే యలేదని కేసీఆర్ ప్రశ్నించారు.

 సింగూరు నిండిన తర్వాత చాలా నీళ్లు గోదావరి నదిలోకి పోతున్నాయని, అవసరమైతే ఇంజినీరింగ్ నిపుణులతో మాట్లాడి సింగూరు ప్రాజెక్టు సామర్థ్యం పెంచగలిగే అవకాశం ఉంటే పెంచేందుకు కృషి చేస్తానన్నారు. జోగిపేటలో లక్ష ఎకరాలకు సాగునీరు అందిస్తానని అన్నారు. మెదక్ జిల్లాను సిద్దిపేట, సంగారెడ్డి, మెదక్ అనే మూడు జిల్లాలుగా విభజన చేస్తామని చెప్పారు. ఈ జిల్లాల పునర్నిర్మాణంలో వేల మంది నిరుద్యోగ యువకులకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని కేసీఆర్ తెలిపారు. మెతుకుసీమలో మంచి భూములు ఉన్నాయని, ఇక్కడి వర్షపాతం సగటున 900 నుంచి 1000 మిల్లీమీటర్లు ఉంటుందన్నారు.

ఇక్కడి రైతులను మంచి పంటలు  పండించేలా ప్రోత్సహించి, ఆ పంట విత్తనాలను తెలంగాణ ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను లక్షాధికారులుగా చేస్తామని ఆయన చెప్పారు. మెదక్ జిల్లాలో చిన్న నీటి పారుదల పనుల్లో రూ. కోట్లు అవినీతి జరిగిందని, టీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే వాటిని తిరిగి రాబడతామని కేసీఆర్ హామీ ఇచ్చారు. సభలో టీఆర్‌ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యనారాయణ, ఎమ్మెల్యేలు  హరీష్‌రావు, పోచారం శ్రీనివాసరెడ్డి, హన్మంత్ షిండే, గంప గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, ఆకుల రాజేందర్, ఎమ్మెల్సీ మహమ్మద్ అలి, మాజీ ఎంపీ మాణిక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు