చలి చంపేస్తోంది..

25 Dec, 2014 01:34 IST|Sakshi
చలి చంపేస్తోంది..

తెలంగాణ, ఏపీల్లో అత్యల్ప ఉష్ణోగ్రతలు
మరో రెండు రోజుల పాటు చలి తీవ్రత


సాక్షి, హైదరాబాద్, విశాఖపట్నం: చలిగాలుల తీవ్రత కొనసాగుతోంది. దక్షిణ తెలంగాణతో పోల్చితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోనూ చలి గజగజలాడిస్తోంది. విశాఖ మన్యంలో అత్యల్పంగా సున్నా డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రికార్డు స్థాయికి ఉష్ణోగ్రతలు పడిపోవడంతో జనం అల్లాడిపోతున్నారు. ఇళ్ల నుంచి బయటకు రాలేకపోతున్నారు. మరో రెండు రోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశముందని వాతావరణ శాఖ పేర్కొంది.
 
 ఈ నెల 27న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనున్నట్లు ఆ శాఖ నిపుణులు వెల్లడించారు. దీని ప్రభావంతో ఉష్ణోగ్రతలు కాస్త పెరగనున్నాయి. దీంతో చలి నుంచి కొంత ఉపశమనం లభించనుంది. ఇప్పటికే దక్షిణ కోస్తాంధ్ర, రాయలసీమల్లో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అల్పపీడనం వల్ల ఆకాశంలో మేఘాలు ఆవరిస్తాయని, ఫలితంగా ఉష్ణోగ్రతలు పెరిగి చలి తీవ్రత తగ్గుతుందని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం మాజీ అధికారి ఆర్.మురళీకృష్ణ తెలిపారు. అల్పపీడనం ప్రభావం ముఖ్యంగా దక్షిణకోస్తాంధ్ర, రాయలసీమపై కనిపిస్తుందన్నారు. అయినప్పటికీ మేఘాలు ఆవరించడం వల్ల తెలంగాణ, కోస్తాంధ్రల్లో ఇప్పటికన్నా ఉష్ణోగ్రతలు పెరుగుతాయని వివరించారు.
 
 ఉత్తరాది నుంచి చలిగాలుల ప్రభావం
 ఉత్తరాది నుంచి వీస్తున్న చలి గాలుల వల్ల తెలంగాణ, కోస్తాంధ్ర ప్రాంతాల్లో చలి ఎక్కువగా ఉంది. రానున్న 24 గంటల్లో రాష్ట్రంలోని ఆదిలాబాద్, కరీంనగర్, రంగారెడ్డి, నిజామాబాద్ జిల్లాల్లో     చలిగాలులు అధికంగా వీచే అవకాశముందని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) బుధవారం రాత్రి విడుదల చేసిన బులెటిన్‌లో తెలిపింది. అదే సమయంలో ఏపీలోని దక్షిణకోస్తా, రాయలసీమల్లో అక్కడక్కడ తేలికపాటి జల్లులు కురవవచ్చని పేర్కొంది. గడచిన 24 గంటల్లో కోస్తాంధ్రలో సాధారణంకంటే 3 డిగ్రీలు, తెలంగాణలో 4 డిగ్రీలు తక్కువగా, రాయలసీమలో 2 నుంచి 3 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. తెలంగాణ వ్యాప్తంగా చూస్తే.. గడచిన 24 గంటల్లో ఆదిలాబాద్ జిల్లాల్లో అత్యల్పంగా 7.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది.
 
  మెదక్ జిల్లాలో 11, వరంగల్‌లో 14.1, కరీంనగర్ 12.1, నిజామాబాద్‌లో 13.7, హైదరాబాద్/రంగారెడ్డి జిల్లాల్లో 14.7, ఖమ్మం జిల్లాలో 14.8, నల్లగొండ జిల్లాలో 15.4, మహబూబ్‌నగర్ జిల్లాలో 16.1 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక విశాఖ ఏజెన్సీలో ఎన్నడూ లేని విధంగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పాడేరుకు సమీపంలోని మినుములూరు కేంద్ర కాఫీబోర్డు కార్యాలయం వద్ద బుధవారం 3 డిగ్రీలు, పాడేరు ఘాట్‌లోని పోతురాజు స్వామి గుడి వద్ద 0 డిగ్రీలు, చింతపల్లి వ్యవసాయ పరిశోధన స్థానంలో 5 డిగ్రీలు, లంబసింగిలో 2 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పర్యాటకులు చలిని తట్టుకోలేక సాయంత్రానికే మైదాన ప్రాంతాలకు పయనమవుతున్నారు. కాగా, వచ్చే 24 గంటల్లో హైదరాబాద్‌లో రాత్రి ఉష్ణోగ్రతలు 13 డి గ్రీల కంటే తక్కువగా నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు