పథకాలు ఓట్లు రాల్చేనా?  లబ్ధిదారులు ఎటువైపో? 

1 Dec, 2018 13:05 IST|Sakshi

ఆ రెండు సామాజికవర్గాల ఓట్లే కీలకం 

ప్రధాన రాజకీయ పార్టీల హామీల వరద 

పార్టీల ఎన్నికల మేనిఫెస్టో విడుదల 

సాక్షి, వనపర్తి: పోలింగ్‌ సమయం సమీపిస్తున్నా కొద్దీ అభ్యర్థులు తమకు ఓటర్ల బలమెంతో బేరీజు వేసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంతకుముందు అమలుచేసిన ప్రభుత్వ పథకాలు పొందిన లబ్ధిదారులు, పొందనివారు ఎవరికి ఓటు వేస్తారోనని లెక్కలు వేసుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల బరిలో ఉన్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీ, బీజేపీ, బీఎల్‌ఎఫ్, ఇతర పార్టీల అభ్యర్థులు ప్రచారంలో నిమగ్నమయ్యారు.

వనపర్తి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి , కాంగ్రెస్‌ అభ్యర్థి జిల్లెల చిన్నారెడ్డి మధ్యే ప్రధానంగా పోటీ నెలకొంది. ప్రచారానికి మరో నాలుగు రోజుల గడువు మాత్రమే ఉండటంతో వారు నిత్యం ప్రజల మధ్యే ఉంటూ ఓట్లు రాబట్టే పనిలో ఉన్నారు.

నిరంజన్‌రెడ్డి నాలుగేళ్ల కాలంలో టీఆర్‌ఎస్‌ అమలుచేసిన సంక్షేమ పథకాలే తనను గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు. మరోసారి అధికారంలోకి వస్తే వీటితో పాటు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తామని ప్రజలకు హామీ ఇస్తున్నారు. చిన్నారెడ్డి మాత్రం తనకున్న సుదీర్ఘ రాజకీయ అనుభవం, నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందడం, మంత్రిగా చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపిస్తాయనే ధీమాలో ఉన్నారు.

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఇంతకన్నా మెరుగైన సంక్షేమ పథకాలను అమలు చేస్తామని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇదే సమయంలో నాలుగేళ్లుగా వివిధ పథకాల ద్వారా లబ్ధిపొందినవారు ఈ ఎన్నికల్లో ఎటు నిలుస్తారనే అంతటా చర్చ సాగుతోంది.   


ఆసరా ఓట్లు రాల్చేనా? 
ఈ ఎన్నికల్లో ఆసరా పింఛన్లు అందుకున్న లబ్ధిదారుల ఓట్లు కీలకం కానున్నాయి. ఎందుకంటే 2014 కంటే కాంగ్రెస్‌ పాలనలో రూ.200 వృద్ధులు, వితంతువులు, రూ.500 వికలాంగులకు అందించేవారు. 2014 ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్‌ హామీ ఇచ్చినట్లుగానే నియోజకవర్గంలోని 15,483 మంది వృద్ధులు, వితంతువులు 14,145 మంది, చేనేత కార్మికులు 219, గీత కార్మికులు 219 మంది, బీడీ కార్మికులు 143మంది, ఒంటరి మహిళలు 1496 మందికి ప్రతినెలా రూ.వెయ్యి చొప్పున అందించారు.

అలాగే 6,343 మంది వికలాంగులకు ప్రతినెలా రూ.1,500 అందించారు. ఆసరా పింఛన్లు అందుకుంటున్న లబ్ధిదారులు ఒక వైపే మొగ్గు చూపే అవకాశం ఉందనే భయంతో వారి ఓట్లను రాబట్టుకునేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీలు తాము అధికారంలోకి వస్తే రెట్టింపు చేస్తామని ప్రకటిస్తున్నాయి. ఆసరా లబ్ధిదారులు ఎవరి వైపు మెగ్గు చూపుతారనేది ఫలితాల అనంతరం తేలనుంది.  


రైతే లక్ష్యంగా.. 
వ్యవసాయమే ప్రధాన వృత్తిగా కొనసాగుతున్న జిల్లాలో రైతులు ఎవరివైపు నిలుస్తారన్నది తెలియాల్సిందే.  ప్రభుత్వం ఈ ఏడాది జూన్‌లో రైతుబంధు పథకం ద్వారా ఇప్పటికే రెండుసార్లు ఎకరానికి రూ.4వేల చొప్పున అందించింది. వనపర్తి నియోజకవర్గంలోని 79,374 మంది రైతులకు రూ.70.98కోట్లు అందించారు.

అలాగే రైతులు ప్రమాదవశాత్తు మరణిస్తే పదిరోజుల్లో బాధిత కుటుంబానికి సహాయం చేకూరే విధంగా రైతుబీమా పథకం ద్వారా 71,281 మందికి బీమా సౌకర్యం కల్పించారు. మరోసారి అధికారంలోకి వస్తే ఎకరానికి రూ.5వేల చొప్పున ఏడాదికి రూ.10వేల పెట్టుబడి సాయం అందిస్తామని ఇప్పటికే టీఆర్‌ఎస్‌ ప్రకటించగా, కాంగ్రెస్‌ కూడా దాన్ని అమలు చేస్తామని హామీ ఇచ్చాయి. రైతులు ఈ ఎన్నికల్లో ఎవరికి మద్దతుగా నిలుస్తారో వేచి చూడాలి. 


రెండు సామాజిక వర్గాల ఓట్లే కీలకం  
నియోజకవర్గంలో గొల్ల, కురుమ సామాజిక వర్గాలకు చెందిన ఓటర్లతోపాటు తెలుగు సామాజిక వర్గానికి చెందిన వారు అధికంగా ఉన్నారు. వీరిలో గొల్ల, కురుమల కోసం ప్రభుత్వం 2017నుంచి గొర్రెల పంపిణీ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో 5,817 మందికి గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు.

తెలుగు సామాజిక వర్గానికి చెందిన ప్రజలు అధికశాతం మందికి చేపల వృత్తి ప్రధానం కావునా మూడు పర్యాయాలుగా 123 చెరువుల్లో 99,18,730 చేప పిల్లలను ఉచితంగా వదిలారు. ఈ రెండు సామాజిక వర్గాల వారు ఏవైపు మొగ్గు చూపుతారనే  ఉత్కంఠ అందరిలో నెలకొంది. ఈ సామాజికవర్గాల ఓట్లు గెలుపోటములను ప్రభావితం చేసే స్థాయిలో ఉన్నాయి.  


పేదబిడ్డలకు పెళ్లిళ్లకు 
ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాలు పెంచాలని, అనవసరమైన ఆపరేషన్లను తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం 2017  జూన్‌ 3 నుంచి కేసీఆర్‌ కిట్‌ పథకాన్ని అమలు చేస్తోంది. ఈ పథకం ద్వారా 2,972 మంది లబ్ధిపొందారు. గతంలో ఆడపిల్ల పెళ్లిచేస్తే కుటుంబాలపై ఆర్థికభారం పడేది.

నాలుగేళ్లుగా క ళ్యాణలక్ష్మి పథకంలో 4,081 మందికి రూ. 25 కోట్లు, షాదీముబారక్‌ పేరుతో 371 మందికి రూ. 2.71కోట్లు ఆడబిడ్డల పెళ్లిళ్లకు ఖర్చుచేశారు. ప్రస్తుతం రూ.1.16లక్షలు అందిస్తున్నారు. గతం లో ఎన్నడూ లేని విధంగా కూతుళ్ల సంక్షేమానికి ప్రాధాన్యం ఇచ్చిన టీఆర్‌ఎస్‌కు మద్దతు ఇచ్చి ఓట్లు వేస్తారా లేక మరింత కాంగ్రెస్‌ పార్టీ వైపు మొగ్గు చూపుతారా? అన్నది వేచిచూడాల్సిన విషయం.   

మరిన్ని వార్తలు